cloudfront

Advertisement


Home > Politics - Political News

ఆఖరిరోజు.. రవిప్రకాష్ ఏం చేయబోతున్నాడు?

ఆఖరిరోజు.. రవిప్రకాష్ ఏం చేయబోతున్నాడు?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు ఈరోజే ఆఖరిరోజు. సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు ఆయన ఎట్టిపరిస్థితుల్లో పోలీసులకు లొంగిపోవాలి. ఎందుకంటే మరోసారి గడువు పొడిగించే ఛాన్స్ లేదు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రెండుసార్లు గడువు పొడిగించారు సైబరాబాద్ పోలీసులు. ఈరోజు పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరెస్ట్ వారెంట్ కనుక ఇష్యూ అయితే రవిప్రకాష్ ఎక్కడున్నా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయడం గ్యారెంటీ.

ఎందుకంటే.. ప్రస్తుతం పరారీలో ఉన్నప్పటికీ ఈయన ఎక్కడున్నారనే విషయంపై పోలీసులకు ఓ ఐడియా ఉన్నట్టు తెలుస్తోంది. నోటీసులు జారీ చేయడానికంటే ముందే రవిప్రకాష్ పై పోలీసులు నిఘావేసి ఉంచినట్టు సమాచారం. ఆయన అమరావతిలో ఉన్నారని కొందరు, ముంబయిలో ఉన్నారని మరికొందరు చెబుతున్నప్పటికీ.. రవిప్రకాష్ ఎక్కడున్నారనే విషయంపై పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉందట.

సో.. అరెస్ట్ వారెంట్ జారీ అయితే మాత్రం రవిప్రకాష్ ను వెంటనే తమ కస్టడీలోకి తీసుకోవడం పోలీసులకు చిటికెలో పని. మరోవైపు రవిప్రకాష్ మాత్రం తమ లాయర్లతో ఈ కేసు నుంచి బయటపడేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కానీ ఫోర్జరీ, డేటా చౌర్యం కు సంబంధించి ఆధారాలు బలంగా ఉండడంతో రవిప్రకాష్ తరఫు లాయర్లు ఏమీ చేయలేకపోతున్నారు.

మొత్తమ్మీద రవిప్రకాష్ కేసు ఈరోజు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీచేసిన పోలీసులు, ఈరోజు ఏకంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశాలున్నాయి. రవిప్రకాష్ ఇలా తెగేదాకా తెచ్చుకోరని, ఈలోగా ఏదైనా చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు టీవీ9 నుంచి బహిష్కృతుడైన రవిప్రకాష్.. త్వరలోనే మరో చానెల్ లో ప్రత్యక్షం అవుతారంటూ కథనాలు వస్తున్నాయి. ఐ-న్యూస్ ను టేకోవర్ చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఆయన రిలయన్స్ కు చెందిన నెట్ వర్క్-18 సంస్థలో కీలక బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.

రవిప్రకాష్ కు ప్రస్తుతం మోజో టీవీలో పెట్టుబడులతో పాటు పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. వీటితో పాటు టాలీవుడ్ లో ఈవెంట్లకు పెట్టింది పేరైన ఓ సంస్థలో కూడా ఆయనకు వాటాలున్నాయని టాక్.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!