Advertisement

Advertisement


Home > Politics - Political News

బద్వేల్ ఫలితం వైసీపీ మైండ్ సెట్ మారుస్తుందా..?

బద్వేల్ ఫలితం వైసీపీ మైండ్ సెట్ మారుస్తుందా..?

బద్వేల్ ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీ ఆశిస్తోంది వైసీపీ. టీడీపీ పోటీలో లేదు కాబట్టి అదేమంత కష్టం కాదు. తిరుపతిలో బీజేపీ పవరేంటో తెలిసింది కాబట్టి లక్ష్యం మరీ భారమేమీ కాదు. కానీ ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ కుమ్మక్కయ్యాయనేది ప్రధాన ఆరోపణ. పైకి ఎవరూ ఎవరికీ మద్దతిస్తున్నట్టు ప్రకటనలు రాలేదు. కానీ లోలోపల కలసి పనిచేస్తున్నారని టాక్. దీని ఫలితం ఏంటో బద్వేల్ ఎన్నికలతో తేలిపోతుంది. 

జగన్ పాలనకు ఇది రెఫరెండం కూడా.. గెలుపు ఒక్కటే కాదు, మెజార్టీ కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఏమాత్రం మెజార్టీ తేడాకొట్టినా. తిరుపతిలో లాగా కరోనా పై నింద నెట్టేయకుండా తప్పొప్పులు సరిదిద్దుకుంటే మంచిది.

జగన్ రాలేదు, లేఖతో సరిపెట్టారు..

బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వస్తారని ఆశించారంతా. కానీ ఆయన రాకుండా కేవలం లేఖలు రాసి సరిపెట్టారు. జగన్ బద్వేల్ లో అడుగుపెడితే ఆ సందడి వేరేగా ఉండేది. కానీ ఆయన ఎందుకో ఇష్టపడలేదు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ చేసిన అతిని తాను చేయకూడదని అనుకున్నారనేది అంతర్గత సమాచారం. 

ఉప ఎన్నికలకు యంత్రాంగాన్నంతా మోహరించాల్సిన పనిలేదు, అంత అవసరం కూడా లేదన్నది జగన్ వాదన. వైసీపీ విజయానికి వంక పెట్టేవారు లేరు కాబట్టి విజయం తథ్యమే అయినా.. మెజార్టీ విషయంలో ఈ పరిణామాలు ఎలాంటి లెక్కల్ని మనముందు పెడతాయో చూడాలి.

జగన్ పరిపాలనకు రెఫరెండం అనుకోవాలా..?

జగన్ పాలనకు రెఫరెండంగా బద్వేల్ ఉప ఎన్నికలను భావించాలా..? లేదా అనేది వైసీపీ ఇష్టం. అదే నిజమైతే ఉప ఎన్నికల్లో వచ్చే మార్కులతో కచ్చితంగా పాలనలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఉప ఎన్నికలు మొదలయ్యే నాటికి, ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. సీఎంపై టీడీపీ నేతలు నోరు జారారు.. ఆ పార్టీ ఆఫీస్ లపై దాడులు జరిగాయి.. తాజాగా కొన్ని చోట్ల ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

వీటన్నిటి ప్రభావం బద్వేల్ ఉప ఎన్నికలపై ఉంటుందని చెప్పలేం కానీ.. ప్రభుత్వం చేసిన చిన్న చిన్న తప్పుల్ని బీజేపీ ఎలివేట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ పార్టీ ప్రచారాన్ని జనం ఎంతవరకు నమ్ముతారనేదే ఇప్పుడు అసలు విషయం. బరిలో ఉన్నది బీజేపీయే అయినా ఆ పార్టీ బలం పెరిగితే మాత్రం వైసీపీ జాగ్రత్తపడాల్సిందే. 

ఇప్పటి వరకూ తగ్గేదే లేదంటూ ముందుకెళ్లిన, జగన్ అండ్ టీమ్.. బద్వేల్ ఫలితాలను చూసి ఆ దూకుడు కొనసాగించాలా, లేక పాలనలో మార్పులు చేసుకోవాలా అని ఆలోచించాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?