Advertisement


Home > Politics - Political News
తూ.గో జిల్లా మలనాధుల్లో గ్రూపుల గోల!

తూర్పుగోదావరి జిల్లా బీజేపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు ఆ పార్టీ అభివృద్ధికి 'ఆదిలోనే హంసపాదు' చందాన తయారయ్యాయి. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ పార్టీని క్షేత్రస్థాయిలకి తీసుకువెళ్ళేందుకు నానా అవస్థలు పడుతుంటే, ఇంకోవైపు ఇక్కడి నేతలు మాత్రం తలోదారిలో పయనిస్తుండటం విశేషం! ఈ జిల్లాలోని ప్రధాన నగరాలైన రాజమహేంద్రవరం, కాకినాడలో గ్రూపుల మధ్య పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. రాజమహేంద్రవరం బీజేపీ సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణకు, ఎమ్మెల్సీ సోమువీర్రాజుకు మధ్య సయోధ్య లోపించింది. దీంతో వీరిద్దరికీ రెండు గ్రూపులు తయారయ్యాయి. అలాగే జిల్లా కేంద్రం కాకినాడలో రెండు గ్రూపులు పార్టీ అభ్యన్నతికి విఘాతంగా మారాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య ఒక వర్గానికి పరిమితం అయ్యారు. పార్టీకి చెందిన కొందరు సీనియర్‌ నేతల ఆధ్వర్యంలో మరోవర్గం కొనసాగుతోంది.

ముఖ్యంగా ఈ రెండు వర్గాల నేతలూ పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తుండటం గమనార్హం! తాజాగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా, ఇక్కడి నేతల గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. పార్టీలో గ్రూపు విభేదాలకు తావులేకుండా పనిచేయాలని ముఖ్యనేతలు, మంత్రులు చేసిన సూచనలను ఇక్కడి నేతలు ఎంతమాత్రం ఖాతరు చేయడంలేదు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కమలనాథులు సంబరాలు చేసుకున్నారు. జిల్లాలో మాత్రం ఆ పార్టీనేతలు, కార్యకర్తలు వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. రెండు గ్రూపుల వారు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఈ విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య ఆధ్వర్యంలో నగరంలోని భానుగుడి జంక్షన్‌ వద్ద బాణా సంచా వెలిగించి, ప్రజలకు మిఠాయిలు పంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

మరోవైపు నగరంలోని కల్పన సెంటర్‌ వద్ద బీజేపీ సీనియర్‌ నేతలు పైడా కృష్ణమోహన్‌, బిక్కిన విశ్వేశ్వరరావుల ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వాస్తవానికి జిల్లా పార్టీలో నెలకొన్న వివాదాలకు తెరదించేందుకు ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇరువర్గాల నేతలతో ఆ మధ్య చర్చలు జరిపారు. గ్రూపు విభేదాలకు తావులేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్రస్థాయి నేతలు కూడా హాజరయ్యారు. ఇరువర్గాల మధ్య ఒడంబడిక కోసం రెండు గ్రూపులకు చెందిన వారికీ పార్టీ కార్యవర్గ పదవుల్లో 50/50 సూత్రాన్ని పాటించాలని మంత్రి తదితరులు సూచించారు. 

అంటే ఆయా పదవుల నియామకాల్లో రెండు గ్రూపులూ చెరిసగం పంచుకోవల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా తమ గ్రూపు నేతలకు కనీస ప్రాధాన్యత ఇవ్వలేదంటూ పార్టీ జిల్లా కార్యవర్గంపై అసమ్మతి గ్రూపు నిరసన వ్యక్తం చేస్తోంది. పార్టీ సీనియర్‌ నేతలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడానికి వెనుక జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత వైఖరి మరో కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని మోదీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి, పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పుకుంటున్న నేతలు ముందుగా తమ మైండ్‌ సెట్‌ మార్పుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటే ముందు నేతల్లో మార్పు అవసరమని, గ్రూపులుగా మారి, వేర్వేరు కుంపట్లు రాజేసుంటే ప్రజల్లో చులకన కావడం తథ్యమని విజ్ఞులు హితవు పలుకుతున్నారు. రాజమహేంద్రవరంలో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. వీరు ఒక తాటిపైకి వచ్చేలా చేస్తేనే పార్టీ కాస్తో, కూస్తో అభివృద్ధి సాధిస్తుందని, లేనిపక్షంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నట్టు కార్యకర్తలు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.