Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్‌ను రెచ్చ‌గొడుతున్న ఉండ‌వ‌ల్లి

జ‌గ‌న్‌ను రెచ్చ‌గొడుతున్న ఉండ‌వ‌ల్లి

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. పోల‌వ‌రం విష‌యంలో ప్ర‌శ్నించే ధైర్య సాహ‌సాలు జ‌గ‌న్‌లో ఏమ‌య్యాయ‌ని ఆయ‌న గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. అంతేకాదు పోల‌వ‌రంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు కోర్టులో కేసు వేశార‌ని, దానికి ఇంప్లీడ్ కావాల‌ని ఉండ‌వ‌ల్లి రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించారు. 

ఒక‌వేళ ప్ర‌భుత్వం ఇంప్లీడ్ కాక‌పోతే, ఆ ప‌ని తానే చేస్తాన‌న్నారు. త‌న కేసును తానే వాదించుకుంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పోల‌వ‌రం నిర్వాసితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌డం త‌మ బాధ్య‌త కాద‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం త‌ప్పించుకుంటున్న నేప‌థ్యంలో గురువారం ఆయ‌న మీడియా ముందుకొచ్చారు.

పోల‌వ‌రానికి నిధులు రాక‌పోవ‌డానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని వైసీపీ నాయ‌కులు కొన్ని రోజులు విమ‌ర్శిస్తుండ‌డాన్ని చూస్తున్నాన‌న్నారు. పోల‌వ‌రం విష‌యంలో చంద్ర‌బాబు విఫ‌లం కావ‌డం వ‌ల్లే జ‌నం ఆయ‌న‌కు బుద్ధి చెప్పార‌న్నారు. తాము కూడా అలా కావాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం అనుకుంటున్న‌దా అని ఉండ‌వ‌ల్లి గ‌ట్టిగా నిల‌దీశారు. 

ప‌ట్టిసీమ‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అన‌వ‌స‌రంగా రూ.1800 కోట్లు ఖ‌ర్చు పెట్టింద‌న్నారు. అదే సొమ్మును పోల‌వ‌రంపై పెట్టి ఉంటే ఈవేళ ప‌రిస్థితి వేరేగా ఉండేద‌న్నారు. టీడీపీ, వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌లు చూస్తుంటే ....పోల‌వ‌రాన్ని వ‌దిలేసి ప‌ట్టిసీమ‌కే ప‌రిమిత‌మ‌య్యేలా జ‌గ‌న్ స‌ర్కార్ ఉంద‌ని త‌ప్పు ప‌ట్టారు. గ‌త ప్ర‌భుత్వం ఫెయిల్ కావ‌డం వ‌ల్లే వైసీపీని ఎన్నుకున్నార‌ని గుర్తు చేశారు. ఇప్పుడేం చేయాలో జ‌గ‌న్ చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఇలా అవుతుందని ఎప్పుడు అనుకోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భూసేకరణ లేకుండా ప్రాజెక్ట్‌ నిర్మాణమే జరగదని.. పోలవరం నిర్మించాలని విభజన చట్టంలోనే ఉందన్న విషయాన్నిఉండవల్లి గుర్తు చేశారు. పోలవరం క‌ట్టించి తీరాల‌ని కేంద్రాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ గ‌ట్టిగా నిల‌దీయాల‌న్నారు. 

ఎందుకంటే విభ‌జ‌న చ‌ట్టంలో పోల‌వ‌రాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయ‌డ‌మే కాకుండా ఆ ఖ‌ర్చును కేంద్ర‌మే భ‌రించాల‌ని నాడు యూపీఏ-2 పార్ల‌మెంట్ సాక్షిగా ఆమోదించింద‌న్నారు. దేశంలో అన్నిటి కంటే పార్ల‌మెంట్ గొప్ప‌ద‌న్నారు. అలాంటి పార్ల‌మెంట్‌లో చ‌ట్టం చేసిన దాన్ని అమ‌లు చేయాల‌ని అడిగేందుకు జ‌గ‌న్ స‌ర్కార్‌కు భ‌య‌మెందుకు ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు.  

‘పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మాట మారుస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయడం లేదు? ఇంత జరుగుతున్నా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ నోరెత్తలేదేం?. కోర్టులో ఆల్రెడీ కేవీపీ వేసిన కేసు ఉంద‌ని, దానికి ఇంప్లీడ్ అయితే చాల‌ని ఉండ‌వ‌ల్లి చెప్పుకొచ్చారు. అంతే త‌ప్ప జగన్.. మోదీ కాలర్ పట్టుకోనక్కర్లేదని అన్నారు. చట్టం అమలు చేయట్లేదని ఎందుకు కేసు వేయట్లేదని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు.

కేసులు ఉండటం వల్లే మోదీని ప్రశ్నించేందుకు జగన్ భయపడుతున్నారన్న ప్రచారం జనంలో ఉంద‌న్నారు. జగన్‌ను మోదీ జైలులో పెడితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంద‌ని, జగన్‌ను జైలులో వేయటం అంత సులువా?. 

కేసులు నుంచి బయటపడేందుకు జగన్ మౌనంగా ఉంటే ప్రజలు క్షమించర‌ని హెచ్చ‌రించారు.  కేవీపీ కోర్టులో వేసిన పిటిషన్‌పై వైసీపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాల‌ని డిమాండ్ చేశారు. మీరు మోదీకి లొంగిపోయారనుకోవాలా?. ఎందుకు లొంగిపోవాలి? అని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు.

కేసులు విషయంలో వెంటనే శిక్ష పడద‌న్నారు. కిందిస్థాయి కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు కేసు న‌డిచే స‌రికి వృద్ధుల‌వుతార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఒక‌వేళ పోల‌వ‌రం విష‌యంలో మోడీ స‌ర్కార్‌ను వ్య‌తిరేకించార‌నే కార‌ణంతో  జైలుకి పంపినా, జ‌నంలో హీరో అవుతార‌న్నారు.అప్పుడు జ‌గ‌న్ నిల‌బెట్టిన‌ వ్యక్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతార‌న్నారు. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజశేఖరరెడ్డి కొడుకు కాంప్రమైజ్ అయితే ఈ ప్రభుత్వం ఎందుకు? అని జ‌గ‌న్‌ను రెచ్చ‌గొట్టేలా ఉండ‌వ‌ల్లి మాట్లాడారు.  జగన్ ప్రభుత్వం రాగానే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంటుందని అనుకున్న‌ట్టు ఉండ‌వ‌ల్లి తెలిపారు.   

అసలే ఓటుకు నోటు కేసు విచారణకు వస్తోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?