Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్య‌య్యో... రేవంత్‌ను ఏం చేయ‌లేక‌!

అయ్య‌య్యో... రేవంత్‌ను ఏం చేయ‌లేక‌!

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్‌కు మింగుడు ప‌డ‌డం లేదు. రేవంత్‌ది మొద‌టి నుంచి దూకుడు వ్య‌వ‌హార‌మే. అదే అత‌ని బ‌లం, బ‌ల‌హీన‌త‌. ఎలాగైనా రేవంత్‌ను అసెంబ్లీలో అడుగు పెట్ట‌నివ్వ‌కూడ‌ద‌ని కేసీఆర్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో 2018 ఎన్నిక‌ల్లో అనుకున్నంత ప‌ని చేశారు. కొడంగ‌ల్‌లో రేవంత్‌ను ఓడించి ఆనందించారు. ఆ త‌ర్వాత మ‌ల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలుపొంది దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో రేవంత్ అడుగు పెట్టారు.

కేసీఆర్ అంటే రేవంత్ ఒంటికాలిపై లేస్తారు. అలాంటి రేవంత్‌కు ఇటీవ‌ల టీపీసీసీ ప‌గ్గాలు అప్ప‌జెప్ప‌డంతో ఇక ఆయ‌న దూకుడికి ఎదురు లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో రేవంత్ మాట‌ల తూటాల‌ను త‌ట్టుకోలేక‌, అత‌నిపై సోనియా, రాహుల్ గాంధీల‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. రేవంత్ వైఖ‌రిపై కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌కు లేఖ‌లు రాసిన విష‌యాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి చెప్పారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాలేద‌ని గ్ర‌హించే రేవంత్‌రెడ్డి ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. రేవంత్‌రెడ్డిది మాటలు.. మూటలు.. ముఠాలు చేసే వైఖరని ధ్వ‌జ‌మెత్తారు. 

సీఎం కేసీఆర్‌పై ఆయన ప్రయోగిస్తున్న పరుష పదజాలంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌ గాంధీలకు లేఖలు రాసినట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ లేఖల తర్వాతైనా రేవంత్‌ పద్ధతి మార్చుకోవాలని.. థర్డ్‌ క్లాస్‌ మాటలు మానుకోవాలని జీవన్‌రెడ్డి హితవు పలక‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌లో రాజ‌కీయంగా వాడుతున్న భాష అభ్యంత‌ర‌క‌రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మంత్రి మ‌ల్లారెడ్డిని ఉద్దేశించి రేవంత్‌రెడ్డి తీవ్ర ప‌ద‌జాలంతో దూషించ‌డం, అందుకు మంత్రి కూడా అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇవ్వ‌డం పొలిటిక‌ల్ హీట్‌ని పెంచాయి. 

మొత్తానికి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి దూష‌ణ‌ల‌పై టీఆర్ఎస్ ఏమీ చేయ‌లేక‌... కాంగ్రెస్ అధినేత్రికి ఫిర్యాదు చేయాల్సి వ‌చ్చింద‌నేది వాస్త‌వం. టీఆర్ఎస్ నిస్స‌హాయ‌త‌పై జాలి ప‌డ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేమ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?