Advertisement

Advertisement


Home > Politics - Political News

వీఆర్వోలు Vs సెక్రటరీలు.. ఇదెక్కడి పంచాయితీ!

వీఆర్వోలు Vs సెక్రటరీలు.. ఇదెక్కడి పంచాయితీ!

గ్రామ సచివాలయాలకు వీఆర్వోలను బాస్ లుగా చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన తాజా జీవో వివాదంగా మారింది. సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ పంచాయతీ సెక్రటరీలకే పెత్తనం అప్పగించారు. డ్రాయింగ్ అండ్ డిస్బర్స్ మెంట్ అధికార్లు (డీడీవో) గా వారికే అధికారం ఉండేది. 

జీతాల బిల్లులు పెట్టడంతో పాటు, వాలంటీర్లపై కూడా పెత్తనం వారికే ఉండేది. తహశీల్దార్ ఆఫీస్ లలో పనిచేసే వీఆర్వోలను సచివాలయాల్లో కలిపేసి, వారికి కొత్తగా రిక్రూట్ అయిన పంచాయతీ సెక్రటరీలను బాస్ లుగా చేయడంతో గొడవ మొదలైంది.

పోలీస్ డిపార్ట్ మెంట్, రెవెన్యూ డిపార్ట్ మెంట్ 24గంటలు ఆన్ డ్యూటీలో ఉండాల్సిందే. ఎప్పుడు ఏ ఫోన్ కాల్ వచ్చినా, ఎక్కడ ఏ విపత్తు వచ్చినా పరిగెత్తుకెళ్లేది ఈ రెండు శాఖల ఉద్యోగులు మాత్రమే. అలాంటిది.. వీఆర్వోలకు పని గంటలు విధించి, సచివాలయాల్లో అటెండెన్స్ వేస్తూ, వారిపై సెక్రటరీలకు అజమాయిషీ అప్పగించే సరికి పనితీరులో తేడా వచ్చింది. 

ఉదయం 10 నుంచి 5 గంటల వరకు డ్యూటీ చేసే పంచాయతీ సెక్రటరీ, 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉండే వీఆర్వోపై అధికారాలు చెలాయించడం సరికాదని రెవెన్యూ సంఘాలు, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.

దీంతో ఈ విషయంపై రెండు నెలలుగా చర్చోపచర్చలు జరిపి చివరకు డీడీవోలుగా వీఆర్వోలకు అధికారాలిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. విలేజ్ సెక్రటరీలను పంచాయతీ కార్యాలయాలకు పరిమితం చేసింది. సచివాలయాలకు వీఆర్వోలు డీడీవోలుగా.. పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాలకు విలేజ్ సెక్రటరీలు సంధానకర్తలుగా ఉండేలా అధికార విభజన జరిగింది.

సెక్రటరీల ఆందోళన.. వ్యతిరేక ప్రచారం..

వీఆర్వోలకు పెత్తనం ఇవ్వడంతో పంచాయతీ సెక్రటరీలు రగిలిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల మధ్య సోషల్ మీడియా వార్ పెద్ద ఎత్తున నడుస్తోంది. రెవెన్యూ వ్యవస్థ అవినీతిమయం అయిపోయిందని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తే.. టైమ్ కు పనిచేసి ఇంటికెళ్లిపోయే పంచాయతీ కార్యదర్శులకు మా కష్టం ఏం తెలుసంటూ రెవెన్యూ వర్గాలు మండిపడుతున్నాయి. 

గ్రామంలో ఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా వీఆర్వోల దగ్గరనుంచే పని మొదలు కావాలని, అలాంటిది రెవెన్యూ వ్యవస్థపై ఎందుకంత అక్కసంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సప్ గ్రూప్ లు, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ గొడవ మరింత పెద్దదైంది.

వీఆర్వో వ్యవస్థ రద్దు తెలంగాణలో సత్ఫలితాలనిచ్చిందా..?

ఈ పోటీ వ్యవహారంలో తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు విషయం కూడా చర్చకు వస్తోంది. తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినా దానివల్ల ఎలాంటి ఫలితాలొచ్చాయనేది మాత్రం అనుమానమే. 

కేవలం వీఆర్వో అనే పేరు లేకుండా పోయింది కానీ, వారి పనులు వేరేవారికి దఖలు పడటంతో అక్కడా ఇదే తంతు జరిగుతోంది. రాగా పోగా.. వీఆర్వోలను తిరిగి అదే డిపార్ట్ మెంట్ లోకి తీసుకుంటామంటూ కేసీఆర్ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలముందు హామీ కూడా ఇచ్చేశారు.

ఏపీలో ఏం జరుగుతుందో..?

సచివాలయాలకు వీఆర్వోలను బాస్ లుగా చేస్తూ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని రెవెన్యూ సంఘాలు స్వాగతిస్తున్నాయి. మరి పంచాయతీ ఉద్యోగుల ఆందోళనతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా..? సవరణలు చేస్తూందా..? అనే విషయం తేలాల్సి ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?