Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్రేమోన్మాదానికి ఆరిపోయిన యువ‌ తేజం

ప్రేమోన్మాదానికి ఆరిపోయిన యువ‌ తేజం

ప్రేమోన్మాదానికి ఓ యువ తేజం ఆరిపోయింది. ఎంతో భ‌విష్య‌త్ ఉన్న ఆ యువ‌తి శాడిస్ట్ చేతిలో బ‌లైంది. నాగ‌రిక స‌మాజం సిగ్గు ప‌డే ఘ‌ట‌న నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది.

గూడూరులో పి.సుధాక‌ర్‌, స‌రిత అనే ఉపాధ్యాయ దంప‌తులు నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె తేజ‌శ్వ‌ని, కుమారుడు కార్తిక్ ఉన్నారు. తేజ‌శ్వ‌ని ఇంజ‌నీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థిని. సుధాక‌ర్ స‌హ‌చ‌ర ఉద్యోగి చెంచుకృష్ణ‌య్య కుమారుడు వెంకేట‌ష్‌కు తేజ‌శ్వ‌నితో ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌కు దారి తీసింది. అయితే ఏడాదిగా వెంక‌టేష్ ప్ర‌వ‌ర్త‌న‌లో తేడా రావ‌డంతో తేజ‌శ్వ‌ని అత‌న్ని దూరం పెట్టింది. ఈ విష‌య‌మై పెద్ద‌ల‌కు కూడా చెప్పింది. వెంక‌టేష్‌ను అత‌ని తండ్రి బెంగ‌ళూరుకు పంపాడు.

అయితే కరోనా కారణంగా బెంగ‌ళూరు నుంచి వెంక‌టేష్ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో గూడూరు వచ్చాడు. అప్ప‌టి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. తిరిగి త‌న‌ను ప్రేమించాల‌ని తేజ‌శ్వ‌నిని అత‌ను వేధించ‌డం స్టార్ట్ చేశాడు. ఈ నేప‌థ్యంలో అత‌ని వేధింపుల నుంచి త‌ప్పించుకునేందుకు సెల్ నంబ‌ర్ మార్చింది. దీంతో అత‌ను మ‌రింతగా ర‌గిలిపోయాడు. తేజ‌శ్వ‌నిపై అక్క‌సు పెంచుకున్నాడు.

తేజ‌శ్వ‌ని త‌ల్లిదండ్రులు గురువారం పాఠ‌శాల‌కు వెళ్లారు. ఇంట్లో తేజ‌శ్వ‌ని, త‌మ్ముడు కార్తిక్ ఉన్నారు. ఇదే అద‌నుగా భావించిన వెంకటేష్ త‌న స్నేహితుడిని వెంట‌బెట్టుకుని తేజ‌శ్వ‌ని ఉంటే అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. తాను కింద ఉండి, స్నేహితుడిని తేజ‌శ్వ‌ని ఇంట్లోకి పంపాడు. తేజ‌శ్వ‌ని సెల్‌నెంబ‌ర్‌ను వెంక‌టేష్ స్నేహితుడు అడిగాడు. దీంతో అక్కాత‌మ్ముడు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ విష‌య‌మై త‌న తండ్రికి చెప్పేందుకు ఫోన్ తీసుకుని కార్తిక్ కిందికి వెళ్లాడు.

కార్తిక్‌ కిందికి రావడాన్ని గమనించిన వెంకటేష్‌ వెంటనే వేగంగా పైకి వెళ్లాడు. తేజ‌శ్వ‌ని ఇంటి నుంచి స్నేహితుడిని బ‌య‌ట‌కు పంపాడు. తేజశ్వని ఉన్న గదిలోకి వెళ్లి తలుపు మూసి... చాకుతో ఆమె గొంతులో పొడిచాడు. ఆ తర్వాత చున్నీతో ఆమె మెడకు బిగించి చంపాడు. అనంత‌రం తాను చీర‌తో ఉరి వేసుకున్నాడు.

కార్తిక్ తండ్రి సుధాక‌ర్ డ‌య‌ల్ 100కు ఫోన్ చేసి స‌మాచారం ఇచ్చాడు. ఎస్ఐ ఆదిల‌క్ష్మి, పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. గ‌ది త‌లుపుల‌ను బ‌ల‌వంతంగా తెరిచి లోప‌ల చూడ‌గా... ర‌క్త‌పు మ‌డుగులో అప‌స్మార‌క స్థితిలో తేజ‌శ్వ‌ని, ఉరికి వేలాడుతూ వెంక‌టేష్ క‌నిపించారు. పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే తేజశ్వని అప్పటికే ప్రాణాలు పోగొట్టు కున్న‌ట్టు  వైద్యులు నిర్ధరించారు.

వెంకటేష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం నెల్లూరు తరలించారు. తేజ‌శ్వ‌ని తండ్రి ఫిర్యాదు మేర‌కు వెంకటేష్‌, చెంచుకృష్ణయ్య, వెంకటేష్‌ స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు చ‌ట్టాలు ఎన్ని తెచ్చినా ఇలాంటి దురాగ‌తాలు చోటు చేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. స‌మాజంలో మార్పు వ‌స్తే త‌ప్ప చ‌ట్టాలు ఏమీ చేయ‌లేవ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?