Advertisement

Advertisement


Home > Politics - Political News

కేసీఆర్ వెనక్కి తగ్గడానికి కారణం ఇదేనా?

కేసీఆర్ వెనక్కి తగ్గడానికి కారణం ఇదేనా?

కేసీఆర్ ప్లేస్ లో కేటీఆర్. వినడానికి సౌండింగ్ బాగానే ఉంది, రెండు నెలలుగా దీనిపై జోరుగా ప్రచారం కూడా జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కేటీఆర్ జపం చేశారు. ఎక్కడ వెనకపడిపోతామో అని, ముందుగానే స్తోత్రాలు మొదలుపెట్టారు. రేపో మాపో కేటీఆర్ కి పట్టాభిషేకం అనుకుంటున్న టైమ్ లో కేసీఆర్ అందరి గాలి తీసేశారు. 

మరోసారి ఇలాంటి డైలాగులు కొడితే చర్యలు తప్పవంటూ ఘాటుగా హెచ్చరించారు. మరి ఇన్నాళ్లూ కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇప్పుడే ఎందుకు ఆఘమేఘాల మీద సీరియస్ అయ్యారు?

పోనీ కేసీఆర్ కి అసలు విషయం తెలియదు అనుకుందాం, కేటీఆర్ ముందు కేటీఆర్ నే సీఎం అంటూ సాక్షాత్తూ మంత్రులు, ఎమ్మెల్యేలే మాట్లాడుతుంటే ఆయన కూడా సైలెంట్ గా నవ్వుకున్నారు కానీ వారించలేదు. అంటే దాని అర్థం రేపో మాపో తానే సీఎం అని కేటీఆర్ కూడా పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చినట్టే కదా? అందుకే కార్యకర్తలతో సహా అందరూ కేటీఆర్ కి జై కొట్టారు, ఇప్పుడు కేసీఆర్ వాత పెడతానంటూ వార్నింగ్ ఇచ్చేసరికి అంతా షాకయ్యారు.

అసలేం జరిగింది..?

కేటీఆర్ సీఎం అనగానే టీఆర్ఎస్ లో అందరూ సంబరపడ్డారు. యువ నాయకుడు వస్తున్నాడు, పార్టీని మరో లెవల్ కి తీసుకెళ్తారని అనుకున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని తమకి అనుకూలంగా మార్చుకున్నాయి. కేసీఆర్ పని అయిపోయిందని, ఆయన ఆరోగ్యం బాగా లేదని ప్రచారం మొదలు పెట్టాయి. 

పనిలో పనిగా కుటుంబ పాలనపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. కేటీఆర్ సీఎం అయితే కవితకు మంచి పోర్ట్ ఫోలియో ఇస్తారని, కేసీఆర్ కేంద్ర రాజకీయాలు చూసుకుంటారని.. మొత్తం పార్టీ కుటుంబం చేతిలోకే పోతుందని విమర్శించారు. వారసత్వ రాజకీయాలతో కేసీఆర్ స్వభావం తేలిపోయిందని కూడా విమర్శించారు. దీంతో ఆయన వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీనికితోడు రాజకీయంగా టీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడేం బాగాలేదు. ఒక ఓటమి చవిచూడ్డంతో పాటు.. గ్రేటర్ ఎన్నికల సాక్షిగా మరో అవమానాన్ని కూడా రుచి చూసింది. త్వరలోనే సాగర్ ఎన్నిక కూడా తరుముకొస్తోంది. 

ఇలాంటి టైమ్ లో 'నాయకత్వ మార్పు' అనే ప్రయోగం చేసి తన చాప కిందకు తానే నీళ్లు తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో కేసీఆర్ ఇలా వెనక్కి తగ్గారు. ఇంకా చెప్పాలంటే.. కాబోయే సీఎం  కేటీఆర్ అంటూ ఫీలర్లు వదిలింది తానే. ఇప్పుడు ఆ ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గింది కూడా తానే.

ఇప్పటివరకూ జరిగింది చాలు..

వాస్తవానికి పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ అంత ఇదిగా చీవాట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ, ఆయన ఉగ్రరూపం మరోసారి బయటపెట్టారు. అప్పటివరకూ తన పని అయిపోయిందని ప్రచారం చేసిన వాళ్లకి, అసలు కేసీఆర్ ఎలా ఉంటారనే విషయాన్ని మరోసారి చూపించారు. 

సొంతంగా పార్టీ నేతలపైనే ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్. మొత్తమ్మీద కేటీఆర్ సీఎం అనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టే లెక్క. ఇక భవిష్యత్ సీఎం అని కూడా కేటీఆర్ ని ఎవరూ ప్రస్తుతించడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే, మరో పదేళ్లు తానే సీఎం అని కేసీఆర్ స్వయంగా ప్రకటించుకున్నారాయె.

మరి కేటీఆర్ సంగతేంటి..?

రేపోమాపో కిరీటం నెత్తి మీదకి వస్తుంది అనుకుంటున్న టైమ్ లో తండ్రి ఇలా అనేయడంతో పార్టీ నాయకులతో పాటు, కేటీఆర్ కూడా షాక్ కి గురైన మాట వాస్తవం. అయితే ఇదే విషయంపై అంతర్గతంగా చర్చించి మరీ కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 

మరో పదేళ్లు తానే సీఎం అని ప్రకటించుకున్నారు. ఇప్పటికిప్పుడు అర్జంట్ గా ముఖ్యమంత్రి కాకపోయినా, తండ్రి తర్వాత ఆ స్థానం ఎటూ తనదేననే ధీమాతో ఉన్న కేటీఆర్ ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు.

సీఎం జగన్ లేఖ వల్ల ఉపయోగం లేదు

చిత్తూరు జిల్లాలో టీడీపీ క‌థ ముగిసినట్లేనా !

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?