cloudfront

Advertisement


Home > Politics - Political News

కడప ఉక్కుకి కన్నమేసిన బీజేపీ

కడప ఉక్కుకి కన్నమేసిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో అతి కీలకమైన అంశాల్లో కడప స్టీల్‌ ప్లాంట్‌ కూడా ఒకటి. ఇప్పుడు ఆ స్టీల్‌ ప్లాంట్‌కి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 'కన్నం' వేసేసింది. నిజమే, కడప స్టీల్‌ ప్లాంట్‌పై ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదని సుప్రీంకోర్టుకి తేల్చి చెప్పింది కేంద్రం. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ ప్లాంట్‌కి సంబంధించి సాధ్యా సాధ్యాల్ని పరిశీలించాలని మాత్రమే ప్రస్తావించినట్లు కేంద్రం తేల్చి చెప్పింది. మొదటి ఆరు నెలల్లోనే కడపలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదని తేల్చేశామనీ, అయితే మరోసారి పరిశీలించాలని వచ్చిన సూచనల నేపథ్యంలో పూర్తిస్థాయి నివేదిక కోసం ఇంత సమయం పట్టిందని కేంద్రం పేర్కొంది.

నిజానికి, నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ప్రతిసారీ ఇదే తరహా పద్ధతిని ఫాలో అవుతోంది. ప్రత్యేక హోదాకి అత్యంత వ్యూహాత్మకంగా పాతరేసిన ప్రధాని నరేంద్రమోడీ, రైల్వే జోన్‌ విషయంలో 'తీవ్రమైన జాప్యం' చేస్తూ వచ్చారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ తరహాలోనే, విభజన చట్టంలో రైల్వే జోన్‌ అంశానికి సంబంధించి కూడా సాధ్యా సాధ్యాల్ని పరిశీలించాలని మాత్రమే పేర్కొన్నారు. ఆ ప్రకారం చూస్తే, ఎలాగైతే కడపలో ఉక్కు పరిశ్రమకు నరేంద్రమోడీ సర్కార్‌ తిలోదకాలిచ్చేసిందో, రేప్పొద్దున్న రైల్వే జోన్‌ విషయంలో కూడా ఇదే తరహా ప్రకటన రాబోతోందన్నమాట.

చిత్రమైన విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన కన్నా లక్ష్మినారాయణ, ఆ పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ప్రధానితో భేటీ అయిన సందర్భంలో కడప ఉక్కు పరిశ్రమను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే, కడప స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది.. కడప ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని. విశాఖ రైల్వే జోన్‌కి సంబంధించి ఇలాంటి కథ నడుస్తోందన్న విషయం అర్థమయ్యే, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు.. నైరాశ్యం వ్యక్తం చేశారు.

ఇప్పుడిక ఏపీ బీజేపీ నేతలు, కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి కేంద్రం వైఖరిపై కొత్త కథలు ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. రాయలసీమలో రెండో రాజధాని అవసరమనీ, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేననీ చంద్రబాబుపై గుస్సా అవుతున్న ఏపీ బీజేపీ నేతలు, రాయలసీమలో అత్యంత కీలకమైన కడప ఉక్కు పరిశ్రమపై ఇంకా కల్లబొల్లి కబుర్లు చెబితే, చరిత్ర క్షమించదుగాక క్షమించదు.