Advertisement

Advertisement


Home > Politics - Political News

స్టెరాయిడ్స్ తో కరోనాకు చెక్.. అయితే ఎవరు వాడాలి?

స్టెరాయిడ్స్ తో కరోనాకు చెక్.. అయితే ఎవరు వాడాలి?

కరోనాను ఎదుర్కొనేందుకు స్టెరాయిడ్స్ అద్భుతంగా పని చేస్తున్నాయనే విషయం గతేడాదే నిరూపితమైంది. తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడిన ఎంతోమంది రోగులు స్టెరాయిడ్స్ తో కోలుకున్నారు. దీంతో సెకెండ్ వేవ్ లో చాలామంది స్టెరాయిడ్స్ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు.

కొంతమంది తమకుతాముగా స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు ఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యులు. అసలు స్టెరాయిడ్స్ ఎలా పనిచేస్తాయి.. ఎలాంటి పేషెంట్లకు ఇవ్వాలనే అంశాల్ని వాళ్లు చెబుతున్నారు.

అసలు స్టెరాయిడ్స్ ఎందుకు వాడతారు?

కార్టికోస్టెరాయిడ్స్ లేదా ‘స్టెరాయిడ్స్’ అంటే మన అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేసే కార్టిసాల్ అనే హార్మోన్‌ను పోలి ఉంటాయి. కరోనా తీవ్రతను తగ్గించడంలో ఇవి ఎంతో శక్తిమంతంగా పనిచేస్తాయి. అయితే  సరైన సూచనలు లేకుండా స్టెరాయిడ్స్  వాడితే ఊపిరితిత్తుల్లాంటి కీలకమైన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

గతేడాది బ్రిటన్ లో రికవరీ ట్రయిల్ లో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో.. వెంటిలేటర్/ఆక్సిజన్ పై ఉన్న కరోనా రోగులపై స్టెరాయిడ్స్ బాగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. అప్పట్నుంచి తీవ్రమైన కరోనా కేసులకు స్టెరాయిడ్ వాడకం సర్వసాధారణమైంది. అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే.. ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేకుండా కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వ్యక్తులకు స్టెరాయిడ్స్ అవసరం లేదు. కాబట్టి పరిస్థితి విషమింగా లేదన్నప్పుడు స్టెరాయిడ్స్ వాడకపోవడమే అత్యుత్తమం.

కరోనా సోకిన మొదటి వారం శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. రెండో వారం ఆ ఇన్ఫెక్షన్ ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ప్రక్రియ మొదలవుతుంది. సరిగ్గా ఇక్కడ స్టెరాయిడ్స్ బాగా పనికొస్తాయి. ఒకవేళ మొదటి వారంలోనే స్టెరాయిడ్స్ వాడినట్టయితే ఇన్ఫెక్షన్ వ్యాప్తిని మరింత పెంచినట్టవుతుంది. లేదా మరో ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.

హోం ఐసొలేషన్ లో స్టెరాయిడ్స్ వాడొచ్చా?

తేలికపాటి లక్షణాలతో ఇంట్లో ఐసొలేషన్ లో ఉంటూ, ఆక్సిజన్ 94శాతానికి పైగా కలిగి ఉండి, న్యూమోనియో లక్షణాలు లేని వాళ్లు స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు. వైరస్ సోకిన తర్వాత 7 రోజుల వరకు జ్వరం, దగ్గు తగ్గకపోతే.. వైద్యుల పర్యవేక్షణ/సూచన మేరకు 3-5 రోజులు స్టెరాయిడ్స్ కోర్స్ వాడొచ్చు. 5 రోజులైనప్పటికీ జ్వరం/దగ్గు తగ్గకపోతే నోటితో పీల్చే బుడెసోనైడ్ లాంటి స్టెరాయిడ్స్ వాడొచ్చు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. స్వల్ప/మధ్యస్త లక్షణాలున్న కరోనా రోగులు, లక్షణాలు బయటపడిన వెంటనే, రోజుకు 2 సార్లు చొప్పున బుడెసోనైడ్ ను 14 రోజుల పాటు పీల్చడం వల్ల 91శాతం రిస్క్ ను తగ్గించుకున్నారు.

గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ఇవి సరైనవేనా?

బీటామెథాసోన్ మరియు డెక్సామెథాసోన్ వంటి స్టెరాయిడ్లు గర్భిణీ లకు ప్రసవానికి ముందు ఇస్తారు. అదనంగా ఆక్సిజన్ అవసరమయ్యే గర్భిణిలకు కూడా డెక్సామెథాసోన్ లాంటి స్టెరాయిడ్స్ సిఫార్స్ చేస్తారు. 

అయితే కరోనాతో బాధపడుతున్న పిల్లల్లో స్టెరాయిడ్స్ వాడకానికి సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనం జరగలేదు. చిన్నారులకు స్టెరాయిడ్స్ ఇచ్చే అంశాన్ని వైద్యులు.. కేసుకు తగ్గట్టు విడివిడిగా చూడడం మంచిది.

స్టెరాయిడ్స్ తో సైడ్ ఎఫెక్ట్స్

తక్కువ రోజులు, ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ట్రీట్ మెంట్ ఇవ్వడం వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్టులు ఉండవు. అయినప్పటికీ కొందరిలో షుగర్, బీపీ పెరుగుతాయి. నిద్రలేమి, మానసిక సమస్యలు, ఆకలి పెరగడం, బరువు పెరగడం, ఇన్ఫెక్షన్స్ సోకడం వంటి తాత్కాలిక ప్రభావాలకు గురికావొచ్చు. రెండు వారాల కంటే ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల గ్లాకోమా, కంటి శుక్లాలు, బీపీ, గందరగోళం, చికాకు, బరువు పెరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడుతున్న షుగర్ పేషెంట్లకు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల వాళ్లలో చక్కెర స్థాయి మరింత పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి రోగులకు ఎప్పటికప్పుడు షుగర్ స్థాయిలు చెక్ చేస్తూ ఉండాలి. అయినప్పటికీ అతిగా దాహం వేయడం, వికారం, కడుపులో నొప్పి, విపరీతమైన అలసట, శ్వాసలో ఇబ్బంది లాంటివి తలెత్తితే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. 

బ్లాక్ ఫంగస్ కు స్టెరాయిడ్స్ కు లింక్ ఉందా?

అధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడడంతో పాటు.. యాంటీబయాటిక్ మందులతో కలిపి స్టెరాయిడ్స్ వాడితే వాటి దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. ప్రాణంతాక ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనేది చాలా అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇది ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా నలుగుతోంది. ఇది కరోనా చికిత్స లో భాగంగా అధిక స్టెరాయిడ్ వాడకంతో ముడిపడి ఉంది.

ఊపిరితిత్తుల సమస్యలు, హెచ్ఐవీ ఉన్నవాళ్లకు ఇది ప్రాణాంతకం కావొచ్చు. కఫంలో రక్తం రావడం, కళ్ల చుట్టూ నొప్పి, వాపు ఉండడం, తీవ్రమైన తలనొప్పి, చూపు కోల్పోవడం, చర్మం ఎరుపు లేదా నీలం రంగులోకి మారడం బ్లాక్ ఫంగస్ లక్షణాల్లో ప్రధానమైనవి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?