cloudfront

Advertisement


Home > Politics - Political News

ఉత్తమ్‌కు సరిజోడు ఎవరు?

ఉత్తమ్‌కు సరిజోడు ఎవరు?

అధికార, ప్రతిపక్షాల్లో దిగ్గజ నాయకులు అంటే పార్టీల అధినేతలు, మంత్రులు, పాపులర్‌ నేతలు మొదలైనవారిపై ఎవరెవరు పోటీ చేయబోతున్నారనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏవో ఊహాగానాలు వస్తున్నాయిగాని అధికారికంగా ఇంకా తెలియడంలేదు. కాంగ్రెసులోని పెద్ద నాయకులను ఓడించాలని కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు. ఆ పార్టీని సమూలంగా నిర్మూలించాలని, అలా వీలుకాకపోతే సాధ్యమైనంత తక్కువ స్థానాలకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలకం. టీఆర్‌ఎస్‌ నుంచి ఆయన మీద ఎవరు పోటీ చేయబోతున్నారనేది ఇంకా తేలలేదు. ముందస్తు ఎన్నికలు ప్రకటించిన రోజునే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనానికి తెరతీసిన కేసీఆర్‌ పద్నాలుగు స్థానాలను ప్రకటించలేదు. అందులో హుజూర్‌ నగర్‌ ఒకటి. 30 లేదా 40 మంది పేర్లతో కాంగ్రెసు జాబితా ఈరోజు (శుక్రవారం) విడుదల చేస్తారని అనుకుంటున్నారు.

ఢిల్లీలో ఉన్న ఉత్తమ్‌ కుమార్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యాక తొలి జాబితాకు ఆమోదం పొంది సాయంత్రం ప్రకటిస్తారని సమాచారం. ఈ జాబితా చూశాక కేసీఆర్‌ పెండింగులో పెట్టిన స్థానాల గురించి ఆలోచిస్తారేమో. హుజూర్‌ నగర్‌ నుంచి రెండుసార్లు గెలిచిన ఉత్తమ్‌ను ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదని కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను టీఆర్‌ఎస్‌ తరపున హుజూర్‌ నగర్‌ పోటీకి నిలబెట్టగా ఆమె ఓడిపోయారు.

ఆ తరువాత ఆమె వివాదాస్పదంగా వ్యవహరించడంతో కేసీఆర్‌ పట్టించుకోవడంలేదు. కాంగ్రెసు నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడైన ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని ఉత్తమ్‌పై పోటీ చేయించాలనుకుంటే ఆయన అంగీకరించలేదు. ఎన్‌ఆర్‌ఐ శానంపూడి సైదిరెడ్డి పేరు వినబడుతోంది. మంత్రి జగదీశ్‌ రెడ్డి అనుచరుడు మారిపెద్ది శ్రీనివాస్‌ గౌడ్‌ పోటీ చేస్తానంటున్నారు. సైదిరెడ్డికి టిక్కెట్టు ఇవ్వవద్దని కోరుతున్నారు. ప్రస్తుతం సైదిరెడ్డి, శంకరమ్మ అభ్యర్థిత్వాలు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.

సైదిరెడ్డి ఎన్‌ఆర్‌ఐ కాబట్టి భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెసులోని కీలక నేతలపై పోటీచేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల వివరాలు త్వరలోనే బయటపడతాయి. తెలంగాణ కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతాడా? అనే సందేహం చాలాకాలం కొనసాగింది.  కాంగ్రెసులో సాధారణంగా ఎన్నికల ఏడాదిలో అధ్యక్షుడిని మారుస్తుంటారు. ప్రస్తుత అధ్యక్షుడి మీద ఏవో ఫిర్యాదులు, ఆరోపణలు అధిష్టానానికి వెళతాయి. ఈయనుంటే గెలుపు సాధ్యంకాదంటారు నాయకులు.

దీంతో ప్రస్తుత అధ్యక్షుడిని పీకేసీ మరొకరికి బాధ్యతలు ఇస్తుంటారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జికీ గందరగోళంగానే ఉంటుంది. అధిష్టానం ఎవరిని రుద్దుతుందో ఇన్‌చార్జీకీ చివరిక్షణం వరకు తెలియదు. ఈ పార్టీలో ఇది మామూలే. ఉత్తమ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఆయన ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఎట్టకేలకు ఆయన్నే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నామని, ఆయన సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌సి ఖుంటియా స్పష్టతనివ్వడంతో కథ సుఖాంతమైంది.