cloudfront

Advertisement


Home > Politics - Political News

టీడీపీకి బాలయ్య దెబ్బ గట్టిగానే తగులుతుందట

టీడీపీకి బాలయ్య దెబ్బ గట్టిగానే తగులుతుందట

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, ఎన్నికల వేళ చక్రం తిప్పుతున్నారు. తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల పంపకాలకు సంబంధించి కొన్ని నియోజక వర్గాలపై బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారట. బాలయ్య దెబ్బకి చంద్రబాబుకి సైతం మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోందని తెలుగుదేశం పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఓ వైపు లోకేష్‌, ఇంకోవైపు భరత్‌.. ఇలా బాలయ్య ఇద్దరు అల్లుళ్ళూ ఇప్పుడు ఎన్నికల బరిలో నిలుచుంటున్నారు.

లోకేష్‌, స్వయానా చంద్రబాబు పుత్రరత్నం గనుక.. 'గెలుపు' అవకాశాల్ని సొంత సర్వేల ద్వారా పసిగట్టి, విశాఖజిల్లాను ఎంచుకున్నారు చంద్రబాబు. అయితే, ప్రత్యామ్నాయంగా మంగళగిరిని ఎప్పుడో లోకేష్‌ ఎంచుకున్నారు. అదే ఇప్పుడు లోకేష్‌కి ఖాయమయ్యింది. మరో అల్లుడు భరత్‌కి బాలయ్య విశాఖ నుంచి టిక్కెట్‌ (ఎంపీ అభ్యర్థిగా) ఇప్పించుకోవడం దాదాపు ఖాయమయ్యింది. విశాఖ కాకపోతే, రాజమండ్రి నుంచి అయినా భరత్‌ పోటీచేసే అవకాశాలు వున్నాయట.

ఇదిలావుంటే, బాలయ్య దెబ్బకి ఓ మంత్రిగారి టిక్కెట్‌ గల్లంతయ్యిందనే ప్రచారం జరుగుతోంది టీడీపీలో. ఆ టిక్కెట్‌ ఇంకెవరిదో కాదు, శిద్ధా రాఘవరావుది. దర్శి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారాయన. ఆయన స్థానానికి ఎసరు పెట్టింది బాలయ్యేనట. ఇదొక్కటే కాదు, దాదాపు పది నుంచి పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయమై బాలయ్య 'ఆజ్ఞలకు' అనుగుణంగానే చంద్రబాబు నడుచుకోవాల్సి వస్తోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

అన్నట్టు, తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాలయ్య 'పెత్తనం' బాగానే సాగింది. సినీ నిర్మాత భవ్య ఆనంద ప్రసాద్‌ బరిలోకి దిగడం వెనుక బాలయ్య కీలకపాత్ర పోషించారు. మరికొన్ని నియోజకవర్గాలపైనా బాలయ్య పెత్తనం బాగానే చెలాయించారు.. సీట్ల కేటాయింపుకి సంబంధించి. అయినా ఏం లాభం.? టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మట్టికరిచేసింది.

మరిప్పుడు, బాలయ్య పెత్తనం ఆంధ్రప్రదేశ్‌లో ఏమవుతుంది.? తేడావస్తే, 'అంతా బాలయ్యే చేశాడు..' అంటూ పార్టీ శ్రేణుల్ని బాలయ్య వైపు చంద్రబాబు ఉసిగొల్పితే ఆశ్చర్యపోవడానికేముంటుంది.!

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

బాబుది ఎదురుదాడే.. నిజాన్ని ఎదుర్కొనలేరు!