Advertisement

Advertisement


Home > Politics - Political News

లోకేష్ ప్రకటించారు.. మరి పవన్ ప్రకటన ఎప్పుడు?

లోకేష్ ప్రకటించారు.. మరి పవన్ ప్రకటన ఎప్పుడు?

నారా లోకేష్, పవన్ కల్యాణ్. ఈ ఇద్దరూ నేతలూ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఏకంగా మంత్రి పదవి వెలగబెట్టి, ముఖ్యమంత్రి కొడుకు హోదాలో, ఎన్టీఆర్ మనవడు అనే వారసత్వ బలంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి బొక్కబోర్లా పడ్డారు లోకేష్. ఇక జనసేన పార్టీ అధినేత హోదాలో ఏకంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి మరీ చేదు అనుభవం చవిచూశారు పవన్ కల్యాణ్.

వాస్తవానికి అసలు సిసలు పొలిటీషియన్లెవరైనా పరాభావ భారంతో కుంగిపోరు. పోగొట్టుకున్నచోటే తిరిగి విజయాన్ని వెదుక్కుంటారు. ఆయా నియోజకవర్గాలపై ఫోకస్ పెడతారు. కానీ పవన్, లోకేష్ ఇద్దరూ తాము పోటీ చేసిన నియోజకవర్గాలను లైట్ తీసుకున్నారు. ఐదేళ్ల తర్వాత కదా ఎన్నికలు అనుకుంటూ అస్సలు ఆ వైపే చూడలేదు. దీంతో సహజంగానే.. ఆయా ప్రాంతాల్లో ఇద్దరు నేతల్నీ జనాలు కూడా లైట్ తీసుకున్నారు.

ఈమధ్య కాలంలో లోకేష్ చాలా చోట్ల ట్రై చేశారు. తన మనుషులతో సర్వేలు చేయించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ పుంజుకోలేదనే చేదు విషయం గ్రహించారు. అయితే తాను పోటీ చేసిన మంగళగిరిలో వైసీపీ మైలేజీ తగ్గిందనే సర్వే రిపోర్ట్ అతని చేతికందింది. 

దానికితోడు స్థానికి ఎమ్మెల్యే ఆళ్ల, ఈసారి పోటీకి దిగరనే టాక్ కూడా ఉంది. అందులోనూ టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే స్థానిక పౌరుషాన్ని రెచ్చగొట్టేందుకు ఆయన ఈ ప్రకటన చేశారు. ఎట్టకేలకు తాను మళ్లీ పాత నియోజకవర్గానికే ఫిక్స్ అయ్యానని తేల్చి చెప్పారు.

మరి పవన్ సంగతి ఏంటి..?

లోకేష్ పోయిన చోటే వెదుక్కోవాలనే నిర్ణయానికి వచ్చారు. మంగళగిరి బరిలో దిగుతానన్నారు. మరి పవన్ సంగతి ఏంటి..? ఆయన కూడా అదే పని చేస్తారా..? గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లో ఏదో ఒకటి ఫిక్స్ అవుతారా..? గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ ఇకపై ఒకటే నియోజకవర్గంలో పోటీకి దిగాలని అనుకుంటున్నారు. 

ఒక్కచోటే ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారు. మరి అది గాజువాకా, భీమవరమా అనేది తేలాల్సి ఉంది. లేకపోతే పవన్ కొత్తగా మరో నియోజకవర్గం వెదుక్కుంటారా అనేది కూడా తేలాల్సి ఉంది.

ఇన్నాళ్లూ పవన్ నియోజకవర్గం లేకుండానే రాజకీయం చేశారు. తనని ఓడించారు, ఓడించారు అని పదే పదే జనసైనికుల్ని దెప్పి పొడిచే పవన్ ఆ రెండు నియోజకవర్గాల్ని అస్సలు పట్టించుకోలేదు. ఈసారి ఆయన సీమకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ లెక్క తీసుకుంటే మాత్రం కచ్చితంగా కృష్ణా, గోదావరి జిల్లాలకే ఫిక్స్ అవ్వాల్సిన పరిస్థితి.

లోకేష్ పక్కా స్కెచ్ తో మంగళగిరిలో సెటిలవుతున్నారు. మరి పవన్ కల్యాణ్ కూడా నిర్ణయం తీసుకోడానికి ఇదే సరైన సమయం అని అంటున్నారు జనసైనికులు. ఆయన మనసులో ఏముందో తేలాల్సి ఉంది. ఇప్పటినుంచే నియోజకవర్గం ప్రకటిస్తే.. ఎన్నికలనాటికి అక్కడ కాస్తో కూస్తో పాతుకుపోవడానికి ప్రయత్నించొచ్చు. 

జనసైనికుల్లో కూడా పవన్ తరపున ప్రచారం చేయడానికి జోష్ ఉంటుంది. ముఖ్యంగా చోటామోటా నేతలు పవన్ కంట్లో పడటానికి బాగా కష్టపడతారు. ఇవన్నీ ఆలోచించుకుంటే పవన్ కూడా త్వరలో సర్వే చేయించుకుని ఓ నియోజకవర్గాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?