cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

స్పందన ఎందుకు కరువైపోతోంది?

స్పందన ఎందుకు కరువైపోతోంది?

మనుషుల్లో ముఖ్యంగా తెలుగువారిలో స్పందించే గుణం కరువైందా ? అనిపిస్తోంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, కళ్ళ ముందే దారుణం జరుగుతున్నప్పుడు జనం స్పందించడం మానేశారు. ఎందుకో గుండెల్లో తడి ఇంకిపోతోంది. సామాన్య జనమే కాదు, మనం సెలబ్రిటీలుగా భావించుకునే, అభిమానించే వారు సైతం ప్రజా సమస్యలపై స్పందించడంలేదు.

ప్రజాసమస్యలపై స్పందించని లక్షణం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లోనే కనబడుతోంది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఈ దుస్థితి  లేదు. అక్కడ ఏదైనా ప్రజా సమస్య తలెత్తితే లేదా ఏదైనా దారుణం జరిగితే కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఏకమై ఆందోళన చేస్తారు, పోరాడతారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అందుకు భిన్నం. 

స్పందించే గుణం కరువై పోయిందని చెప్పడానికి రెండు ఉదాహరణలు చెప్పుకుందాం. ఇవి రెండు వేరువేరు సమస్యలు. ఒకటి దారుణ, పైశాచిక ఘటన. రెండోది ప్రజా సమస్య. ఈమధ్య  తెలంగాణలోని పెద్దపల్లి న్యాయవాద దంపతుల హత్య జరిగిన సంగతి తెలుసు కదా. ఈ జంట హత్యలు పట్టపగలు నడి రోడ్డు మీద జరిగాయి. 

హంతకులు న్యాయవాది వామన్ రావును కారు  నుంచి లాగి రోడ్డు మీదికి ఈడ్చుకెళ్లి పెద్ద కత్తులతో నరికారు. ఆయన భార్యను కారులోనే హతమార్చారు. జనం చూస్తుండగా ఈ హత్యలు జరిగాయి. ఈ దారుణ ఘటన జరిగినప్పుడు రోడ్డు మీద రెండు బస్సులు ఆగి ఉన్నాయి. మరికొన్ని వాహనాలూ ఉన్నాయి. కానీ ఆ బస్సుల్లోని జనం బయటకు రాలేదు.

దుండగులు ఎప్పుడైతే వామన్ రావును లాగి రోడ్డుమీదకు పడేశారో అప్పుడే జనం బస్సులు దిగి ఒక్కసారిగా దుండగులను చుట్టుముట్టివుంటే ఈ హత్యలు జరిగేవా? పోనీ గాయాలతోనైనా బయట పడేవారు కదా. పైగా సెల్ ఫోన్లతో వీడియోలు, ఫోటోలు తీశారట. 

అసలు దుండగులు పట్టపగలు నడి రోడ్డు మీదనే ఈ దారుణానికి తెగబడటం నిజంగా సాహసమే. జనం అడ్డుకోకపోవడం దానికి మద్దతు ఇచ్చినట్లుగా ఉంది. నడి రోడ్డు మీదనే అత్యాచారాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ తలనొప్పులు మనకెందుకులే అనుకుంటున్నారు. 

ఇక స్పందన లేని పెద్ద సమస్య విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ. దీనిపై ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు, కొన్ని రాజకీయపార్టీలు ఆందోళన మొదలు పెట్టాయి. నిజానికి ఉక్కు కర్మాగారం సమస్య ఆంధ్రాకు సంబంధించిందో, విశాఖకు సంబంధించిందో కాదు. రెండు తెలుగు రాష్టాలకు సంబంధించింది. 

ఓవరాల్ గా తెలుగు ప్రజలకు సంబంధించింది. ఇప్పుడో ప్రశ్న ఎదురవుతోంది. హైదరాబాదులో స్థిరపడిన తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు, సెలబ్రిటీలు, ఇతర రంగాల్లో కీలకమైన వారు విశాఖ ఉక్కుపై ఎందుకు స్పందించడంలేదు ? ఎందుకు నిరసన వ్యక్తం చేయడంలేదు ? ఆ ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వడంలేదు ? కొందరు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు.

చాలామంది సినిమా వాళ్లకు విశాఖ అంటే చాలా ఇష్టం. ఎన్నో పాపులర్ సినిమాలు, సూపర్ డూపర్ హిట్ సినిమాలు విశాఖలో షూటింగ్ జరుపుకున్నాయి. అందమైన లొకేషన్ లకు విశాఖనే చెప్పుకుంటారు. విశాఖతో అనుబంధం ఉన్న తారలు గాని, పరిశ్రమకు చెందిన ముఖ్యులుగాని విశాఖ ఉక్కు గురించి ఒక్క మాటా  మాట్లాడటంలేదు. 

వీరు నిరసన తెలియచేయగానే దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపేస్తారని కాదు. కానీ అదో నైతిక బాధ్యత. సినిమా పరిశ్రమలో ఉన్న అత్యధికమంది ఆంధ్రావారే. వారు హైదరాబాదులో ష్ఠిరపడినా మూలాలు ఏపీలోనే ఉన్నాయి. 

ఇదంతా కాకపోయినా సినిమావారిని ప్రజలు పెంచి పోషిస్తున్నప్పుడు ప్రజా సమస్యలపై వారు స్పందించాల్సిన అవసరం అంతో ఇంతో ఉంది. విశాఖ ఉక్కు అనే కాదు ప్రజా సమస్యలపై సాధారణంగా సినీ పరిశ్రమ నుంచి స్పందన ఉండదు. తెలంగాణలో కేసీఆర్ కు, ఆంధ్రాలో జగన్ కు వారు భయపడతారనే విమర్శలు ఉన్నాయి. తమ వ్యాపారాలను తొక్కేస్తారని వణికి పోతుంటారు. 

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ?

సాప్ట్ వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమాల్లో న‌టించా

 


×