Advertisement

Advertisement


Home > Politics - Political News

బాలకృష్ణపై రెస్పెక్ట్ ఉండదు- క్రేజ్ ఉంటుంది

బాలకృష్ణపై రెస్పెక్ట్ ఉండదు- క్రేజ్ ఉంటుంది

క్రేజ్ వేరు, రెస్పెక్ట్ వేరు. రెండూ సంపాదించడం అంత తేలిక కాదు. 

సూపర్ స్టార్ రజినికాంత్ కి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడు వయసురీత్యా అది కొంచెం తగ్గి రెస్పెక్ట్ మాత్రం మిగిలింది. 

పీఆర్పీతో జనం ముందుకొచ్చే వరకు చిరంజీవికి కూడా క్రేజ్ ఉండేది. ఎప్పుడైతే పరిస్థితులకి తలవంచి పార్టీని కాంగ్రెస్సులో విలీనం చేసేసారో క్రేజ్ తగ్గి రెస్పెక్ట్ మాత్రం కంటిన్యూ అవుతోంది. 

అంటే ఏ స్థితిలోనూ తలవంచకుండా, దేనికీ వెనుదిరగకుండా, ఓటమిపాలైనా, నలుగురూ నవ్వుకుంటున్నా విపరీతమైన ఆత్మస్థైర్యంతో చెయ్యాలనుకున్న పని చేసేవాళ్లకి క్రేజ్ ఉంటుంది. 

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఆ కోవకి చెందిన హీరోలు. వీళ్ళకి విమర్శలు అస్సలు పట్టవు. వాళ్ల పద్ధతేదో వాళ్లది. గెలుపోటములు వీళ్ల క్రేజుని వంగదీయలేవు. 

సామాన్యుడికంటే భిన్నంగా ఆలోచిస్తూ బతుకుతుంటారు వీళ్లిద్దరూ.

బాలకృష్ణకి శకునాల మీద ఉన్న ఆసక్తి, పాట పాడాలనిపిస్తే ఎవర్నీ పట్టించుకోకుండా తనను తాను ఘంటసాలలా భావించి పాడేయగల బిడియం లేని తనం, ఎదురుకుండా ఎవరున్నా మనసులో మాట చెప్పేసే ఫిల్టర్ లేని గుణం బాలకృష్ణను విభిన్నంగా నిలిపాయి. సామాన్యులు అలా ఉండలేరు కనుక అలా ఉంటున్న బాలకృష్ణపై క్రేజ్ పెంచుకున్నారు. 

అతనికి పిచ్చుందని అన్నా, ఫ్యాన్స్ ని కొడతాడన్నా..అలా కొట్టించుకోవడం కూడా ఒక వరంగా భావించేంత క్రేజ్ పెంచుకున్నవాళ్లు కూడా ఉన్నారు. కనిపిస్తే ఆడవాళ్లకి కడుపు తెప్పించేయాలంతే అతను "బండగా"  అన్నాకూడా అతనిపై ఫ్యాన్స్ క్రేజ్ రెండాకులు పెరిగిందే తప్ప తగ్గలేదు. తక్కిన వాళ్లు మాత్రం ఛీదరించుకున్నారు. అది వేరే విషయం.  

పవన్ కళ్యాన్ మొదటి నుంచీ మరీ అన్నచాటు తమ్ముడిలా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. బయటి ప్రపంచంలో పెద్ద వార్త కాదు కానీ వరసగా పెళ్లిళ్లు చేసుకోవడం కన్వెన్షనల్ తెలుగు సమాజంలో కాస్త వింతే. పైగా దేనికీ వెనుకాడకుండా తన పార్టీ ఓటమి పాలౌతున్నా దేంట్లోనూ విలీనం చెయ్యకుండా తన పాట్లేవో తను పడుతున్నాడు. 

ఏం మాట్లాడినా ఆత్మస్థైర్యంతో మాట్లాడతాడు. దానిని కొంతమంది తిక్క అన్నా, విషయం లేని అరుపులన్నా, డ్రామాలన్నా ఏమన్నా సరే తన పంథా తనది. ఎవరికీ తలవంచని విధంగా మాట్లాడతాడు. "రిపబ్లిక్" వేడుకలో తాను మాట్లాడింది ఒక పార్టీకి, కొన్ని వర్గాలకి నచ్చకపోయినా ఎవరి క్రేజునైతే ఇన్నాళ్లూ పొందుతున్నాడో దానిని నిలబెట్టుకున్నాడు. 

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పై ఇద్దరూ కూడా చిరంజీవిలాగ వినయాన్ని ప్రదర్శించరు. 

మనకంటే భిన్నంగా స్వేచ్చగా బతుకుతున్నాడు అన్నప్పుడే సామాన్యులనుంచి క్రేజ్ పెరుగుతుంది. 

ఈ కోవలోకి నిత్యానంద కూడా వస్తాడు. అతనేం మాట్లాడినా సోషల్ మీడియా అటెన్షన్ ఉంటుంది. అతను గతంలో ఏ స్కాండల్ లో దొరికినా, ఏ పిచ్చి వాగుడు వాగినా అతనికంటూ క్రేజీ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్లు అతనికి ఎంత బలాన్నిచ్చారంటే..ఏకంగా సొంత దేశం ఏర్పాటు చేసుకుని అక్కడికి చెక్కేసేటంత. 

ఇతని పద్ధతిని నిరసించే వాళ్లంతా మర్యాదస్తులు ఉంటారు. వాళ్లెవరో సమాజానికి ఇతను తెలిసినంత ఎక్కువగా తెలియరు. ఎందుకంటే పద్ధతులు మాట్లాడే వాళ్లంటే సమాజంలో క్రేజుండదు. 

క్రేజున్నప్పుడు కాసులు రాలతాయి. ఆ క్రేజుతో వీళ్లని మోసేవాళ్లుంటారు. 

బాలకృష్ణ "అఖండ" సినిమాకి జరుగుతున్నదదే. ఎంత సామాజిక వర్గం తోడ్పాటు ఉన్నా బాలకృష్ణ స్వేచ్చాజీవనం, లెక్కలేనితనం అతనిపై క్రేజు పెంచింది. 

పవన్ కళ్యాణ్ విధానం కూడా అంతే. తిక్కగా ఒక పార్టీని పట్టుకుని వేలాడుతూ తన గోలలో తను ఉండడం వల్ల రాజకీయంగా నిత్యం వార్తల్లో ఉంటూ తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. అది కూడా సామాన్యమైన విషయం కాదు. తన మీద తనకి చాలా నమ్మకమున్నవాడే ఇలా ఉండగలుగుతాడు. 

క్రేజు పొందడానికి సిగ్గు, బిడియం, ఎదుటివాడు ఏమనుకుంటాడో అనే లెక్కలు వదిలెయ్యాలి. పైన చెప్పుకున్న ముగ్గురూ ఆ బాపతే.  అందుకే వాళ్లకి హాయిగా సాగుతోంది. అలా బతకాలన్నా అందరూ బతకలేరు. ఒక చోద్యం చూస్తున్నట్టు చూసి ఆనందించడమో, చిరాకుపడడమో తప్ప చేయగలిగిందేమీ లేదు. 

ఇక్కడ చెప్పేదేంటంటే బాలకృష్ణ బండతనాన్ని, పవన్ తిక్కతనాన్ని, నిత్యానంద వెర్రితనాన్ని తమ ఎదుగదలకు పెట్టుబడిగా పెట్టారు. ఎదిగారు.ఎదుగుతున్నారు.

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?