cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

వైసిపి లక్ష ఓట్లు ఏమయ్యాయి..!

వైసిపి లక్ష ఓట్లు  ఏమయ్యాయి..!

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలను అధికార వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఐదు లక్షల మెజారిటీ సాధించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. 

వైసిపికి ఆశించినంత మెజారిటీ లభించలేదుగానీ... 2019 కంటే 43,216 ఓట్ల అదనపు మెజారిటీ వచ్చింది. అప్పుడు 2,28,376 ఓట్ల మెజారిటీ రాగా, ఇప్పుడు 2,71,592 ఓట్ల మెజారిటీ దక్కింది. 

పోలింగ్ శాతం తగ్గడం వల్లే మెజారిటీ తగ్గిందని, లేకుంటే ఇంకా పెరిగేదని వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

గతంకంటే మెజారిటీ పెరిగిందని సంతోషించ వచ్చుగానీ...ఆ పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అంశం ఇంకొకటి వుంది.

2019 ఎన్నికల్లో వైసిపికి 7.22 లక్షల ఓట్లు లభిస్తే...ఈ ఎన్నికల్లో 6.26 లక్షల ఓట్లు మాత్రమే దక్కాయి. గత ఎన్నికలతో పోల్చితే దాదాపు లక్ష ఓట్లు తగ్గాయి. 

వాళ్లంతా పోలింగ్ కి వచ్చివుంటే తమకే ఓట్లు వేసేవారని చెప్పుకోవచ్చు. మౌలికమైన ప్రశ్న ఏమంటే...లక్ష మంది వైసిపి అనుకూల ఓటర్లు ఓటింగ్ కు ఎందుకు రాలేదు..! 

ఈ రెండున్నర ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది ప్రభుత్వం. గతం కంటే పార్టీ  జనంలోబవిశ్వాసం పెరిగిందని వైసిపి అధినేత నమ్ముతున్నారు. అటువంటప్పుడు జనం ఆసక్తిగా వచ్చి పోలింగ్ లో ఎందుకు పాల్గొనలేదు! 

అయా నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏలు తగినంత శ్రద్ధ చూపలేదా...ప్రతి ఓటరునూ రప్పించడానికి కసరత్తు చేయలేదా..!

తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 2019లో వైసిపికి 78 వేల ఓట్లు పోలవగా...ఈ ఎన్నికల్లో 79 వేల ఓట్లు పోలయ్యాయి. వెయ్యి మంది ఓట్లర్లను అదనంగా పోలింగ్ కేంద్రాలకు రప్పించగలిగారు. మిగతా అన్ని నియోజకవర్గంలో ఆరు వేల నుంచి 23 వేల వైసిపి ఓటర్లు పోలింగ్ కు రాలేదు. 

పార్టీ అధినేత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో లక్ష మంది వైసిపిని ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఎందుకు రప్పించలేకపోయారు..! 

ప్రతిపక్ష పార్టీకి కూడా ఓట్లు తగ్గాయని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షం పట్ల జనంలో ఉన్న అనాసక్తికి దాన్ని సంకేతంగా చూడవచ్చు. అధికార పార్టీ కూడా అదే సూత్రాన్ని అన్వయించుకోగలదా..! 

గతంలో వైసిపికి ఓటు వేసిన వారు...ఈ ఎన్నికల్లో ఓటింగుకే రాకపోవడం దేనికి సంకేతం!  అయా ఎంఎల్ఏలపైన జనంలో గూడుకట్టుకుంటున్న అసంతృప్తికి, కార్యకర్తల్లో చోటుచేసుకుంటున్న నిర్లిప్తతకు దీన్ని సూచికగా చూడవచ్చునా..! 

ఈ కోణంలో పార్టీ అధిష్టానం ఆత్మావలోకనం చేసుకుంటే...భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది.  ఎంతోకొంత మెజారిటీ పెరిగిందిలే అని సంతృప్తి చెందితే...వచ్చే ఎన్నికల నాటికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.                                                      

ఆదిమూలం శేఖర్

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×