cloudfront

Advertisement


Home > Politics - Political News

వాట్ ఏ సూపర్ ప్లానింగ్ బాబూ?

వాట్ ఏ సూపర్ ప్లానింగ్ బాబూ?

ఇంతటి ప్లానింగ్ ఎవరికైనా వుంటుందా? వుండదు కాక వుండదు. చతురంగ బలాలు వుంటేనే ఎవరైనా ఏమైనా చేయగలరు. తెలుగుదేశాధినేత చంద్రబాబుకు అలాంటి చతురంగ బలాలు వున్నాయి. ఆయన హితులు, సన్నిహితులు అన్ని రంగాల్లో వున్నారు. సదా మీ సేవలో అన్నట్లు వుంటారు వాళ్లంతా. అది ఆయన చేసుకున్న అదృష్టం. ఆయన రచించిన ప్లానింగ్. అందువల్లే ఏ విధంగానూ ఆయనను టచ్ చేయలేరు.

2014 ముందు సీన్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రాజకీయాలు పట్టినట్ల కనిపించని మన సినిమా తారలు అంతా మెల మెల్లగా ఒక్కొక్కరు ఉన్నట్లుండి గుజరాత్ వెళ్లి రావడం ప్రారంభించారు. అక్కడి నుంచి గుజరాత్ అభివృద్ధి భజన ప్రారంభించారు. ఆ పైన అహో.. మోడీ.. ఒహో మోడీ అనడం మొదలయింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద జనాల్లో విముఖత పెరిగిందన్న వైనం, ప్రధాని పదవి కోసం మోడీ చేస్తున్న యత్నాలు బాబు గమనించారు. దాంతో వెంకయ్య నాయుడు స్ట్రాటజీ ప్రకారమో, మరే కులగురువులు వెనుక నుంచి ప్రోత్సహించారో, మొత్తానికి సినిమా జనం మోడీ భజన ప్రారంభించారు.

ఇలాంటి టైమ్ లో విభజన అనివార్యమైంది. ప్రత్యేక హోదా అన్నది రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ఈ కొత్త విషయాన్ని కనిపెట్టిన వెంకయ్యనాయడును హీరోను చేసే ప్రయత్నం మీడియాలో దిగ్విజయంగా జరిగింది. మరోపక్క విభజన దోషంలో కాంగ్రెస్ తో సమాన పాలు వున్న భాజపాను మాత్రం హీరోను చేసింది మన మీడియానే. కాంగ్రెస్ దే పాపం అంతా అన్నట్లు మన మీడియా ఫోకస్ చేసింది. భాజపా చేసిన కాకినాడ తీర్మానాన్ని కానీ, పార్లమెంట్ లో కాంగ్రెస్ తో సమానంగా కుట్ర చేసిన వైనాన్ని కానీ అస్సలు బయటకు రానీయకుండా, ముసుగేసింది మన ఘనత వహించిన మీడియా తప్ప వేరు కాదు.

మరోపక్క విభజన సెంటిమెంట్ ను బలంగా రాజేసింది. ఎన్జీవోల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రోడ్డెక్కేలా చేసింది. ఇంత జరుగుతున్న టైమ్ లో చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్రలు ప్రారంభించారు. మోడీతో పొత్తు కోసం తహతహలాడారు. కావాలంటే లైబ్రరీలకో, ఇంటర్నెట్ లోనో 2014 నాటి పత్రికలు అన్నీ తిరగేయండి. బాబుగారు ఢిల్లీ వెళ్లిన వైనాలు, రాజ్ నాధ్ సింగ్ కు మొక్కిన ఫొటోలు, పదే పదే పొత్తుకోసం తహతహలాడిన కథనాలు కనిపిస్తాయి.

ఇక్కడ ఇంకో సినేరియా కూడా వుంది. 80ల దశకంలో వెంకయ్యనాయుడు ఓసారి చంద్రబాబు మీద విరుచుకు పడిన వైనం కావాలంటే అప్పటి పత్రికలు తిరగేయాలి. బాబు తనకు వెన్నుపోటు పొడిచారని అప్పట్లో వెంకయ్య బాధపడుతున్న వార్తా కథనాలు వచ్చాయి. ఆ తరువాత మళ్లీ ఇద్దరు ఒకటయ్యారు. వాజ్ పేయ్ టైమ్ లో, ఆ తరువాత భాజపా అధికారంలో వున్నంత కాలం బాబు దాన్ని వదలలేదు. ఎప్పుడైతే భాజపా ప్రభ సన్నగిల్లుతోందో, చటుక్కున వదిలేసి, తిట్టడం మొదలు పెట్టారు.

ఆ వ్యవహారం అంతా మరుగున పెట్టి, మళ్లీ 2014లో ఈ వ్యవహారం నడిపారు. వెంకయ్య నాయుడు మధ్యవర్తిత్వం నెరిపారు. భాజపాతో బంధం కుదిరింది. మంత్రి పదవులు తీసుకున్నారు, ఇచ్చారు. మూడున్నరేళ్ల తను అనుకున్నవన్నీ చేయగలిగారు.

మోడీ సహకారం లేకుండా అమరావతి దగ్గర రాజధాని ఫిక్స్ చేయగలరా? ఎందుకంటే శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమరావతికి వ్యతిరేకంగా వుంది.
మోడీ సహకారం లేకుండా అన్ని వేల ఎకరాలు, బలవంతంగా సేకరణ చేయగలరా?
మోడీ సహకారం లేకుండా అన్ని లక్షల కోట్ల అప్పులు తేగలరా?
మోడీ సహకారం లేకుండా పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం గుప్పిటలోకి తీసుకోగలరా?

ఇలా చాలా వ్యవహారాలు నడిచాయి. కానీ ఇక ఇప్పుడు మళ్లీ 2019 దగ్గరకు వచ్చింది. మోడీ ప్రభ సన్నగిల్లుతోందేమో? అన్న అనుమానం వుంది. కానీ మళ్లీ కాంగ్రెస్ అప్పుడే పుంజుకోదన్న భయమూ వుంది. దాంతో మళ్లీ మరోసారి ఏదో చేయాలి.

అందుకే మళ్లీ 2014 సీన్ రిపీట్. ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేసారు. హోదా మీద సెంటిమెంట్ బలంగా వెళ్తోంది.. పని చేస్తోంది అని గమనించారు. అప్పుడు కాంగ్రెస్ ను దోషిగా చూపించి బలి చేసినట్లు, ఇప్పుడు మోడీని బలిచేసే పని స్టార్ట్ చేసారు. అది బాగానే సాగుతోంది. తేదేపా నీడలో, తేదేపా మనుషులతో వున్న రాష్ట్ర భాజపా చేష్టలుడికి, చేవచచ్చి ఊరుకుంది. అందుకే ఇక ఏరుదాటేసారు. ఈ భాజపా తెప్ప అవసరం లేదు. కొత్త తెప్ప కావాలి. భాజపాకు రామ్ రామ్ అన్నారు.

ఒక్కటే ప్రశ్నకు బాబు సమాధానం చెప్పాలని జనం అడగాలి. కాదు. నిలదీయాలి. కాదు… ప్రమాణం చేయమనాలి.

మళ్లీ భవిష్యత్ లో భాజపాతో పొత్తు పెట్టుకోను. భాజపా ప్రభుత్వంలో చేరను. అని బాబు చెప్పగలరా?

అదే విదంగా తనును కేవలం మూడు రోజుల్లొ ఎంత బద్ నామ్ చేయాలో అంతకు అంతా చేస్తున్న బాబు గారి టీమ్ వ్యవహారం చూసిన పవన్, భవిష్యత్ లో బాబుతో చేతులు కలపను, ఆయన ప్రభుత్వంలో తమ పార్టీ చేరదు. అని చెప్పగలరా?

చెప్పమన్నా చెప్పరు. ఎప్పుడు జనాలు ఎటు తిరగాలో, మన ‘సామాజిక’ మీడియానే చెబుతుంది. ఆ విధంగా మన జనాలు లెఫ్ట్ అంటే లెఫ్ట్.. రైట్ అంటే రైట్ తిరుగుతుంటారు.

ఈ రాజకీయం ఇలా నడుస్తూనే వుంటుంది. ఎన్నాళ్లు? ఈ రాష్ట్రంలో మీడియా-తెలుగుదేశం మధ్య సామాజిక బంధాలు పటిష్టంగా వున్నన్నాళ్లు.