cloudfront

Advertisement


Home > Politics - Political News

ఊహల్లో నేతలు.. ఉత్కంఠలో ప్రజలు..!

ఊహల్లో నేతలు.. ఉత్కంఠలో ప్రజలు..!

ఎన్నికల ఫలితాలపై ఆయా రాజకీయ పార్టీల నేతల ఊహల్లో విహరిస్తుండగా, ప్రజలు మాత్రం ఫలితాల కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్ధులు ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్‌ సరళి ఆధారంగా గెలుపోటములపై అంచనాలు వేసుకుంటున్నారు. వివిధ గ్రామాలలో జరిగిన పోలింగ్‌ శాతం, ఆయా ప్రాంతాల్లో కార్యకర్తల నుండి వచ్చిన వివరాల మేరకు తమకు లభించిన ఓట్లపై లెక్కలేసుకుంటున్నారు. ఈ విధంగా తెలుగుదేశం, వైకాపా, జనసేన నేతలు ఎవరికివారు నియోజకవర్గాల్లో తమకు లభించే అవకాశం ఉన్న ఓట్లు, మెజారిటీలపై లెక్కలేసుకుంటున్నారు. ఇదిలావుంటే ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నుండి పోటీచేసిన అభ్యర్ధులు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

నోటిఫికేషన్‌ విడుదలైన నెలరోజుల్లోగా పోలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. ఫలితాలకు 42 రోజులు గడువు విధించారు. సుదీర్ఘకాలం ఫలితాల కోసం ఎదురుచూడాల్సి రావడంతో అభ్యర్ధులు నరాలు తెగే ఉత్కంఠతో రోజులు వెళ్ళదీస్తున్నారు. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుండటంతో అప్పటివరకూ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు (ఈవీఎం) స్ట్రాంగ్‌ రూములకే పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ జరిగాక ఓట్ల లెక్కింపునకు ఇన్నిరోజులు అవసరమా? అన్న సందేహం రాజకీయ నాయకులతో పాటు అన్నివర్గాల ప్రజల్లోనూ నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుంది.

ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే కొనసాగాల్సి వస్తుంది. అంటే శాసనపరమైన, అధికారికమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కోల్పోతారు. ఇక పోలింగ్‌ ప్రక్రియ ముగియగానే అభ్యర్ధుల భవితవ్యం స్ట్రాంగ్‌ రూముల్లో ఉంటుంది. ఓట్ల లెక్కింపు ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా నేతల గెలుపోటములు బహిర్గతమవుతాయి. అయితే ఓట్ల లెక్కింపునకు సుదీర్ఘ కాలాన్ని నిర్దేశించడంతో అభ్యర్ధుల జయాపజయాలను సకాలంలో తెలుసుకునే అవకాశం లేకపోతోంది. ఓటరు నాడి అంతుచిక్కకపోవడంతో నేతలు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు? ఎవరు అపజయాన్ని పొందుతారు? అన్న స్పష్టతను ఇప్పటికే ఓటరు తన తీర్పు ద్వారా ప్రకటించాడు.

ముఖ్యమంత్రి నుండి స్థానిక ఎమ్మెల్యే వరకు తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండనుందో అర్ధంకాని అయోమయ స్థితిలో గడుపుతున్నారు. మరోవైపు గోదావరి జిల్లాల ప్రజలు రాజకీయ పార్టీల జయాపజయాలపై అంచనాలు వేసుకుంటున్నారు. మీడియా సంస్థలైతే ఇప్పటికే నేతల గెలుపోటములపై తమ అభిప్రాయాలను వ్యక్తంచేశాయి. తాజా సర్వేలంటూ కొన్ని సంస్థలిచ్చిన ఫలితాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంటెలిజన్స్‌ సర్వేలంటూ కొందరు సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారం ఆయా రాజకీయ పార్టీలు సహా సామాన్యులకు కంటినిండా వినోదాన్ని పండిస్తోంది.

జాతీయస్థాయి మీడియా ఇటీవల ఇచ్చిన సర్వేల నివేదికలు సైతం సోషల్‌ మీడియా వేదికగా హడావుడి సృష్టించాయి. ఇదిలావుంటే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ తీరుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు విరుచుకుపడటం ప్రజల్లో చర్చనీయాంశమయ్యింది. ఎన్నికలకు అతి తక్కువ వ్యవధినివ్వడంతో పాటు ఎన్నికల ఫలితాలకు అతి ఎక్కువ సమయాన్ని కేటాయించడంపై తొలి నుంచి టీడీపీ అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. పోలింగ్‌ ప్రక్రియను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్‌ విధానంలో నిర్వహించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. అప్పటికే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.

పోలింగ్‌కు అతికొద్ది రోజుల ముందు డేటాచోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. పోలింగ్‌ రోజు ఎన్నికల సరళి గమనించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు 30శాతం ఈవీఎంలు పనిచేయలేదని ఆందోళన వ్యక్తంచేశారు. అసలు నా ఓటు నాకేపడిందా? అన్న డౌటు తనకుందని, ఆగమేఘాలపై ఎన్నికలు ఎందుకు పెట్టవలసి వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవీఎంలన్నీ కేంద్రం నుండే వచ్చాయని, ఈవీఎంలను ఏ విధంగా ట్యూన్‌ చేసి పంపించారో ఎవరికి తెలుస్తుంది? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఈ కారణాలతోనే రాష్ట్ర ఎన్నికల అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పిర్యాదు చేయల్సివచ్చిందని ఆయన చెబుతున్నారు.

వైకాపా నేతలు మాత్రం ఎన్నికల కమీషన్‌ పనితీరును ప్రశంసించడంతో పాటు చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తుతున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికలపై లేనిపోని ఆరోపణలు చూస్తుంటే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం చంద్రబాబును వెంటాడుతున్నట్లు స్పష్టమవుతోందని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు.

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి