
ఆఖరి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరిగిన వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జీరోగా నిలవడం ఆసక్తిదాయకంగా మారింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ జీరోగా నిలిచింది.
వాటిల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల తో పాటు, మాచర్ల, పుంగనూరు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో టీడీపీ పూర్తిగా జీరోగా నిలిచింది. ఒక్కటంటే ఒక్క పంచాయతీలో నెగ్గిన అభ్యర్థి కూడా తను తెలుగుదేశం అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఏకగ్రీవాలు గట్టిగా చోటు చేసుకున్న నియోజకవర్గాలు కూడా ఇవే.
వీటిల్లో జమ్మలమడుగు నియోజకవర్గం మరింత ప్రత్యేకం. ఇక్కడ తెలుగుదేశం జీరోనే అయినా.. అన్ని పంచాయతీలూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడలేదు. 11 పంచాయతీల్లో ఇక్కడ నెగ్గిన పలువురు తాము బీజేపీ అంటున్నారట.
వైఎస్ ఫ్యామిలీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో పులివెందుల తర్వాత జమ్మలమడుగుకే పేరు. అనంతపురం జిల్లాతో సరిహద్దును పంచుకునే ఈ నియోజకవర్గం లో వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేని పట్టుంది. ఇక్కడ బీజేపీ తరఫున కొంతమంది పంచాయతీ సభ్యులు చెప్పుకోవడానికి ఉన్న కారణం ఏమిటో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీజేపీ అని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి అధికారం చేజారిన తర్వాత ఆదినారాయణ రెడ్డి ఆ పార్టీకి దూరం అయిన సంగతి తెలిసిందే.
అక్కడక్కడ పల్లెల్లో మిగిలిన ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పంచాయతీ ఎన్నికల్లో గెలవగలిగారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి మద్దతుదార్లు తాము బీజేపీ అని అంటుండటంతో.. అక్కడ బీజేపీ ఖాతాలో కొన్ని పంచాయతీలు పడ్డాయి. అటు ఆదినారాయణ రెడ్డి దూరమై, ఇటు రామసుబ్బారెడ్డి కూడా దూరం కావడంతో.. తెలుగుదేశం పార్టీ జీరో అయ్యింది.