cloudfront

Advertisement


Home > Politics - Political News

టీడీపీలో అసలేం జరుగుతోంది చంద్రబాబూ.!

టీడీపీలో అసలేం జరుగుతోంది చంద్రబాబూ.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని చూశాం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసం ప్రదర్శించారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. మంత్రులపై వ్యతిరేకత వున్నా, పార్టీ జెండా బలం ముందు.. చిన్నపాటి వ్యతిరేకత పెద్ద ఇబ్బంది ఏమీ కాదని నమ్మారాయన. ఒకటి రెండు మినహాయిస్తే, మొత్తంగా సిట్టింగ్‌లకే అవకాశాలు కల్పించారు కేసీఆర్‌. సీట్ల పంపకాలకు సంబంధించి పార్టీలో వ్యతిరేకత చాలా తక్కువగా కన్పించింది.

కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అధికార తెలుగుదేశం పార్టీ పిల్లిమొగ్గలేసేస్తోంది టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు టిక్కెట్ల కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. కొందరు కాంప్రమైజ్‌ అవుతున్నారు, కొందరు పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు, మరికొందరు నానాపాట్లూ పడుతున్నారు. మొత్తంగా చూస్తే, తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం కన్పిస్తోంది.

ఎన్నికల వేళ ఇలాంటి వ్యవహారాలు 'కొంత మామూలే' కావొచ్చుగానీ, మరీ ఈ స్థాయిలో అధికార పార్టీ పిల్లిమొగ్గలు వేయడం గతంలో ఎన్నడూ చూడలేదని తలపండిన రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిగారి పుత్రరత్నానికి కేటాయించాల్సిన సీటు విషయంలో ఇంత గందరగోళమేంటన్నది చాలామంది సంధిస్తోన్న ప్రశ్న. ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి పరిస్థితి ఏమయ్యిందో చూస్తున్నాం. మంత్రి పరిటాల సునీత పరిస్థితీ అంతే. గంటా శ్రీనివాసరావు సంగతి సరే సరి.

ఒక్కమాటలో చెప్పాలంటే, గందరగోళం లేకుండా చంద్రబాబు టిక్కెట్లు కేటాయించింది పది మందికో పాతిక మందికో మాత్రమే కావొచ్చు. మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ తీవ్ర గందరగోళమే. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే చాలా కసరత్తు చేశారు చంద్రబాబు. అయినా, ఇంతలా అయోమయం నెలకొనడమంటేనే, చంద్రబాబు ఎంతగొప్పగా ఆ కసరత్తులు చేశారో అర్థమవుతుంది. పార్టీ పట్ల చంద్రబాబుకి 'కమాండ్‌' లేదు, చంద్రబాబు పట్ల పార్టీ నేతలకి గౌరవంలేదు.

ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు.. ఎవరో, ఎక్కడివారో, ఇంకెక్కడినుంచో బరిలోకి దిగితే, పార్టీ గెలుపు సంగతి దేవుడెరుగు.. డిపాజిట్లు అయినా వస్తాయా.? రావా.? అన్న అనుమానాలు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తోన్న క్యాడర్‌ నుంచే వ్యక్తమవుతున్నాయి. ఫార్టీ ఇయర్స్‌ రాజకీయ అనుభవంతో చంద్రబాబు, పార్టీని ఈ స్థాయిలో భ్రష్టు పట్టించేయడం విశేషమే మరి.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!