cloudfront

Advertisement


Home > Politics - Political News

వెల్‌డన్‌ జగన్‌.. కీప్‌ ఇట్‌ అప్‌

వెల్‌డన్‌ జగన్‌.. కీప్‌ ఇట్‌ అప్‌

అన్నం ఉడికిందా? లేదా అన్నది తెలుసుకోవడానికి మొత్తం అన్నం అంతా పట్టుకోనవసరం లేదు. ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే ఒక ముఖ్యమంత్రి పనితీరు మొదటివారంలోనే అర్థం అవుతుందని అనుకోవచ్చు. నలభైఐదేళ్ల వయసులో తన కష్టార్జితంతో ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌ పదవీబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలను గమనించండి. వాటిలో ఒక నిబద్ధత కనిపించడం లేదూ.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూనే ఒకమాట చెప్పారు. తాను సంక్షేమ కార్యక్రమాల అమలులో కులం చూడను, పార్టీ చూడను. ప్రాంతం చూడను.. అర్హులైన ఎవరైనా తనకు ఒకటే అని స్పష్టంచేశారు. అంతేకాక ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ముందుగా వృద్ధుల పెన్షన్‌ను పెంచారు.

నిజానికి ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఇది చాలా కష్టమైన విషయం. అయినా జగన్‌ తొలి నిర్ణయం అవ్వ, తాతలకు కొంత మేలు చేసేదిగా ఉండాలని అనుకున్నారు. జగన్‌ పాదయాత్రలో బహుశా ఎక్కువ మంది అవ్వ, తాతలను కలుసుకున్నారు. వారి దుర్భర జీవితాలను గమనించారు. అందుకే ముందుగా ఆయన వారికి పెన్షన్‌ పెంచారు. ఆయన ఎప్పుడూ ఒక్కసారే మూడువేల రూపాయలుగా పెన్షన్‌ చేస్తానని చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమేపీ పెంచుకుంటూ పోతానని చెప్పారు. కాని తెలుగుదేశం నేతలు కొందరు దీనిపై దుష్ప్రచారం చేయడం ఆరంభించారు. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు. టీడీపీ గత ఐదేళ్లుగా ఆడిన అబద్ధం ఆడకుండా ఆడి గబ్బుపట్టింది. కనీసం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా నిజాలు మాట్లాడడం అలవాటు చేసుకుంటే మంచిది. లేకుంటే వారికే నష్టం అనిచెప్పాలి.

ప్రజలు టీడీపీ అబద్ధాలను సహించలేకపోయారని గంటా వంటివారు గుర్తించాలి. నిజానికి మాబోటి వారం బహుశా ఏడాదికి 200 రూపాయలు చొప్పున పెంచుతారని అనుకున్నాం. కాని నాలుగేళ్లలోనే పెన్షన్‌ మూడువేల రూపాయలు తీసుకువెళ్లాలని ఆయన సంకల్పించారు. అంతేకాదు. కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల చొప్పున పెన్షన్‌ ఇస్తానన్న హామీని వెంటనే నిలబెట్టుకున్నారు. ఆశా వర్కర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచడం కూడా ఆయన చేశారు. జగన్‌ విశాఖపట్నం వెళ్లినప్పుడు బ్యానర్‌ పట్టుకుని నిలబడినవారి వద్దకు వెళ్లి మానవత్వంతో స్పందించడం కూడా పలువురి దృష్టిని ఆకర్షించింది. ఆ సందర్భంగా ఆ బ్యానర్‌ పట్టుకుని ఉన్న యువతి ఏమన్నదో చూడండి.. జగన్‌ ఆరునెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానని అన్నారని, కాని ఆరు రోజులలోనే మంచి సీఎం అయ్యారని వ్యాఖ్యానించింది.

ఇంతకంటే జగన్‌కు ఏమి తృప్తి కావాలి? ఇప్పటివరకు ఆయన నిర్ణయాలను గమనిస్తే, సమాజంలో అట్టడుగున ఉండి, అనేక కష్టాలు పడుతున్న వారికి జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థం అవుతుంది. ఇవే కాదు, మరికొన్ని నిర్ణయాలు కూడా ఆయన చేశారు. మద్య నిషేధంపై కూడా దశలవారీగా చేస్తామని చెప్పారు. అదే ప్రకారం ఆయన బెల్ట్‌షాపుల నిరోధనాకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బెల్ట్‌షాపుల ఎత్తివేత అన్నది అంత తేలికైన విషయంకాదు. రాజకీయంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్న విషయం ఇది. అయినా జగన్‌ నిర్భయంగా ముందుకు వెళుతున్నారు. ఒక్కసారి 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుకు ఐదు మొదటి సంతకాలు పెట్టినా వాటిలో నాలుగు ఆచరణకు రావడమే కష్టం అయింది. అంతేకాదు, కలెక్టర్‌ల సమావేశం పెట్టి టీడీపీ నేతలకు, కార్యకర్తలకు సహకరించాలని నేరుగా చెప్పి కలకలం సృష్టించారు.

కాని జగన్‌ మాత్రం పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలని స్పష్టంచేశారు. ఈ ఒక్క పాయింట్‌లో తేడాను గమనించవచ్చు. నలభై ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకునే చంద్రబాబు తీరు వివాదాస్పదం అయితే, జగన్‌ తీసుకున్న నిర్ణయాలకు సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం సమకూర్చే ఏజెన్సీలకు పారితోషికం పెంచడం కాని, శనివారం నాడు పిల్లలకు పుస్తకాల బ్యాగ్‌ల భారంలేకుండా చేయడం కాని.. ఇవన్ని హర్షణీయం. అంతేకాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఎంతో సంతోషం కలిగించారని చెప్పాలి.

చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల మద్య ఉద్రిక్తతలు ఏర్పడే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే జగన్‌ అందుకు భిన్నంగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా జగన్‌కు పండు తినిపించిన దృశ్యం అందరికి ఆనందదాయకం అయిందని చెప్పాలి. అలాగే కేంద్రంలో ప్రధాని మోడీని కలవడం, ఆయన నుంచి సహకారం పొందడానికి హామీ తెచ్చుకోగలగడం వంటివి కూడా జగన్‌కు ఉపకరించే అంశం అవుతుంది. చంద్రబాబుకు జగన్‌కు ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే, జగన్‌ ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు.

చంద్రబాబుకు ఆయాచితంగా కాకపోయినా, తనమామ ఎన్‌టీఆర్‌ను దించేసి ముఖ్యమంత్రి సీటు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత మరోసారి వాజ్‌పేయి, ఇంకోసారి మోడీ, పవన్‌ కళ్యాణ్‌ల సాయంతో అధికారంలోకి వచ్చారు. కాని ఆ విషయం ఆయన మర్చిపోయి తను సొంతంగా అధికారంలోకి వచ్చానని భ్రమించారు. తనంత సీనియర్‌ దేశంలోనే లేరని అనుకునేవారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిత్యం కాలుదువ్వేవారు. జగన్‌ మాత్రం వాటికి విరుద్ధంగా ఎంతో మర్యాదగా, హుందాగా ఉండడం స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలా అన్న లక్ష్యంతో ఆయన కనిపిస్తున్నారు.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఈ వారంలో జగన్‌ వ్యవహార శైలి అందరి ప్రశంసలు పొందగలిగిందని చెప్పవచ్చు. ప్రత్యర్థి పార్టీలుగా ఉండే సీపీఎం పక్షనేతలు కూడా జగన్‌ను మెచ్చుకున్నారంటేనే ఇక వేరే సర్టిఫికెట్‌ ఇవ్వవలసిన అవసరం ఏముంటుంది. సో.. వెల్‌డన్‌ జగన్‌.. కీప్‌ ఇట్‌ అప్‌.
-కొమ్మినేని శ్రీనివాసరావు

పవన్‌ తత్త్వమేమిటో బోధపడలేదు