Advertisement

Advertisement


Home > Politics - Political News

ప‌వ‌న్‌ను టార్గెట్ చేసిన టీడీపీ

ప‌వ‌న్‌ను టార్గెట్ చేసిన టీడీపీ

ఇక ఆ నాయ‌కుడితో ప‌నిలేద‌ని భావిస్తే , వారిప‌ట్ల ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎంత ఘోరంగా ప్ర‌వ‌ర్తిస్తుందో అంద‌రికీ తెలుసు. మొట్ట మొద‌ట త‌న ఎల్లో మీడియాతో స‌ద‌రు నాయ‌కుడిపై నెగెటివ్ ప్ర‌చారాన్ని స్టార్ట్ చేస్తుంది. 

జ‌నంలో ఆ నాయ‌కుడిపై వ్య‌తిరేక భావ‌న ఏర్ప‌డేందుకు ఎల్లో మీడియాను పావుగా వాడుకుంటుంది. ఎల్లో మీడియా వెనుక ఉండి అంతా ఓ ప‌థ‌కం ప్ర‌కారం టీడీపీ క‌థ న‌డిపిస్తుంది. టీడీపీ రాజ‌కీయాలను బాగా అర్థం చేసుకున్న వాళ్లు త‌మ‌పై ఎల్లో మీడియా ఎందుకు దాడి చేస్తున్న‌దో తెలుసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను జ‌నంలో బ‌ద్నాం చేయ‌డానికి టీడీపీ స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా తాను చెప్పిన‌ట్టు తోక ఊపే మీడియా వేదిక‌గా ప‌వ‌న్‌ను టీడీపీ టార్గెట్ చేసింది. 

త‌మ‌తో క‌లిసి వ‌స్తాడ‌ని, కాపు సామాజిక వ‌ర్గ ఓట్లు క‌లిసి వ‌స్తాయ‌నే ఆశ అడుగంట‌డంతో జ‌న‌సేనాని ప‌వ‌న్ విష‌యంలో టీడీపీ త‌న వైఖ‌రి మార్చుకున్న‌ట్టు ....ప‌చ్చ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

ఏపీలో రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని స‌ద‌రు మీడియా సంస్థ నిల‌దీస్తూ క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేయ‌డం జ‌న సైనికులకి త‌త్వం బోధ‌ప‌రుస్తోంది. 

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాతైనా త‌మ‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క‌లిసి వ‌స్తార‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే బాబు అంచ‌నా త‌ప్పింది. బీజేపీతో జ‌న‌సేనాని క‌లిసి ప్ర‌యాణించేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు.

దీంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు లేదా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు కావ‌చ్చు... ప‌వ‌న్ ప‌ట్ల సానుకూల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల టీడీపీకి న‌ష్ట‌మే త‌ప్ప ఎలాంటి లాభం లేద‌ని చంద్ర‌బాబు ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. 

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూడా లోకేశ్ పోటీ చేసిన మంగ‌ళ‌గిరిలో బ‌ల‌హీన‌మైన సీపీఐకి ప‌వ‌న్ సీటు కేటాయించ‌డం , అలాగే ప‌వ‌న్ పోటీ చేసిన భీమ‌వ‌రం, గాజువాక‌లో చంద్ర‌బాబు ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌త్య‌ర్థి పార్టీ వైసీపీ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది.

త‌మ‌ను అధికారంలోకి రాకుండా చేయ‌డానికి బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నార‌ని జ‌గ‌న్ స‌రికొత్త వాద‌న‌ను తెర‌పైకి తేవ‌డం, దాన్ని జ‌నం న‌మ్మ‌డం తెలిసిందే. దీంతో రెండు పార్టీలు ఘోరంగా దెబ్బ‌తిన్నాయి. 

తాజా ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎటూ త‌మ‌తో క‌లిసి రాడ‌ని చంద్ర‌బాబు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. క్ర‌మంగా ప‌వ‌న్‌పై నెగెటివిటీని పెంచ‌డం వ‌ల్ల జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించే వాళ్లు జ‌న‌సేన వైపు కాకుండా, త‌న వైపు తిప్పుకోవ‌చ్చ‌ని బాబు భావిస్తున్నారు.  

ప‌వ‌న్‌పై ఆ మీడియా వేదిక‌గా సంధిస్తున్న ప్ర‌శ్న‌లు మామూలుగా వేస్తున్న‌వి కాద‌ని జ‌న‌సేన‌కు బాగా తెలుసు. ప‌వ‌న్‌ను నిల‌దీస్తున్న‌ది స‌ద‌రు మీడియా ఎంత మాత్రం కానేకాదు. అడిగేదెవ‌రో, అడిగిస్తున్న‌దెవ‌రో ఏపీ రాజ‌కీయాల‌ను, ఆ మీడియా పోక‌డ‌ల గురించి గ‌మ‌నిస్తున్న వారికి బాగా తెలుసు. ఇంత‌కూ ప‌వ‌న్‌ను టీడీపీ అలియాస్ ప‌చ్చ మీడియా ఏమ‌ని ప్ర‌శ్నిస్తున్న‌దో, నిల‌దీస్తున్న‌దో తెలుసుకుందాం.

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం రోజుకో మాట చెబుతూ గంద‌ర‌గోళ ప‌రుస్తోంది. పోల‌వ‌రం నిర్వాసితుల గురించి గ‌తంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడారు. గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంలో వాటి మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం ప‌వ‌న్ నోరు మెద‌ప‌డం లేదు. పోల‌వ‌రంపై ఈ ద్వంద్వ వైఖ‌రి ఏంట‌ని బీజేపీని ప‌వ‌న్ నిల‌దీయ‌డానికి నోరు రాలేదేం? అంతేకాదు, గ‌ట్టిగా అడ‌గాల‌ని వైసీపీని డిమాండ్ చేయ‌లేదేం?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై రాజ‌కీయ పార్టీల అభిప్రాయాల‌ను ఎస్ఈసీ అడిగింది. స‌మావేశానికి రాలేమ‌ని అధికార పార్టీ వైసీపీ తేల్చి చెప్పింది. కానీ ఎంతో మంది నేత‌లున్న‌ప్ప‌టికీ జ‌న‌సేన మాత్రం విచిత్రంగా ఎస్ఈసీకి మెయిల్‌లో అభిప్రాయం పంపింది. 

ఎస్ఈసీని నేరుగా క‌లిసి అభిప్రాయం చెప్ప‌డానికి వ‌చ్చిన ఇబ్బంది ఏంటో ఏమీ అర్థం కాదు. అందులోనూ ఎస్ఈసీ ఏ నిర్ణ‌యం తీసుకుంటే దానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని జ‌న‌సేన చెప్ప‌డం ఏంటి?  మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ త‌న వైఖ‌రి స్ప‌ష్టంగా చెప్పింది క‌దా? మ‌రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంత రగడ జరుగుతున్నా పవన్ మాట మాత్రం కూడా మాట్లాడ‌క‌పోవ‌డంలో ఆంత‌ర్యం ఏంటి?

అలాగే అమ‌రావ‌తి ఉద్య‌మం 300 రోజులు దాటింది. గ‌తంలో రాజ‌ధాని రైతుల‌కు తానున్నా అని, ఎక్క‌డికీ పోద‌ని గొప్ప‌లు చెప్పిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌... ఇప్పుడు ప‌త్తాలేకుండా పోయారే! ఇద్ద‌రు రైతుల‌కు బేడీలు వేసిన ఘ‌ట‌న‌పై ప్ర‌తి ఒక్క‌రూ మండిప‌డుతున్నా ... ప‌వ‌న్ మాత్రం ఎందుకు స్పందించ‌డం లేదో అర్థం కాదు.

బీజేపీతో స్నేహం చేసిన జనసేన.. దాని నాయకుడు పవన్ మాత్రం ఎప్పుడు దేనిమీద రియాక్ట్ కావాలో తెలియకో.. లేక ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారో.. లేక కమలం ఆదేశాలు వస్తేనే రియాక్ట్ అవుతారో తెలియదంటూ జ‌న‌సేనానిపై టీడీపీ దాడి మొద‌లు పెట్టింది.  

రాజకీయ అవకాలు వస్తున్న వేళ వాటిని కాలదన్నుకునే రీతిలో సైడ్ అయిపోయి.. సినిమాల్లో బీజీ అయిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయంటూ ప‌వ‌న్‌పై ఘాటు విమ‌ర్శ‌ల‌తో ఎల్లో మీడియా ద్వారా టీడీపీ దాడి షురూ  చేసింది.

గ‌తంలో కూడా టీడీపీని జ‌న‌సేనాని విభేదించిన‌ప్పుడు .... ఆయ‌న‌పై ఇదే రీతిలో ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ....స‌ద‌రు ఎల్లో చాన‌ళ్ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిదాడి చేసిన విష‌యం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ ప‌రువు న‌ష్టం దావా వేసిన విష‌యం కూడా తెలిసిందే. బ‌హుశా కోర్టుల్లో ఇప్పుడే తేలే వ్య‌వ‌హారం కాద‌ని కాబోలు ...  త‌న ప‌రువు తీసిన నాయ‌కుడిపై ఇలా ప్ర‌తీకార వార్త‌ల‌ను వండి వార్చ‌డం ద్వారా త‌న ఇష్ట నాయ‌కుడిని మెప్పించ‌డంతో పాటు త‌న కోరిక నెరవేరుతుంద‌ని చేస్తున్న‌ట్టుందని  జ‌న‌సేన అభిప్రాయ‌ప‌డుతోంది. 

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?