cloudfront

Advertisement


Home > Politics - Political News

సొంత సర్వేలో వ్యతిరేకతా?

సొంత సర్వేలో వ్యతిరేకతా?

అధికార పార్టీలు రరకరకాల సర్వేలు చేయించడం సహజం. ఇంటలిజెన్స్‌ డిపార్ట్‌మెంటు ఎలాగూ ప్రతి సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తూనే ఉంటుంది. ఇంటెలిజెన్స్‌ అధికారులు నేరుగా ముఖ్యమంత్రికే నివేదికలు ఇస్తుంటారు. ఇంటలిజెన్స్‌ ద్వారా సమాచారం సేకరించడమే కాకుండా, ప్రయివేటు ఏజెన్సీల ద్వారా (సర్వే సంస్థలు) సర్వే చేయించి సమాచారం తెప్పించుకుంటారు.

అధికార పార్టీయే కాదు, ప్రతి పార్టీ కూడా తన బలమెంత, పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రజాదరణ ఎలా ఉంది.. తదితర విషయాలపై సర్వే చేయిస్తుంటుంది. ఇక ఎన్నికల సంవత్సరంలో సర్వేల విషయం చెప్పేదేముంది. తరచుగా జరుగుతూనేవుంటాయి.

తాజాగా టీఆర్‌ఎస్‌ చేయించిన ఓ సర్వే దానికి, ప్రభుత్వానికి తీవ్రమైన షాక్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు కారణం అన్నివర్గాల ప్రజల్లో సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైందట. విద్యార్థుల్లో, యువతలో 80శాతం, ఉద్యోగుల్లో 40, రైతాంగంలో 35, కొన్ని కులాల్లో 80శాతం వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం.

పాత పది జిల్లాల్లో ఐదింటిలో ఎక్కువ వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతకు ప్రత్యేకంగా కారణాలు చెప్పుకునేదేముంది? వివిధ వర్గాల సమస్యలు పరిష్కారం కాకపోవడమే. యువతకు ఉద్యోగాలు లేవు. కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు లక్ష ఉద్యోగాలు కాదు కదా వేల ఉద్యోగాలు కూడా లేవు.

'అందరికీ, అన్ని రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఎవ్వరికీ సాధ్యంకాదు' అని కేసీఆర్‌ ఓసారి అసెంబ్లీలో అసలు విషయం చెప్పారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నియామకాలంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆంధ్రావారి ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి తెలంగాణవారికి ఉద్యోగాలు ఇవ్వడం.

రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలిస్తానని కేసీఆర్‌ ఆనాడు చెప్పారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, అనేక ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో చదువుకుంటున్న యువతీయువకులు ఆశలు పెంచుకున్నారు. కాని కేసీఆర్‌ వారి ఆశలను తుంచేశారు. అందుకే ఆయన ఉస్మానియా యూనివర్శిటీకి పోలేని పరిస్థితి, పోయినా మాట్లాడలేని దురవస్థ దాపురించాయి.  

గత నాలుగేళ్లలో ఉద్యోగులకు సంబంధించిన చాలా సమస్యలు తీరలేదు. రైతులు కష్టాల్లో ఉన్నారు. నిజానికి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంలో, ముఖ్యమంత్రి అయిన తరువాత ఇచ్చిన హామీల్లో చాలావరకు నెరవేరలేదని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. అయినప్పటికీ జీహెచ్‌ఎంసీ సహా వివిధ ఎన్నికల్లో అధికార పార్టీయే విజయం సాధించింది.

దాంతో సమస్యలు పరిష్కారం కాకపోయినా తెలంగాణ సెంటిమెంటుతో నెట్టుకొస్తున్నారు. కేసీఆర్‌ పాలన బ్రహ్మాండంగా ఉందంటూ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో చేరారు. ప్రతి పథకాన్ని బ్రహ్మాండమని, దేశానికే ఆదర్శమని, ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి పథకం లేదని ప్రచారం చేసుకోవడం ఎక్కువైంది. కాని వాస్తవ పరిస్థితి అంత గొప్పగా లేదు.

దళితులకు మూడెకరాల చొప్పున భూమి పంపిణీ హామీ నెరవేరలేదు. డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం విజయవంతం కాలేదు. మిషన్‌ భగీరథ ఎన్నికల్లోగా పూర్తికావడం అనుమానమే. ఇక కేసీఆర్‌ పాలనలో ప్రతిపక్షాలను ఫిరాయింపుల ద్వారా బలహీనం చేయడమే కాకుండా, ప్రజా ఉద్యమాలను తీవ్రంగా అణిచివేయడం సర్వసాధారణమైంది.

నేతలను బయటకు రాకుండా గృహ నిర్భంధం చేసిన సందర్భాలున్నాయి. ఇదంతా వ్యతిరేకతకు కారణం కావొచ్చు. అయితే ఇదేమీ పైనల్‌ సర్వే కాదు కాబట్టి ఎన్నికలనాటికి ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం. ఏడాది సమయముంది కాబట్టి వ్యతిరేకతను అధిగమించే ప్రయత్నాలు చేయకుండా ఉండరు కదా.