Advertisement


Home > Politics - Political News
తెలుగుదేశంలో 'లోకేష్' ముసలం

అంతా భయపడినట్టే అయింది. తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. అది లోకేష్ ద్వారానే పుడుతుందని చాలామంది దేశం నేతలు అనుమానించారు. ఆ భయమే ఇప్పుడు నిజమైంది. అవును.. మొన్నటివరకు తన మాటలతో కామెడీ పండించిన చినబాబు, ఇప్పుడు తన వ్యాఖ్యలతో అగ్గిరాజేశాడు. కర్నూలు సాక్షిగా లోకేష్ చేసిన కామెంట్స్ టీడీపీలో కాక రేపుతున్నాయి. 

ఓ ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన లోకేష్.. ఎస్వీ మోహన్ రెడ్డికే అంతా ఓట్లు వేసి గెలిపించాలంటూ పిలుపునివ్వడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీనిపై స్థానిక ఎంపీ టీజీ వెంకటేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అలా ఏకపక్షంగా అభ్యర్థి పేరును ప్రకటించడం ఏమాత్రం బాగాలేదంటున్నారు టీజీ.

"లోకేష్ గారు ఓ మంత్రి. వచ్చింది ప్రభుత్వ కార్యక్రమానికి. ఆయన టీడీపీ ప్రతినిధి కాదు. ముఖ్యమంత్రి అంతకంటే కాదు. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చి ఎమ్మెల్యే, ఎంపీలుగా వ్యక్తుల పేర్లను ఎనౌన్స్ చేయడం నిజంగా నాకు అంతుబట్టడం లేదు."

ఓవైపు లోకేష్ వ్యవహార శైలిని తప్పుబడుతూనే, మరోవైపు టీడీపీపై తనదైన స్టయిల్ లో పరోక్షంగా విమర్శలు గుప్పించారు టీజీ వెంకటేష్. తెలుగుదేశంలో నిర్ణయాలన్నీ అర్థరాత్రి తీసుకుంటారంటూ టీజీ వెంకటేష్ సీరియస్ గా చెప్పడం అందరికీ నవ్వు పుట్టించింది.

"తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా అర్థరాత్రి నిర్ణయాలు తీసుకుంటుంది. పొద్దున్న బి-ఫారం ఇస్తుంది. మరి లోకేష్ ఎందుకు అలా స్పందించారో తెలీదు. మోహన్ రెడ్డి ఏమైనా హిప్నటిజం చేశారేమో. ఏమో చెప్పలేం, మా మోహన్ రెడ్డి ఏమైనా చేయగలడు."

ఇలా లోకేష్ పై, టీడీపీపై పరోక్షంగా విమర్శలు ఎక్కుబెట్టారు టీజీ. తనకు ఎంపీ పదవి ఇవ్వడమే అడ్డంకి అనుకుంటే, ఆ పదవిని వదులుకోవడం తనకు చిటికెలో పని అంటున్నారు టీజీ. ఈయన ఇంత అభ్యంతరం వ్యక్తంచేయడానికి, ఏకంగా టీడీపీ నంబర్-2 (తెలుగుదేశం భాషలో నంబర్-2 అంటే లోకేష్)నే ధిక్కరించడానికి మరో కారణం కూడా ఉంది.

రాబోయే ఎన్నికల్లో తన తనయుడ్ని ఎమ్మెల్యేగా నిలపాలనేది టీజీ ప్లాన్. అందుకు తగ్గట్టు ఆయన తెరవెనక పావులు కదుపుతూ వస్తున్నారు. క్యాడర్ ను సమాయత్తం చేస్తూ వచ్చారు కూడా.  ఇక రేపోమాపో చంద్రబాబును కలిసి ఆయన చెవిలో ఈ వార్త పడేయడమే ఆలస్యం అనుకుంటున్న టైమ్ లో లోకేష్ తన నోటికి పనిజెప్పారు.

కామెడీ బదులు వివాదం పుట్టించారు. టీడీపీలో తాజాగా పుట్టిన ఈ ముసలం ఎలాంటి విచ్ఛిన్నానికి దారితీస్తుందో, ఎన్ని ఫిరాయింపులకు ఉసిగొల్పుతుందో చూడాలి.