Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ ప్రయోగం ఈసారైనా ఫలిస్తుందా..?

జగన్ ప్రయోగం ఈసారైనా ఫలిస్తుందా..?

అధికారంలోకి వచ్చాక దాదాపుగా అన్ని వ్యవస్థల్ని చక్కదిద్దారు సీఎం జగన్. కొత్తగా తీసుకొచ్చిన వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో దేశం దృష్టిని ఆకర్షించారు. అయితే మొదటినుంచీ ఆయనకి, ఆయన ప్రభుత్వానికి కొరకరానికొయ్యలా మారిపోయింది ఇసుక పంపిణీ విధానం. 

ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకోవడం, ఇంటి వద్ద ఇసుక డోర్ డెలివరీ చేయించుకోవడం అనే కాన్సెప్ట్ అదిరిపోయింది కానీ.. అమల్లోకి వచ్చేసరికి వినియోగదారుల కొంప మునిగింది.

ఇసుక రేట్లు అమాంతం పెరిగిపోయాయి, ప్రతిపక్షాల రాద్ధాంతాలు ఎక్కువయ్యాయి. దీంతో గడచిన 21 నెలలుగా ఇసుక విధానంలో వైసీపీ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతూనే ఉంది. పూర్తి ఉచితంగా ఇచ్చినా కూడా ఫలితం ఉండదని టీడీపీ హయాంలోనే తేలిపోయింది కాబట్టి.. ఇప్పుడు కొత్తగా మూడో సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించింది.

ఢిల్లీకి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే సంస్థ ఏపీలో ఇసుక తవ్వకాలు, నిల్వ, అమ్మాకాల కోసం జరిగిన టెండర్లలో విజేతగా నిలిచింది. దీనికి సంబంధించి టెండర్ల ద్వారా సర్కారుకి రూ.765కోట్ల రూపాయలు లభించాయి. గడచిన రెండేళ్లలో ఇసుక అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం కంటే ఇది చాలా ఎక్కువ.

అంటే ప్రభుత్వం ఇక్కడ సేఫ్. మరి వినియోగదారుల సంగతేంటి..? ఇసుక రేట్లు పెరుగుతాయా? మరీ మోయలేని భారం వేస్తే ప్రజల్లో అసహనం పెరుగుతుందా? రాబోయే రోజుల్లో ఇదే తేలాల్సి ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే రేటు.. ఇసుక టెండర్లు ఖరారు చేయడంతో పాటు.. ఆ సంస్థకు కొన్ని కండిషన్లు కూడా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రమంతా ఇసుక రేటు ఒకే రకంగా ఉండాలని సూచించింది. ఇకపై ఇసుక రీచ్ లు, స్టాక్ పాయింట్లు వేర్వేరుగా ఉండవు. 

రీచ్ లలోనే స్టాక్ యార్డ్ లు, అక్కడినుంచే ఇసుక తరలింపు ఉంటుంది. నేరుగా ర్యాంపుల వద్దకు వచ్చి ఇసుక నాణ్యత పరిశీలించి వినియోగదారులు ఇసుక కొనుగోలు చేస్తారు. అక్కడ ఉన్న వాహనంలో అయినా, తాము వెంట తెచ్చుకున్న వాహనంలో అయినా ఇసుక తీసుకుని వెళ్లొచ్చు.

ఆన్ లైన్ దరఖాస్తులు అవసరం లేదు, ఎవరి సిఫార్సులు పనిచేయవు, ఇలా తీసుకెళ్లిన ఇసుకను ఎక్కువ రేటుకి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతివ్వకుండా ఓపెన్ రీచ్ లలో మాత్రమే తవ్వకాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నిబంధనలన్నీ బాగానే ఉన్నాయి కానీ, అమలులో ఇవి ఎంత వరకు నిలబడతాయో చూడాలి. స్థానికంగా నాయకులకు ఇసుక రీచ్ లే ఆర్థిక భరోసా. ఇన్నాళ్లూ ప్రభుత్వ నిర్వహణలో వాటిపై పరోక్షంగా నాయకుల పెత్తనం కనిపించింది. 

ఇప్పుడిక మూడో సంస్థకు అప్పగించారు కాబట్టి.. రాజకీయ జోక్యం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అదే జరిగితే.. ఏపీలో ఇసుక రేట్లు తగ్గిపోతాయి. జగన్ ప్రభుత్వంపై పడ్డ చిన్న మరక తొలగిపోతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?