cloudfront

Advertisement


Home > Politics - Political News

కర్ణాటకలో ఇప్పుడు బీజేపీకి ఆయనే అండ!

కర్ణాటకలో ఇప్పుడు బీజేపీకి ఆయనే అండ!

భారతీయ జనతా పార్టీనేమో మెజారిటీకి దగ్గరదగ్గరగా వచ్చి ఆగింది. కాంగ్రెస్, జేడీఎస్‌లు చేతులు కలిపితేనేమో.. వాళ్లకు మినిమం మెజారిటీ ఉన్నట్టు. ఇలాంటి సమయంలో ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి? అనే అంశంపై న్యాయనిపుణులు పరస్పర విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం అయితే.. సింగిల్ లార్జెస్ట్ పార్టీని సంప్రదించాలి అని కొందరు చెబుతున్నారు. అబ్బే అలా కాదు.. సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు గవర్నర్ ఆలోచించాలి.. పొత్తులతో మినిమం మెజారిటీ ఉండే వాళ్లనే పిలవాలని మరి కొందరు అంటున్నారు.

ఇలా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది ఏ టీకొట్టులో కూర్చున్న వాళ్లు కాదు.. ఫేస్‌బుక్‌లో తీర్పులిస్తూ పోస్టులు పెట్టేవాళ్లు కాదు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ అటార్నీ జనరళ్లు, రాజ్యాంగాన్ని అవపోసన పట్టిన మేధావులు. వాళ్లలోనే క్లారిటీలేదు. ఒక్కోరు ఒక్కోమాట చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కర్ణాటక రాజకీయ పరిణామాలను గమనిస్తే, అక్కడి గవర్నర్ వజుభాయ్ వాలా ఏం చేస్తున్న దానిపై కొన్ని ప్రశంసలు మరిన్ని విమర్శలు తప్పడం లేదు. ఈయన పక్కా బీజేపీ మనిషి.. కరడు గట్టిన ఆర్ఎస్ఎస్ వాది అని ఈయన నేపథ్యం స్పష్టం చేస్తోంది.

కర్ణాటకలో గవర్నర్ గిరి అంటే దానంత పితలాటకం మరోటి ఉండదు. ఏ పార్టీ వాళ్ల చేత నియమితం అయిన గవర్నర్లు ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు అక్కడ. ఇదివరకూ యడ్యూరప్ప ప్రభుత్వం ఉన్నప్పుడు, సదానంద గౌడ లాంటివాళ్లు సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నియమిత హెచ్‌ఆర్ భరద్వాజ్ వాళ్లను ఊపి నీళ్లు తాపాడు. ముఖ్యమంత్రులను ప్రశాంతంగా ఉండనీయలేదు. బీజేపీ వాళ్లకు చుక్కలు చూపాడాయన.

ఇప్పుడు బీజేపీ నియమిత గవర్నర్ ఉన్నాడు. అందులోనూ బీభత్సమైన ఆర్ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి. మోడీ సన్నిహితుడు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వజుభాయ్ సహజంగానే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వైపుమొగ్గు చూపవచ్చు. ఎలాగూ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తోంది. రేపే ప్రమాణ స్వీకారం అని కూడా అంటున్నారు. యడ్యూరప్పేమో ఎన్నికల ముందు మే18వ తేదీని ప్రమాణస్వీకారానికి ముహూర్తంగా పెట్టుకున్నాడు.

అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో లేట్ అయితే మంచిది కాదని.. ముందే కానిచ్చేట్టుగా ఉన్నారు. ఈ పరిణామాలను బట్టిచూస్తే.. గవర్నర్ దయ చేతన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే అని స్పష్టం అవుతోంది. ప్రమాణస్వీకారం ఒకటీ అయిపోతే ఆ తర్వాత బీజేపీ వాళ్లకు ఎమ్మెల్యేల బలాన్ని సంపాదించడం పెద్దలెక్కేం కాకపోవచ్చు!