cloudfront

Advertisement


Home > Politics - Political News

తిరుమల గిరుల్లోనూ పోటెత్తిన 'జగన్‌' సంద్రం.!

తిరుమల గిరుల్లోనూ పోటెత్తిన 'జగన్‌' సంద్రం.!

ఏడాదికి పైగా, 3648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇచ్చాపురం నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్ళారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే క్రమంలో, వైఎస్‌ జగన్‌ నడక మార్గాన్ని ఎంచుకోవడంతో ఆయన వెంట 'అభిమానులు' పోటెత్తారు.

గతంలో, వైఎస్‌ జగన్‌ తిరుమలకి వెళ్ళిన ప్రతిసారీ ఏదో ఒక వివాదాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తీసుకొచ్చేది. జగన్‌ క్రిస్టియన్‌ అనీ, వెంకటేశ్వరస్వామి సన్నిధిని అపవిత్రం చేసేలా జగన్‌, ఆయన అనుచరగణం వ్యవహరించారనీ ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించి విఫలమైన టీడీపీ, ఈసారి కూడా పలు వదంతుల్ని తెరపైకి తీసుకురాబోతోందంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు అనుమానం వ్యక్తంచేసిన విషయం విదితమే.

అయితే, టీడీపీ ఆటలు చెల్లలేదిక్కడ. జగన్‌ వెంట వందలాదిగా అభిమానులు కాలినడక మార్గంలో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళారు. మెట్లు ఎక్కుతున్న క్రమంలో వైఎస్‌ జగన్‌ ఎక్కడా అలసటకు గురికాలేదు. జగన్‌ వెంట వచ్చిన కొందరు నాయకులు మాత్రం, అలసత్వంతో నడకలో వెనకబడిపోయారు. దారిపొడవునా అభిమానులు జగన్‌తో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. వారిని చిరునవ్వుతోనే పలకరిస్తూ వైఎస్‌ జగన్‌, నడకదారిన తిరుమలకు వెళ్ళారు.

ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభానికి ముందే, వైఎస్‌ జగన్‌ తిరుమలకు వెళ్ళి, మొక్కుకున్న విషయం విదితమే. పాదయాత్ర పూర్తయ్యాక, తిరిగి తిరుమలకు కాలిక నడకన వస్తానని మొక్కుకున్న జగన్‌ ఆ మొక్కుని ఈ రోజు తీర్చుకున్నారు. ఈరోజు రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న జగన్‌, రేపు ఉదయం ఇడుపులపాయకు వెళ్తారు.

కాగా, ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో జనం కన్పించలేదంటూ టీడీపీ నేతలు వెటకారాలు చేస్తున్న దరిమిలా, వారికి అలిపిరి - తిరుమల కాలినడక మార్గంలో జగన్‌ వెంట కన్పించిన జన సంద్రమే సరైన సమాధానం ఇచ్చిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. 

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది