Advertisement

Advertisement


Home > Politics - Political News

బీజేపీతో 'కల్యాణం' ఓకే.. కాపురం సంగతేంటి?

బీజేపీతో 'కల్యాణం' ఓకే.. కాపురం సంగతేంటి?

బీజేపీతో జనసేన "కల్యాణం" జరిగి రోజులు గడిచింది. అయితే కాపురం ఇంకా మొదలు కాలేదు. బీజేపీతో జనసేన కాపురం ఎలా ఉంటుందా అని అందరిలో అనుమానాలున్నాయి. పై స్థాయిలో నేతలు లేని సంతోషాన్ని మొహంపై పులుముకుని మీడియా ముందుకొచ్చినా, కిందిస్థాయిలో కార్యకర్తలు కలవడం అంత తేలిక కాదు. అందులోనూ ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ అప్పటివరకూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసిన కార్యకర్తలు ఒక్కసారిగా వారితోనే రాసుకుపూసుకు తిరగాలంటే మొహమాటం అడ్డొస్తుంది. 

అయితే క్షేత్ర స్థాయిలో బీజేపీ, జనసేన కాపురం సజావుగా సాగుతుందా లేదా అనే విషయం లాంగ్ మార్చ్ లో తేలిపోనుంది. ఫిబ్రవరి 2న రెండు పార్టీలు కలిసి లాంగ్ మార్చ్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు జనసేన జెండాలతో పాటు, బీజేపీ జెండాలు కూడా కలసి ఎగరాల్సిన పరిస్థితి. పవన్ ఒక్కడే జుట్టు సరిచేసుకుంటూ, గాల్లో చేతులు ఊపుతూ, గాల్లోనే పిడికిలి బిగిస్తూ, సినిమా స్టిల్స్ ఇవ్వడానికి వీలు లేదు. ఓవైపు కన్నా, మరోవైపు మరో గన్నారావు ఉంటారు. 

వాళ్ల బ్యాచ్ ఎక్కువ దిగితే.. ఇటు పవన్ బ్యాచ్ కూడా వారిని బ్యాలెన్స్ చేస్తూ తెరపైకి రావాల్సి ఉంటుంది. సో.. ఇది కప్పల తక్కెడలా మారిపోతుందన్నమాట. బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నా.. జనసేన పార్టీవారిలో మాత్రం ఆ హుషారు తగ్గిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్లూ ఎవరెన్ని అనుకున్నా.. మా నాయకుడు పవన్ కోసం జెండాలు భుజాన మోస్తున్నామని చెప్పుకునే వీరంతా.. ఇప్పుడు కమలదళానికి కూడా జిందాబాద్ కొట్టాల్సిన పరిస్థితి. 

సభలో కొంతమంది మాత్రమే జై జనసేన అంటే, మరికొంతమంది జై బీజేపీ అనడానికి వీల్లేదు. అంతా కలిసి ముక్తకంఠంతో అరవాల్సిందే. రెండు జెండాలు మోయాల్సిందే. మరీ ముఖ్యంగా జనసేన సభల్లో కనిపించే జాతీయజెండాల స్థానంలో ఈసారి కాషాయ జెండాలు కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే బీజేపీ "మార్కు" అదే కదా. ఈ మేరకు జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు ఎలా అడ్జస్ట్ అవుతారనే విషయం ఈ లాంగ్ మార్చ్ లో తేలిపోతుంది. 

అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట పవన్. బీజేపీ, జనసేన అవినాభావ సంబంధాన్ని తెలిపేలా ఈ రోడ్ షో ఉండాలని పార్టీ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారట. దీని కోసం ప్రత్యేకంగా ఓ సమావేశం కూడా పెట్టబోతున్నారు. మొత్తమ్మీద ఫిబ్రవరి-2న జరిగే లాంగ్ మార్చ్.. కొన్ని అనుమానాలను పటాపంచలు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో పూర్తిస్థాయిలో కాషాయం పులుముకున్న పవన్ ను కూడా పరిచయం చేయబోతోంది.

ఎమ్మెల్సీలు తప్పు సరిదిద్దుకోవాలి

వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?