
ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా.. అప్పుడే సీఎం సీటు విషయంలో కాంగ్రెస్ నేతలు లొల్లి మొదలుపెట్టారు. నిజంగానే వీళ్లు గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ట్రయల్ పార్ట్ ను చూపిస్తున్నారు. కాంగ్రెస్ ‘సీనియర్’ నేత వీ హనుమంతరావు రెచ్చిపోయాడు. కూటమి గెలిస్తే సీఎం రేసులో తనూ ఉంటాను అన్నట్టుగా మాట్లాడాడు వీహెచ్.
కూటమి గెలిస్తే బలహీన వర్గానికి సీఎం పదవి ఇవ్వాలని.. ఆ బలహీనవర్గంలో తనే బలహీనున్ని అన్నట్టుగా వీహెచ్ మాట్లాడాడు. కూటమి గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అనడానికి ఆజాద్ ఎవరు?అని కూడా వీహెచ్ రెచ్చిపోయాడు. వాస్తవానికి కూటమి గెలిస్తే రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని ఆజాద్ అనలేదు. కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. ఈ రోజు సీఎం సీట్లో కేసీఆర్ ఉన్నాడు, రేపు రేవంత్ ఉంటాడు.. అని ఏదో యథాఫలంగా అన్నట్టుగా ఆజాద్ వ్యాఖ్యానించాడు.
ఈ విషయాన్ని కూడా సహించలేకపోయినట్టుగా ఉన్నాడు వీహెచ్. ఆజాద్ మీద విరుచుకుపడ్డాడు. ఆజాద్ ఎవరు అని ప్రశ్నించేశాడు.కాంగ్రెస్ గెలిచినప్పుడల్లా రెడ్లే సీఎంలు అవతున్నారని, గతంలో కూడా సీఎం సీటు తన నోటి వరకూ వచ్చిపోయిందని వీహెచ్ చెప్పుకొచ్చాడు. అయినా ఈయన ఎమ్మెల్యేగా గెలిచిందే ఎప్పుడో జమానాలో!
గత ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నో స్థానంలో వచ్చాడో వీహెచ్ కు అయినా గుర్తుందో లేదో.. ఈ సారి పోటీనే లేదు. అప్పుడే సీఎం సీటు మీద కర్చిఫ్ వేస్తున్నాడు. అక్కసు వెల్లగక్కేస్తున్నాడు. రేపు కాంగ్రెస్ కు ఓటేద్దామనుకునే వాళ్లను కూడా హడలు గొట్టేస్తున్నాడీయన!
సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్