cloudfront

Advertisement


Home > Politics - Political News

ఓటుకు నోటు.. భలే ఛాన్సులే.!

ఓటుకు నోటు.. భలే ఛాన్సులే.!

ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవు. ఎన్నికల వేళ దాదాపు అన్ని రాజకీయ పార్టీలదీ ఒకటే తంతు. అడ్డగోలు హామీలు ఒకఎత్తు.. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం ఇంకోఎత్తు. ప్రచార గడువు ముగిశాక, పోలింగ్‌కి కొద్దిగంటల ముందు ప్రారంభమయ్యే పంపకాలు ఇంకోఎత్తు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ పంపకాల హంగామానే కన్పిస్తోంది. తనిఖీల్లో పెద్దయెత్తున డబ్బు, మద్యం, రకరకాల రూపాల్లో బహుమతులు దొరుకుతున్నా.. దొరకనిదే ఎక్కువ.

100 కోట్లకు పైగా నగదు, లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. తనిఖీలు ఇంకా జరుగుతూనే వున్నాయి.. నోట్లకట్టలు బయటపడుతూనే వున్నాయి. ఈ తనిఖీల దారి తనిఖీలదే.. పంపిణీల దారి పంపిణీలదే. ఓ నియోజకవర్గంలో ఓటుకి వెయ్యి పంచుతోంటే, ఇంకో నియోజకవర్గంలో 2 వేలు పంచుతున్నారు. మరో నియోజకవర్గంలో ఏకంగా రేటు 4 వేలకు పలుకుతోంది. ఆగండాగండీ.. ఇక్కడితో రేట్‌ ఫైనల్‌ అయిపోలేదు.. కథ ఇంకా చాలానే వుంది.

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొన్నిచోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. కొడంగల్‌ లాంటి నియోజకవర్గాలన్నమాట. ఇక్కడ, ఓటు రేటు అనూహ్యంగా పెరిగిపోతోంది. ఉదయం ఒక రేటు, సాయంత్రానికి మరో రేటు.. అన్నట్టుంది పరిస్థితి. ఇదంతా, తెరవెనుకాల జరిగే వ్యవహారం. దండుకున్నోడికి దండుకున్నంత.. అనొచ్చేమో.

గత కొన్నేళ్ళుగా ఎన్నికల్లో ఓట్ల అమ్మకానికి 'వేలంపాట' కూడా నిర్వహిస్తున్నారండోయ్‌. ఈ ట్రెండ్‌ ఇప్పుడు తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో కన్పిస్తోంది. ఎన్నికల కమిషన్‌ అయినా ఎంతవరకు నిఘా పెట్టగలదు.? వున్నంతలో అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నా.. ప్రలోభాల పర్వాన్ని ఆపలేకపోతున్నారు.

కొడంగల్‌, కూకట్‌పల్లి తదితర నియోజకవర్గాలు అత్యంత ఖరీదైనవిగా ఎన్నికల వేళ రికార్డులకెక్కుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ళ జీవితాన్ని ఐదువేల రూపాయలకు అమ్మేసుకుంటామా.? అన్నది ఓటరు ఆలోచించుకోవాలి.

అదే సమయంలో, 'పంచే డబ్బు మాదే కదా.. తీసుకుంటే తప్పేంటి.? మేం ఎవరికి ఓటెయ్యాలో వారికే వేస్తాం..' అని కొందరు ఓటర్లు బాహాటంగానే మాట్లాడుతుండడం ఆశ్చర్యకరమే. ఇంతలా ఎన్నికల్లో ప్రలోభాల పర్వం నడుస్తోంటే, దీన్ని ప్రజాస్వామ్యం అనగలమా.? గెలిచినోడు.. ప్రజాసేవ మాత్రమే చేస్తాడని ఆశించగలమా.?

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్