cloudfront

Advertisement


Home > Politics - Political News

టీవీ9 రవిప్రకాష్‌ అనుభవం ఏమి చెబుతోంది..

టీవీ9 రవిప్రకాష్‌ అనుభవం ఏమి చెబుతోంది..

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ అజ్ఞాతంలోకి వెళ్లారని, ఆయన సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయి ఉందని ఒక వార్త వచ్చింది. ఆయన కోసం ఇంటి వద్దకాని, సహచరులను కాని వాకబ్‌ చేసినా ఎవరూ చెప్పలేకపోయారని ఆ కథనం తెలిపింది. గరుడపురాణం శివాజీతో  కలిసి రవిప్రకాష్‌ నకిలీ ఒప్పందం సృష్టించారని సైబర్‌ పోలీసులు ఈ మెయిల్‌ ఆధారాలను చూపుతున్నారు. నిజంగా టీవీ చానల్స్‌లో ఒక బ్రాండ్‌ను సృష్టించుకుని, తనకంటూ ప్రత్యేకతను తయారు చేసుకున్న రవిప్రకాష్‌ జీవితంలో ఇది అత్యంత బాధాకర ఘట్టం అనిచెప్పాలి. ఒకప్పుడు సాధారణ రిపోర్టర్‌గా జీవితాన్ని ఆరంబించి, తన తెలివి తేటలతో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనిరాజును కన్విన్స్‌ చేసి టీవీ9 పెట్టించిన రవిప్రకాష్‌ దానిని విజయవంతం చేయడానికి గట్టి కృషిచేశారు.

స్వయంగా ఆయనే కొన్ని ప్రోగ్రాంలు నిర్వహించడం, సంచలన కథనాలు ఇవ్వడం, సీనియర్‌ పాత్రికేయులను కూడా తన చానల్‌లో విశేషంగా విశ్లేషణలకు వినియోగించుకుని తెలుగు టీవీ జర్నలిజంలో ఒక సరికొత్త చరిత్ర నెలకొల్పారు. అంతకుముందు ఈటీవి చానల్‌ ఒకటే ఉండేది. దాని ఏకఛత్రాధిపత్యాన్ని ఛేదించడమే కాకుండా, జన సామాన్యానికి టీవీ మాధ్యమాన్ని చేరువ చేసిన ఘనత కూడా రవిప్రకాష్‌ది. అయితే ఈ క్రమంలో ఆయన కాని, ఆయన టీమ్‌ కాని కొన్నిటిని అతిగా చేసిందన్న విమర్శలు వచ్చాయి. భార్యాభర్తల మద్య చిన్నగొడవలు వచ్చినా, వాటిని టీవీలో విస్తారంగా ప్రసారం చేసిన తీరుకాని, ఇతరత్రా అనుసరించిన కొన్ని పద్ధతులు కాని తీవ్ర విమర్శలకు గురయ్యాయి. అయినా టీవీ9 నెంబర్‌ వన్‌ చానల్‌గా నిలబడగలిగింది.

టీవీ చానల్‌ నిర్వహించడం, అది విస్తరించడం ఒకఎత్తు అయితే, ఆ తర్వాత రవిప్రకాష్‌ వ్యవహర శైలి, ప్రత్యేకించి కొత్త యాజమాన్యం టీవీని స్వాధీనం చేసుకోదలచినప్పుడు ఆయన చేసిన పనులుకాని ఆయనను ఇబ్బందులలో పడేసిందని చెప్పాలి. సొంతంగా ఒక చానల్‌ను పెట్టుకున్న రవిప్రకాష్‌ అందులోకి టీవీ9 డబ్బు, పుటేజీ, యంత్ర సామాగ్రి వంటి వాటిని అక్రమంగా తరలించారన్నది ఒక ముఖ్య అభియోగంగా ఉంది. అంతేకాక కొత్త యాజమాన్యం బాధ్యత చేపట్టకుండా కంపెనీ సెక్రటరీ సంతకం పోర్జరీ చేశారన్నది మరో అభియోగంగా ఉంది. అంతేకాక గరుడపురాణం శివాజీతో కలిసి మోసానికి పాల్పడ్డారన్నది ఇంకో ఆరోపణ. మెరుగైన సమాజం నినాదంతో వచ్చిన రవిప్రకాష్‌, కట్నం అడిగేవాడు గాడిద అంటూ ప్రచారం చేసిన రవిప్రకాష్‌ ఇలా బుక్‌ అవుతారని ఎవరూ ఊహించలేదు.

వ్యక్తిగతంగా ఆయనపై కొన్ని విమర్శలు ఉన్నా, ఆయన సక్సెస్‌ వాటిని బహిర్గతం కానివ్వలేదు. అయితే రవిప్రకాష్‌ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కాకుండా దుర్వినియోగం చేశారన్న భావన ఏర్పడుతుంది. అంతేకాక రాజకీయంగా కూడా ఒక పార్టీకి అండగా నిలబడడానికి ఆయన చేసిన ప్రయత్నాలపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో కులముద్ర తెచ్చుకోవడం అంటే అది మరి అప్రతిష్ట అనిచెప్పాలి. ఒక వ్యక్తి కష్టపడి ఎదిగితే తప్పుకాదు. కాని ఆ దారిలో అతను వ్యవహరించిన తీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తే అది మరింత డామేజీ చేస్తుందన్నది రవిప్రకాష్‌ అనుభవం చెబుతుంది. అందువల్లే సోషల్‌ మీడియాలో రవిప్రకాష్‌పై దారుణమైన ప్రచారం అనండి, వ్యాఖ్యలనండి సాగిపోతున్నాయి.

ఆయన వార్తల ప్రసారం వల్ల కానివ్వండి.. ఇతరత్రా కానివ్వండి.. ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నవారంతా ఒక్కసారిగా విజృంభించి పెద్దఎత్తున విమర్శలు సాగించి రవిప్రకాష్‌ను డామేజీ చేశారని చెప్పాలి. అద్దాల మేడలో ఉన్నప్పుడు రాళ్లుపడితే ప్రమాదం అన్న సంగతిని గుర్తించాలి. కొత్త యాజమాన్యం వచ్చినప్పుడు వారికి సహకరించి, రాజీపడి సర్ధుకున్నట్లయితే ఇంత గొడవ ఉండేవికాదు. కాని ఆయన ఆ దశ దాటిపోయారని అనుకోవాలి. సొంతంగా టీవీ, ఇతర వ్యాపారాలు పెట్టుకోవడం, దానికి రాజకీయంగా కాని, వ్యక్తిగతంగా కాని చెడ్డ స్నేహాలు కూడా ఆయనను దెబ్బతీశాయన్న అభిప్రాయం వస్తుంది. రవిప్రకాష్‌ ఇప్పుడు ఈ కేసుల నుంచి బయటపడి, మళ్లీ సొంతంగా ఎదగవలసి ఉంటుంది.

మరి అందుకు ఆయన ఎలాంటి వ్యూహంలో వెళతారో తెలియదు. కాని ఒక సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన రవిప్రకాష్‌ దానిని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందడం వల్లే ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. అందువల్లే పోలీస్‌ విచారణ, సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని అనుకోవాలి. ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒదిగి ఉండాలని ఒక నానుడి. దానిని పాలో అయి ఉంటే రవిప్రకాష్‌కు ఈ సమస్య వచ్చేది కాదేమో!

ఏదిఏమైనా ఎప్పుడూ ఒకరిదే పైచేయి ఉండదు. కాలం ఎంతో వేగంగా మారుతుంది. గుర్తున్నాయా? అంటూ టీవీ 9లో గతంలో వచ్చిన పలు కథనాలను ఉటంకిస్తూ ఒక సామాన్యుడు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.ఇతరులపై వార్తలు వేస్తే తప్పులేదు కాని, తనపై వార్తల కవర్‌ చేస్తే వారిపై దాడి చేస్తారా అని ప్రశ్నిస్తూ అతను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సమర్థనీయం అయినా, కాకపోయినా, వాటిని జర్నలిస్టులు అయినా, మీడియా పరిశ్రమలోని వారైనా ఆలోచించాలని మాత్రం చెప్పక తప్పదు.

-కొమ్మినేని శ్రీనివాసరావు

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం..