
అధికారులు తన విధులను కచ్చితంగా చేస్తే సింహ గర్జనే వినాల్సి ఉంటుంది. తప్పు చేసిన వారు తప్పించుకుందామనుకునే వారు దెబ్బకు చిత్తు కావాల్సిందే. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడపాల్సిందే.
అలాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ విశాఖ జాయింట్ కలెక్టర్ గా వచ్చారు. ఆయనే వేణుగోపాలరెడ్డి. ఆయన భూ కబ్జాల మీద మూడవ కన్నే తెరిచారు. గజం జాగా ఆక్రమణలో ఉన్నా కూడా లెక్క తీసి మరీ చుక్కలు చూపిస్తున్నారు.
మూడు రోజుల క్రితమే వంద కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విశాఖ నగర శివార్లలో కబ్జా కోరుల నుంచి ప్రభుత్వ పరం చేసిన జేసీ తాజాగా మరో వంద కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని విశాఖలో స్వాధీనం చేసుకుని సంచలనం సృష్టించారు.
విశాఖ పొలిమేరలలో భీమిలీ నియోజకవర్గం పరిధిలో గుడిలోవ వంటి ఖరీదైన ప్రాంతంలో ఏకంగా వంద కోట్ల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసిన భూ దందాకోర్ల నుంచి జేసీ స్వాధీనం చేసుకుని తడాఖా ఏంటో చూపించారు.
జాతీయ రహదానికి ఆనుకుని ఉన్న ఈ భూమి ధర ఎప్పటికపుడు కోట్లకు పడగెత్తేదే కావడం విశేషం. ఇదే తీరున మరిన్ని కబ్జా భూములను వెనక్కి లాగడానికి జేసీ చేస్తున్న ప్రయత్నాలు విశాఖలోని భూ కబ్జాదారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. మరి వారికి ఎప్పటికైనా నిద్రపడుతుందా.