cloudfront

Advertisement


Home > Politics - Political News

కూటమి.. ఓటమి సాధ్యమేనా?

కూటమి.. ఓటమి సాధ్యమేనా?

తెలంగాణ కాంగ్రెసు లక్ష్యం ఒక్కటే. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడదీసి కూటమి ఏర్పాటు చేయడం, తద్వారా అధికార పార్టీని ఓడించడం,  తన నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. కాని ఇది సాధ్యమవుతుందా? అవుతుందనుకొని కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మిత్రపక్షం.

మిగిలినవి అంటే కాంగ్రెసు, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి...ఇవన్నీ వ్యతిరేకం. వైకాపా, జనసేన గురించి ఇప్పటివరకు ఎవ్వరూ ప్రస్తావించడంలేదు. వాటి ఉనికి కనబడటంలేదు. ఇక ఉనికిలో ఉన్న మరో ప్రధాన పార్టీ టీడీపీ. బీజేపీ అధికార పార్టీకి వ్యతిరేకమేగాని కాంగ్రెసు ప్రతిపాదిస్తున్న కూటమిలో చేరదు కాబట్టి పక్కన పెడదాం.

ఇక మిగిలినవి కమ్యూనిస్టు పార్టీలు, కోదండరామ్‌ పార్టీ, టీడీపీ. ఈ మూడింటినీ కలుపుకొని మహా కూటమి ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కాంగ్రెసు ఆలోచన. కమ్యూనిస్టు పార్టీలు, తెలగాణ జన సమితి అధికార పార్టీకి పక్కా వ్యతిరేకం. టీడీపీ మీదనే అనుమానాలున్నాయి. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేమనో, అనుకూలమనో స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవచ్చని గతంలో ప్రచారం జరిగింది. కూటమిలోకి టీడీపీని తీసుకురావాలని కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీతో, కోదండరామ్‌ పార్టీతోపాటు సీపీఐ, సీపీఎం, దాని నేతృత్వంలో 28 ప్రజాసంఘాలతో ఏర్పాటైన బహుజన వామపక్ష కూటమి (బీఎల్‌ఎఫ్‌)తో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

కాంగ్రెసుతో కలవడానికి కోదండరామ్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీతో పొత్తు పెటాకులైంది కాబట్టి తమతో కలవడానికి టీడీపీకి అభ్యంతరం ఉండకపోవచ్చని కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. ఏపీ టీడీపీ నేతలు కూడా కాదనరని అనుకుంటున్నారు. రాష్ట్రం విభజించినందుకుగాను ఏపీలో కాంగ్రెసు భూస్థాపితమైంది. అయితే ఆనాడు కాంగ్రెసు చేసిన అన్యాయం కంటే విభజన తరువాత బీజేపీ చేసిన అన్యాయం కొన్ని రెట్లు ఎక్కువ. దీంతో ప్రజాగ్రహం కాంగ్రెసు మీది నుంచి బీజేపీ పైకి మళ్లింది. ప్రత్యేక హోదా ఉద్యమానికి పార్లమెంటులో, బయటా  కాంగ్రెసు మద్దతు ఇచ్చింది. అధికారంలోకి రాగానే హోదా ఇస్తామంటూ వాగ్దానం చేయడమే కాకుండా అధికారికంగా తీర్మానం చేసింది.

ఈ కారణాల వల్ల తెలంగాణలో కాంగ్రెసుతో కలవడానికి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నారు. తెలంగాణలో టీడీపీతో బీజేపీ  ఏకపక్షంగా ఏనాడో తెగదెంపులు చేసుకుంది.  కాబట్టి రెండు రాష్ట్రాల్లో  ప్రత్యేర్థే. ఏపీలో బీజేపీ భూస్థాపితమేనని ప్రజాభిప్రాయం. తెలంగాణలోనూ అలాగే కావాలని టీడీపీ కోరుకుంటుంది కదా. కాంగ్రెసుతో కలిస్తే ఈ కోరిక నెరవేరుతుందేమో ఆలోచించుకోవాలి. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక పార్టీలన్నీ ఒక వేదిక మీదకు వచ్చి కూటమిగా ఏర్పడితే అధికార పార్టీని ఓడించడం కష్టం కాదని కాంగ్రెసు భావిస్తోంది.

కూటమి కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూసుకోవచ్చు. సర్కారుపై ప్రజావ్యతిరేకత ఉందని, దానికి కూటమి తోడైతే తప్పక విజయం సాధించవచ్చని అనుకుంటోంది. 119 అసెంబ్లీ సీట్లకుగాను తాను 70 సీట్లలో పోటీ చేసి 39 కూటమిలోని పార్టీలకు ఇస్తానని కాంగ్రెసు ప్రతిపాదిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే భావసారూప్యత ఉన్న అంశం. ఈ ఒక్క అంశం ప్రాతిపదికగా పార్టీలు ఏకం కావాలంటే సిద్ధాంతాలకు, రాజకీయ భావజాలానికి అతీతంగా వ్యవహరించగలగాలి. అది ఎంతవరకు సాధ్యమవుతుందో మరి...!