cloudfront

Advertisement


Home > Politics - Political News

ఓటింగ్‌ శాతంపై సర్వత్రా ఉత్కంఠ

ఓటింగ్‌ శాతంపై సర్వత్రా ఉత్కంఠ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమయ్యింది. ఉదయం నుంచీ పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగానే జనం కన్పిస్తున్నారు. కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో లోపాలు, కొన్ని చోట్ల కరెంటు లేక సమస్యలు, వీటికితోడు.. ఈవీఎంలను లైటింగ్‌ లేనిచోట ఏర్పాటు చేశారన్న ఆరోపణలతో.. ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కన్పిస్తోంది.

ఇదిలావుంటే, దివ్యాంగుల కోసం, మహిళల కోసం ఈసారి కొన్నిచోట్ల ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్ల పట్ల ఓటర్లు హర్షం వ్యక్తంచేశారు. ప్రత్యేకంగా డెకరేట్‌ చేసిన పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్లకు ఆహ్లాకరమైన వాతావరణాన్ని అందిస్తుండడం ఈసారి ఎన్నికల ప్రత్యేకతగా చెప్పుకోవాలేమో.!

ఇక, ఓటింగ్‌ విషయానికొస్తే.. ఉదయం నుంచీ గంట గంటకూ పోలయిన ఓట్లశాతం పట్ల ఆయా పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ కన్పిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఓటింగ్‌ కాస్త ఎక్కువగా నమోదైతే, ఆ తర్వాత కొంచెం తగ్గినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న సమయంలో తగ్గి, సాయంత్రం మళ్ళీ పెరిగే అవకాశాలూ లేకపోలేదు. 11 గంటల సమయానికి మొత్తంగా 23.4 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది.

ఓటింగ్‌ శాతం పెంచేదిశగా ఎన్నికల కమిషన్‌, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతంలో.. అంటే, 2014తో పోల్చితే ఈసారి పోలింగ్‌ ఎక్కువగా నమోదు కావొచ్చన్నది ఓ అంచనా.

పోలింగ్‌ శాతాన్ని బట్టి, ఆయా పార్టీ అభ్యర్థులు, పార్టీలు.. తమ గెలపోటములపై ఓ అంచనాకి రావడం జరుగుతుంటుంది. ఎవరి అంచనాలు ఎలా వున్నా, వాస్తవ ఫలితం మాత్రం డిసెంబర్‌ 11న వెల్లడి కానుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ పూర్తవనున్న దరిమిలా, ఆ వెంటనే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు బయటకొచ్చేస్తాయి. 

తెలంగాణ వోటింగ్ ఇవాలే... ముళ్లు ఎటువైపు తిరుగనుంది?