cloudfront

Advertisement


Home > Politics - Political News

పప్పు, నిప్పు: విజయసాయిరెడ్డి దైర్యమేంటి.?

పప్పు, నిప్పు: విజయసాయిరెడ్డి దైర్యమేంటి.?

రాజకీయాలంటే ఆరోపణలు సర్వసాధారణం. ఆ ఆరోపణలు హద్దులు దాటేయడం మామూలే. కానీ, ఆరోపణలు చేసే సమయంలో సవాల్‌ విసరడం కాస్తంత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంటుంది. వైఎస్సార్సీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, టీటీడీలో అక్రమాలు జరిగాయంటున్నారు. సీబీఐ విచారణ జరగాల్సిందేనని నినదిస్తున్నారు. చంద్రబాబు అండ్‌ కో నిలువునా 'వెంకన్నను' దోచేశారని ఆరోపిస్తున్నారు. తన ఆరోపణల్లో నూటికి నూరుపాళ్ళూ వాస్తవం వుందని తెగేసి చెబుతున్నారు. తాజాగా, తన ఆరోపణల్ని ఇంకోసారి పునరుద్ఘాటించిన విజయసాయిరెడ్డి, తన ఆరోపణలపై విచారణ జరిపించాలనీ, ఆ విచారణలో చంద్రబాబు నిర్దోషి అని తేలితే, రాజకీయాల నుంచి తప్పుకుంటాననీ సవాల్‌ విసిరేశారు.

ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా టీటీడీని రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పాలకులు మార్చేశారన్నది నిర్వివాదాంశం. ఇదిప్పటి మాట కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న వ్యవహారమే. ఎవరు అధికారంలో వున్నా సరే, టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగానే భావిస్తున్నారు. వెంకటేశ్వరస్వామి పేరుతో రాజకీయాలు చేస్తూనే వున్నారు. వందల కోట్లు కాదు, వేల కోట్ల సంపద వున్న వెంకటేశ్వరస్వామిని 'ఆదాయ మార్గం'గానే ప్రభుత్వాలు చూస్తున్నాయన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. అయితే, గత కొంతకాలంగా వెంకన్న సంపద దోపిడీకి గురవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధాన అర్చకుడిగా పదవీ కాలం పూర్తి చేసుకున్నాకగానీ, రమణ దీక్షితులుకి టీటీడీలో అక్రమాలు గుర్తుకు రాలేదు. పైగా, శ్రీవారి పోటులో తవ్వకాలు జరిగాయని ఆరోపిస్తున్నారాయన. ఇంతటి తీవ్రమైన ఆరోపణ టీటీడీ మీద వచ్చినప్పుడు, అందులో నిజమెంతుందో ప్రజలకు చెప్పాల్సిన ప్రభుత్వం, ఎలాంటి విచారణకూ ఆదేశించకపోవడం ఆశ్చర్యకరమే. పార్టీ పరంగా టీడీపీ నేతలు స్పందించడాన్ని 'సమాధానంగా' భావించలేం. ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా చర్యలు వుండి తీరాలి. ఇది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన విషయం. టీటీడీ అనే ఓ సంస్థ మనుగడకి సంబంధించిన అంశం.

గతంలో టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి వైఎస్‌ జగన్‌ మీద ఆరోపణలు వస్తే, ఆరోపణలు తన కుమారుడి మీద వచ్చినాసరే, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీబీఐ విచారణ కోరారు. ఇప్పుడు, టీటీడీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి చంద్రబాబు మాత్రం, విచారణ లేదని తెగేసి చెబుతున్నారు. పైగా, టీటీడీనీ.. వెంకటేశ్వరస్వామినీ వివాదాల్లోకి లాగితే పుట్టగతులు లేకుండా పోతాయని శాపనార్ధాలతో విరుచుకుపడ్తున్నారు ముఖ్యమంత్రి.

ఇదిలా వుంటే, 'పప్పు నాయుడు.. నిప్పు నాయుడు తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు.. సమాచారం కోసమైతే టీటీడీ నన్ను సంప్రదించొచ్చు. అంతేగానీ, నాకు నోటీసులు పంపేంత సీన్‌ టీటీడీకి లేదు' అంటూ విజయసాయిరెడ్డి, తనకు టీటీడీ నోటీసులు పంపిన వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ దోషులుగా బోనులో నిల్చుంటే, సాక్షిగా తాను తన దగ్గరున్న వివరాల్ని ఇచ్చేందుకు సిద్ధమని విజయసాయి చెప్పుకొచ్చారు.

విజయసాయి ఇంత కాన్ఫిడెంట్‌గా వున్నారంటే, అక్కడ వ్యవహారం చాలా తేడాగా వుందనే అర్థం చేసుకోవాలి. దోపిడీ జరిగింది కాబట్టే, చంద్రబాబు అండ్‌ టీమ్‌.. 'శాపనార్ధాలతో' సరిపెడ్తోంది. లేకపోతే, టీటీడీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు ఆదేశించి, విజయసాయిరెడ్డితో రాజకీయ సన్యాసం ఇప్పించే అవకాశాన్ని టీడీపీ ఎందుకు వదులుకుంటుందట.?