Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్యో ఖర్మ‌...టీడీపీకి రోజానే దిక్కైందే!

అయ్యో ఖర్మ‌...టీడీపీకి రోజానే దిక్కైందే!

ఆర్కే రోజా ఏ రాజ‌కీయ పార్టీలో ఉన్నా ఫైర్ బ్రాండే. టీడీపీ మ‌హిళా అధ్య‌క్షురాలిగా నాడు వైఎస్సార్ మొద‌లుకుని కాంగ్రెస్ నేత‌లెవ‌రినీ విమ‌ర్శించ‌కుండా విడిచి పెట్ట‌లేదు. నాడు చంద్ర‌బాబు త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని ఆమె నిల‌బెట్టుకున్నారు. నాడు టికెట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి... సొంత పార్టీ శ్రేణులే ఆమె ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాయి. దీంతో టీడీపీలో త‌న‌కు వెన్నుపోటు పొడిచార‌నే ఆవేద‌న‌తో ఆ పార్టీ నుంచి బ‌య‌టికొచ్చారు.

ఆ త‌ర్వాత అప్ప‌టి కాంగ్రెస్ ముఖ్య‌నేత భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి చొర‌వ‌తో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌ను క‌లిశారు. పార్టీలో చేరేందుకు సిద్ధ‌మైన ప‌రిస్థితిలో వైఎస్సార్ ఆక‌స్మిక మృతి చెందారు. అనంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల్లో ఆమె వైఎస్సార్ త‌న‌యుడు జ‌గ‌న్ వెంట న‌డిచారు. ఆ త‌ర్వాత న‌గ‌రి నుంచి ఆమె వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్ర‌స్తుతం ఏపీఐఐసీ చైర్‌ప‌ర్స‌న్‌గా కొన‌సాగుతున్నారు. వైసీపీలో ఆమె ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేడు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న శుభ సంద‌ర్భంగా రోజా మాట‌లు తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం. తెలుగు మ‌హిళా నాయ‌కురాలిగా 13 ఏళ్ల‌ క్రితం చంద్ర‌బాబు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రోజా ప్ర‌శంసాపూర్వ‌క మాట‌లే నేటికీ టీడీపీకి దిక్కు కావ‌డం గ‌మ‌నార్హం. 

వైసీపీ నాయ‌కురాలిగా చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసే రోజా ...నాటి కీర్త‌న‌ల‌ను ఎల్లో మీడియాతో పాటు టీడీపీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తూ టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.

నాడు చంద్ర‌బాబు గురించి రోజా ఏమ‌న్నారో తెలుసుకుందాం.

‘తెలుగుతల్లి అన్నపూర్ణ వరాలపట్టి.. అమ్మణ్ణమ్మ కలల పంట. నందమూరి సింహ రాజకీయ వారసుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధాదురంధురుడు, పేదల పాలిట పెన్నిధి, తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు.. జగమంతా మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర.. ధీర.. శూర రాజకీయ చక్రవర్తి.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు’ అంటూ రోజా కీర్తించారు.

ఎప్పుడో 13 ఏళ్ల‌ క్రితం రోజా ప్ర‌శంస‌లు త‌ప్ప టీడీపీకి మ‌రేత‌ర నేత‌ల కీర్త‌న‌లు దొర‌క‌లేదా? అనే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి. నాడు తెలుగు మ‌హిళా నాయ‌కురాలిగా పార్టీ అధినేతను ప్ర‌శంసించ‌కుండా, తిడుతుందా? అనే కామెంట్స్ వ‌స్తున్నాయి. 

అలాగే ప్ర‌స్తుతం వైసీపీలో కీల‌క నాయ‌కురాలిగా ఉన్న రోజా మాట‌ల‌ను వైర‌ల్ చేయ‌డం అంటే ...చంద్ర‌బాబుకు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు చెప్పేందుకు ఇన్నేళ్ల‌లో గుర్తు పెట్టుకోద‌గిన సొంత‌వాళ్లు అంటూ ఎవ‌రూ లేరా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కురాలి ప్ర‌శంస‌ల‌ను వైర‌ల్ చేసుకునే ఖ‌ర్మ టీడీపీకి ప‌ట్టింద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని వైసీపీ శ్రేణులు విమ‌ర్శిస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?