cloudfront

Advertisement


Home > Politics - Political News

పొత్తుతో గెలిచేస్తారా? చిత్తవుతారా..?

పొత్తుతో గెలిచేస్తారా? చిత్తవుతారా..?

గత కొన్నేళ్లుగా అనూహ్య ఫలితాలకు కేరాఫ్ అయ్యింది ఉత్తరప్రదేశ్. ప్రత్యేకించి గత పర్యాయం లోక్ సభ సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి యూపీ సంచలన ఫలితాలను ఇస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో తొంభైశాతం ఎంపీ సీట్లను బీజేపీ పక్షానికి కట్టబెట్టి యూపీ ప్రజలు ఆశ్చర్యపరిచారు. అప్పటికే రాష్ట్రంలో సంచలన ఫలితాలను సాధించి, రాష్ట్రాన్ని ఏలిన బీఎస్పీకి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. సమాజ్ వాదీ పార్టీలో ఫస్ట్ ఫ్యామిలీకి, కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీకి తప్ప ఆ పార్టీలోని మిగతా వారి మీద యూపీ జనాలు ఏ మాత్రం జాలి చూపలేదు.

కేవలం గత సార్వత్రిక ఎన్నికలు అనేకాదు.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యూపీలో సంచలన ఫలితాలు వచ్చాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ సంచలన విజయం సాధించింది. 

ఆ ఎన్నికలతో యూపీలోని పార్టీలకు స్పష్టం అయ్యింది ఏమిటంటే.. తాము ఒంటరిగా వెళ్తే బీజేపీని ఏం చేయలేము అని. బీజేపీని ఓడించాలంటే అంతా కలిసి కట్టుగా వెళ్లాలని తీర్మానించుకున్నాయి. ఆ  మేరకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల ఆధ్వర్యంలో కూటమి ప్రతిపాదన వచ్చింది. మొదట్లో దానికి ఓకే చెప్పిన అఖిలేష్, మాయవతిలు.. తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ.. కాంగ్రెస్ ను పక్కన పెట్టేశారు.

తమ రెండు పార్టీల మధ్యన సీట్ల ఒప్పందం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు.. ఒకటి రాహుల్ కు మరోటి సోనియాకు ఇస్తాం తప్ప అంతకు మించి ఇవ్వమని ఆ పార్టీల వారు తేల్చిచెప్పారు. ఆ మేరకు ఆ రెండు పార్టీలూ సీట్ల ఒప్పందం కుదర్చుకున్నాయి.

ఒకవేళ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీ చేస్తే ఆ పార్టీలకు యాభై ఎనిమిది సీట్లు గెలవగలవు అని, కాంగ్రెస్ ను వెలేయడం వల్ల ఎస్పీ, బీఎస్పీలు నలభై రెండు సీట్లకు పరిమితం అవుతాయని జాతీయ మీడియా వర్గాలు లెక్కగడుతున్నాయి.

అయితే.. ఇలాంటి లెక్కలు జనాల మధ్య నిలబడవు. వన్ ప్లస్ వన్ ఎప్పటికీ టూ కాదు రాజకీయాల్లో. తెలంగాణలో 2014లో కాంగ్రెస్, టీడీపీలు సోలోగా వెళ్లి సాధించిన ఓట్ల శాతం టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ. అయితే ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేస్తే.. వాటి గత ఓటు శాతం గల్లంతయిపోయింది. అలా ఉంటుంది రాజకీయం.

ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలపగానే.. అంతా అయిపోలేదేమో! ఇళ్లలకగానే పండగ కాదు కదా!

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు