Advertisement

Advertisement


Home > Politics - Political News

మళ్లీ తెరపైకి సర్కారీ మటన్ షాపులు..!

మళ్లీ తెరపైకి సర్కారీ మటన్ షాపులు..!

అదేంటి.. మటన్ షాపులపై వైసీపీ సర్కారు అప్పుడే వెనక్కు తగ్గింది కదా, మళ్లీ ఈ వ్యవహారమేంటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రతిపాదన. 

ఇటీవల ఏపీలో ఇలాంటి ప్రతిపాదన రాగా.. తీవ్ర విమర్శల మధ్య ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముందుకేనంటోంది. మటన్ షాపులతో పాటు, ఫిష్ మార్కెట్ నిర్వహణ కూడా తానే తీసుకుంటోంది.

నాణ్యమైన మటన్.. సరసమైన ధర..

వినియోగదారుడికి సరసమైన ధరల్లో, పరిశుభ్రమైన మాంసాన్ని అందించడమే లక్ష్యంగా తెలంగాణ పశు సంవర్థక శాఖ ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలోని అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రచించింది. 

ఇందులో భాగంగా కబేళాలు ప్రభుత్వ అధీనంలో నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి జోన్ లో ఓ ప్రభుత్వ కబేళా ఉంటుంది. జిల్లాల్లో అవసరాన్నిబట్టి ఒకటి లేదా రెండు కబేళాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికి కబేళాల నిర్వహణ వరకే ప్రభుత్వం తమ పరిధిలోకి తీసుకుంటోంది. అక్కడినుంచి పరిశుభ్రమైన మాంసాన్ని దుకాణాలకు ప్రభుత్వమే అందిస్తుంది.

ప్రభుత్వ మాంసం.. ప్రభుత్వ ధర..

ప్రభుత్వం అందించే మాంసాన్నే దుకాణదారులు విక్రయించాలి. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి మాత్రమే మాంసాన్ని అమ్మాల్సి ఉంటుంది. మాంసం దుకాణాల్లో పరిశుభ్రత పాటించేలా ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. పర్యవేక్షకుడిని ఏర్పాటు చేస్తారు. 

ఇక కబేళాల్లో రిఫ్రిజిరేటర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే మాంసాన్ని అమ్మే దుకాణాలను ఆధునీకరించేందుకు సర్కారే బ్యాంకులతో మాట్లాడి రుణాలు కూడా మంజూరు చేస్తుంది.

ప్రస్తుతం మటన్ షాపులకు ప్రభుత్వం అనుమతులు మాత్రమే ఇస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 10వేల షాపులుండగా, అందులో 2వేల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంది. మిగతా వాటిని కూడా ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది.

సర్కారు వారి చేపల మార్కెట్..

తెలంగాణలో ఇటీవల మత్స్య సంపద బాగా పెరిగింది. అయితే మత్స్యకారులకు మాత్రం ఆశించిన స్థాయిలో ఆదాయం రావడంలేదు. ఈ నేపథ్యంలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగుతోంది.

ప్రభుత్వమే మత్స్యకారుల నుంచి నేరుగా చేపలను కొని ప్రజలకు విక్రయించాలని చూస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా చేపలను ఇకపై ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.

ప్రతిపక్షాలేమంటాయో..?

ఏపీలో మటన్ షాపుల నిర్వహణపై ప్రతిపక్షాలు సెటైర్లు పేల్చాయి. ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన మాంసం అమ్మే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. చాలామందికి వింతగా తోచింది. 

మాంసం అమ్ముకుంటున్న జగన్ సర్కార్ అంటూ కామెడీ చేశారు చాలామంది. మరి తెలంగాణలో ప్రజలు, ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తాయో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?