Advertisement

Advertisement


Home > Politics - Political News

కోవిడ్‌ కంటే అవే ప్రమాదకరం

కోవిడ్‌ కంటే అవే ప్రమాదకరం

పులి భ‌య‌మా, గిలి భ‌య‌మా అంటే...గిలే భ‌య‌మే అంటారు. మాన‌సిక స్థైర్యానికి మించిన వైద్యం మ‌రొక‌టి లేదు. భ‌యానికి మించిన రోగం మ‌రొక‌టి లేద‌ని పెద్ద‌లు చెబుతారు. గ‌త రెండేళ్లుగా ప్ర‌పంచాన్ని కోవిడ్ కంటే... దానికి సంబంధించిన వార్త‌లే భ‌య‌పెడుతున్నాయ‌డంలో ఎలాంటి సందేహం లేదు. కోవిడ్ ప్ర‌భావం కంటే, దాని తీవ్ర‌త గురించి మీడియా గోరింత‌లు కొండంత‌లు చేసి చూపిస్తుండ‌డంతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. ఇదే విష‌యాన్ని మ‌రోసారి తెలంగాణ ప్ర‌జారోగ్య‌శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రావు తెలిపారు.

తాజాగా ప్ర‌పంచాన్ని క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ‌ణికిస్తోంది. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌గా చెబుతున్నారు. చాప‌కింద నీరులా ఒమిక్రాన్ భార‌త్‌లో విస్త‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఒమిక్రాన్ కేసుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం దాస్తోంద‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారాన్ని డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రావు ఖండించారు. ఒమిక్రాన్‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో వాస్త‌వాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు.

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తెలిసేందుకు మరో వారం రోజులు పడుతుందన్నారు. దక్షిణాఫ్రికాలో కేసులు పెరిగినా ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరగడం లేదన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి తెలంగాణాకు 900 మందికి పైగా చేరుకున్నార‌న్నారు. వారిలో 13మందికి కోవిడ్ నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు. వారికి ఒమిక్రాన్ సోకిందా లేదా అనే విషయం ఒకట్రెండు రోజుల్లో తేలుతుంద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు.

ఒకట్రెండు నెలల్లో భారత్‌లోనూ కేసులు పెరిగే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఇప్పటి వరకు దేశంలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయ‌న్నారు. మూడో వేవ్‌ను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. నిబంధ‌న‌లు పాటించ‌డ‌మే శ్రేయ‌స్క‌ర‌మ‌న్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేద‌ని, అప్రమత్తంగా ఉంటే చాల‌న్నారు.

ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడం లేద‌నే శుభ‌వార్త‌ను అందించారు. వైరస్‌ సోకితే తీవ్ర ఒళ్లునొప్పులు, తల నొప్పి, నీరసం ఉంటాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వివిధ మీడియా సంస్థ‌ల వేదిక‌గా ప్ర‌చార‌మ‌వుతున్న తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం తగ్గుతుంద‌ని వాపోయారు. కోవిడ్‌ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తప్పుడు వార్తలతో ప్రజల్లో భ‌యాందోళ‌న‌ల‌కు గురి అవుతున్నార‌ని తెలిపారు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?