cloudfront

Advertisement


Home > Politics - Political News

అరాచకం: ప్రశ్నిస్తే విగ్రహం పెట్టేస్తారా..?

అరాచకం: ప్రశ్నిస్తే విగ్రహం పెట్టేస్తారా..?

ఏపీలో గల్లా జయదేవ్ ను హీరోను చేసే ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే వరుస సన్మానాలతో జయదేవ్ ను నేలపై నిలవకుండా చేస్తున్న తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు ఏకంగా అతడికి విగ్రహం పెట్టాలని ఆలోచిస్తున్నాయి. ఇదంతా ఎందుకు? లేకలేక అతడు పార్లమెంట్ లో మాట్లాడినందుకు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్నందుకు. 

మాట్లాడదలుచుకున్న విషయాన్ని చెబుతూ ముందుగానే స్పీకర్ కు నోట్ ఇస్తే పార్లమెంట్ లో ఎవరికైనా అవకాశం వస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందనే బర్నింగ్ ఇష్యూ మీద మాట్లాడతామంటే తెలుగు ఎంపీలకు కచ్చితంగా అవకాశం వస్తుంది. ఆ స్థానంలో గల్లా జయదేవ్ మాత్రమే కాదు, ఏ ఎంపీ ఉన్నా అవకాశం ఇస్తారు. అప్పటికే సిద్దం చేసుకున్న స్పీచ్ చదివితే సరిపోతుంది. జయదేవ్ కూడా అదే చేశారు. కాకపోతే తన ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని జోడించి చదివారంతే. ఆ మాత్రం దానికే విగ్రహాలు పెట్టేస్తారా..? 

కేంద్రాన్ని నిలదీశారని, మోదీని సూటిగా ప్రశ్నించారని గల్లా జయదేవ్ ను ఆకాశానికెత్తేస్తోంది తెలుగుదేశం. అవకాశమిస్తే గల్లా జయదేవ్ స్థానంలో ఏ ఎంపీ అయినా ఇలానే ప్రశ్నిస్తాడు. అయినా జయదేవ్ తనకుతానుగా ఎత్తుకున్న అంశం కాదిది. చంద్రబాబు ఆదేశాలతోనే ఈ పనిచేశారు. ఈమాత్రం దానికే విగ్రహాలు పెట్టేస్తారా..?

దేశచరిత్ర తిరగేస్తే అద్భుతంగా మాట్లాడిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. పార్లమెంట్ రికార్డులు తిరగేస్తే ప్రతిపార్టీలో అలా మాట్లాడిన వ్యక్తులు మనకు కనిపిస్తారు. జయదేవ్ మాటలు కూడా రికార్డుల్లో నిక్షిప్తం అవుతాయి. కానీ ఒకప్పటి ప్రధాని వాజ్ పేయి పార్లమెంట్ ప్రసంగం సరసన జయదేవ్ స్పీచ్ ను చేరుద్దామా..? వాజ్ పేయిని కూడా మించిన రీతిలో జయదేవ్ కు విగ్రహం పెట్టేద్దామా..?

ప్రస్తుతం తెలుగుదేశం వ్యవహారశైలి ఇలానే కనిపిస్తోంది. చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగానికి, గల్లా జయదేవ్ పార్లమెంట్ ప్రసంగం ఏమాత్రం తీసిపోదని సంబరపడిపోతున్నారు వాళ్లు. అందుకే జయదేవ్ ప్రసంగించిన పోజుతో ఓ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని గుంటూరు టీడీపీ నేతలు భావిస్తున్నారట. గుంటూరు నడిబొడ్డున ఆ విగ్రహం పెట్టాలనుకుంటున్నారట.

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, ఎవడో వచ్చి ఆ మంటలో తాపీగా చుట్ట వెలిగించుకున్నాడట. ఇప్పుడు ఏపీలో గల్లా జయదేవ్ వ్యవహారం అచ్చంగా అలానే ఉంది. ఓవైపు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ అన్ని పక్షాలు గగ్గోలు పెడుతుంటే.. ఆ ఆందోళనల మధ్య జయదేవ్ ను హీరోను చేసే ప్రక్రియను తెలుగుదేశం దిగ్విజయంగా ప్రారంభించింది. 

ఏపీకి జరిగిన అన్యాయంపై జయదేవ్ పార్లమెంట్ లో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీన్ని ఎవరూ తప్పుపట్టడంలేదు. అది సమంజసం కూడా. అయితే వాట్ నెక్ట్స్ అనే విషయంపై చర్చ అవసరం. అది వదిలేసి జయదేవ్ చుట్టూ జరుగుతున్న తంతు ఏంటి? ఇదంతా ఎందుకు? విషయాన్ని పక్కదోవ పట్టించడానికా? లేక జయదేవ్ వ్యక్తిగత స్వార్థమా? ఏదేమైనా విషయం విగ్రహ స్థాపన వరకు వెళ్లిందంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు.