cloudfront

Advertisement


Home > Politics - Political News

రాములమ్మ వైభవం టీఆర్‌ఎస్‌తోనే పోయిందా?

రాములమ్మ వైభవం టీఆర్‌ఎస్‌తోనే పోయిందా?

కాంగ్రెసు నేత కమ్‌ మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించబోతున్నారా? ఎన్నికల సమయంలో పార్టీకి అండగా నిలిచి ప్రచారం చేస్తారా? ఈ ప్రశ్నలు వేసుకోవడానికి కారణం త్వరలోనే ఆమె రీఎంట్రీ ఇస్తున్నారనే వార్త రావడం. ఈనెల (సెప్టెంబరు) 15వ తేదీ తరువాత తాను కాంగ్రెసు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని ఆమె ప్రకటించారు. ఆమె రీఎంట్రీ ఇవ్వడానికి తెరవెనక ఏం జరిగిందనేది ఇంకా స్పష్టంగా తెలియదు. పార్టీలో కీలకపదవి లేకపోవడంవల్లనే తాను చురుగ్గా పాల్గొనడంలేదని ఆమె తన సన్నిహితులతో చెప్పుకున్నారట.

మరి ఆమె పదవి లేకుండానే వస్తున్నారా? పదవి ఇస్తామని అధిష్టానం వాగ్దానం చేసిందా తెలియదు. టీడీపీ-కాంగ్రెసు పొత్తును నిరసిస్తూ వ్యాఖ్యలు చేసిన విజయశాంతి అదే సందర్భంలో తాను మళ్లీ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటానని చెప్పారు. టీడీపీతో పొత్తుపై అధిష్టానం మరోమారు ఆలోచించాలన్నారు. అయితే పొత్తుపై ఆమె తన నిరసనను చాలా ఆలస్యంగా తెలిపారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయాక ఆమె నిరసించినా ఉపయోగంలేదు. పొత్తుపై ఆమె వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.

ఆమె రీఎంట్రీ ఇచ్చాక ఆమెను అసెంబ్లీకి పోటీ చేయిస్తారా? పార్లమెంటు ఎన్నికల బరిలో నిలబెడతారా తేలుతుంది. ఆమె ఎప్పుడు గడపదాటి బయటకు వస్తుందా అని కాంగ్రెసు నాయకులు ఎదురు చూస్తున్నారు. ఆమె గత ఎన్నికల తరువాత పార్టీకి పూర్తిగా దూరంగా ఉన్నా నాయకులు ఏమీ అనలేదు. అధిష్టానమూ పట్టించుకోలేదు. కాంగ్రెసు నాయకులు ఇప్పటికీ విజయశాంతిని పెద్ద నాయకురాలిగానే పరిగణిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఓ అలవాటుంది. తనకు ఇష్టంలేని వ్యక్తుల లేదా నాయకుల గురించి సాధారణంగా సభల్లో, సమావేశాల్లో ప్రస్తావించరు. ఆ వ్యక్తులు తనను ఏమైనా అంటే స్పందిస్తారేమోగాని తనతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నవారిని తలచుకోవడం ఇష్టముండదు. అలా ఎవరి గురించైనా ప్రస్తావించాలన్నా కొంత వ్యంగ్యం జోడిస్తుంటారు. కాని అజ్ఞాతంలో ఉన్న  విజయశాంతి గురించి కేసీఆర్‌ అసెంబ్లీలో గతంలో ఓసారి ప్రస్తావించారు. అదీ సానుభూతిగా మాట్లాడటం విశేషం.  

'విజయశాంతిని ఇప్పుడు ఎటూకాకుండా అడవిపాలు చేసింది కాంగ్రెసు నాయకులే. ఆమెను పట్టుకుపోయి సోనియాతో కండువా కప్పించి గందరగోళం చేశారు' అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు కేసీఆర్‌. విజయశాంతి టీఆర్‌ఎస్‌ నుంచి దూరమయ్యాక కేసీఆర్‌ ఇప్పటివరకు ఆమె గురించి పాజిటివ్‌గా గాని, నెగెటివ్‌గా గాని మాట్లాడిన దాఖలాలు లేవు. విజయశాంతిదీ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో ఓడిపోయాక  ఇప్పటివరకు ప్రభుత్వంపై గాని, వ్యక్తిగతంగా కేసీఆర్‌పైగాని ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.

వివిధ ఘటనలపై, రాజకీయ పరిణామాలపై పెదవి విప్పలేదు. ఆమె కాంగ్రెసులో ఉందనే విషయం చాలామంది మర్చిపోయారు. ఆ పార్టీ నాయకులు విజయశాంతిని గురించి ఎక్కడా, ఎప్పుడూ  ప్రస్తావించడంలేదు. కాంగ్రెసు నాయకత్వం ఆమెకు ప్రాధాన్యం ఇచ్చినా విజయశాంతి ప్రజలకు ఏం చెప్పుకుంటారనేది కీలక ప్రశ్న. గత ఎన్నికల తరువాత తాను ఎందుకు అజ్ఞాతంలో ఉందో చెప్పాలి. కాంగ్రెసు నాయకులు బతిమాలినా ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేయలేదో చెప్పాలి.

రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసమా? ప్రజాసేవ కోసమా? అనేది వివరించాలి. ఆమె టీఆర్‌ఎస్‌ ఉన్న కాలంలోనే జనానికి కనబడలేదని విమర్శలు వచ్చాయి. 'మా ఎంపీ కనబడటంలేదు' అని ప్రజలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పదవి ఉన్నా లేకపోయినా, ఓడిపోయినా, గెలిచినా నిరంతరం ప్రజల్లో ఉండేవారే నాయకులవుతారు.

విజయశాంతి రాజకీయ వైభవం టీఆర్‌ఎస్‌తోనే పోయిందేమోననిపిస్తోంది. ఆమె మళ్లీ చురుగ్గా రాజకీయాల్లోకి వచ్చినా ప్రజాదరణ ఉంటుందా? ఆమె అజ్ఞాతం వీడి బయటకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడితేగాని ఆమె రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది చెప్పలేం.