cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ కలలు నెరవేరుతాయా ?   

జగన్ కలలు నెరవేరుతాయా ?   

ఏ ముఖ్యమంత్రైనా అధికార పీఠం ఎక్కేముందు ఏవేవో పనులు చేయాలని అనుకుంటాడు. కలలు కంటాడు. ప్రజల కోసం ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి అనుకుంటాడు. ముఖ్యమంత్రి అనుకునేవాటిలో కొన్ని పనులు ప్రజల కోసం చేయాలనుకుంటే కొన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం చేయాలనుకుంటాడు. కొన్ని పనులు ప్రతిపక్షాలను దెబ్బ కొట్టడానికి చేయాలనుకుంటాడు. కొన్ని పనులు తన రాజకీయ కక్ష తీర్చుకోవడానికి చేయాలనుకుంటాడు. అనుకున్న పనుల్లో కొన్ని నెరవేరతాయి. కొన్ని పదవీకాలం ముగిసినా నెరవేరకపోవచ్చు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. వాటిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవడంలేదు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి అప్పులు చేసైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు మెచ్చుకోవాలి మాట తప్పను ...మడమ తిప్పను అనేది ఆయన నినాదం కదా. సంక్షేమ పథకాలు అనేవి ప్రజల మేలు కోసం చేస్తున్నవి. ప్రజలకు ప్రత్యక్ష సంబంధం లేని కొన్ని పనులు ఆయన చేయాలనుకున్నాడు.

ఇవి మాత్రం ఆయన సీఎం కుర్చీ ఎక్కేముందు అనుకున్నవి కాదు. ఎన్నికల ప్రణాళికలో లేవు. అప్పటికప్పుడు ఆవేశంతోనో, అహంకారంతోనో చేయాలనుకున్న పనులు. ఆ పనులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాలనుకున్నారు. కానీ ఆ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు.

వాటిల్లో ప్రధానంగా మూడు పనులున్నాయి. మొదటిది మూడు రాజధానులు, రెండోది శాసన మండలి రద్దు, మూడోది కొత్త జిల్లాల ఏర్పాటు. ఈ పనులు కచ్చితంగా అయితీరుతాయని చెప్పలేం. కావు అని కూడా చెప్పలేం. కావొచ్చు కాకపోవచ్చు. ప్రభుత్వ పదవీకాలం మూడేళ్లు ఉన్నా, రెండేళ్ళుగానే లెక్క వేసుకోవాలి. 

ఈ పనులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవలసింది కేంద్ర ప్రభుత్వం, కోర్టులు, ఎన్నికల కమిషన్. ఈ నిర్ణయాలు ఎప్పుడొస్తాయో చెప్పలేం. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని పూర్తిగా సమర్ధించారు. ఆయన విజయానికి ఇదో కారణం. 

ప్రభుత్వ అంచనా ప్రకారం  మే 16న విశాఖలో పాలన రాజధాని ఏర్పాటు కావలసి ఉంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టింది. అయితే.. కోర్టులో కేసులు ఉన్నప్పటికీ.. ముందుకు సాగినా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఇది ఇప్పట్లో ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. అదే సమయంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో  మొండిగా ముందుకు సాగితే.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక ఏపీలో కూడా జిల్లాల సంఖ్య పెంచాలని జగన్ అనుకున్నారు. ఎన్నికల సమయంలోనూ జిల్లాలు పెంచుతామని చెప్పారనుకోండి. అప్పుడున్న ఆలోచన ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనుకున్నారు. సహజంగానే మా ప్రాంతాన్ని జిల్లా చేయాలంటే, మా ప్రాంతాన్ని జిల్లా చేయాలని డిమాండ్లు వచ్చాయి. తెలంగాణలోనూ ఇలాగే డిమాండ్లు వచ్చి జిల్లాలు విరీతంగా పెరిగిపోయాయి. ఏపీలో  ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించినా.. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. 

మరో రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఏర్పాటు చేసే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని భావించారు.  కానీ, ఇప్పుడు మరోసారి ఆ పరిస్థితి లేకుండా పోతోంది. కరోనా నేపథ్యంలో కేంద్రం జనాభా లెక్కల సమయాన్ని వచ్చే ఏడాదికి పొడిగిస్తూ.. తాజాగా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీలో జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో లేనట్టేనంటున్నారు.

ఇక శాసన మండలి వ్యవహారం కూడా ఇప్పట్లో తేలేలా కనబడటం లేదు. అప్పట్లో మండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ మూడు రాజధానులను వ్యతిరేకించిందని తీవ్రంగా కోపగించుకున్న జగన్ మండలి కారణంగా అనుకున్న పనులు చేయలేమనే ఉద్దేశంతో దాని రద్దు చేస్తూ తీర్మానం చేయించారు.

దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అది ఇప్పటికీ అలాగే అక్కడే ఉంది. ఇప్పుడు దాన్ని గురించి ఆలోచించే సమయం కేంద్రానికి లేదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు మండలిలో కాంగ్రెస్ మెజారిటీగా ఉండేది. ప్రభుత్వానికి చికాకు కలిగించింది. దీంతో కోపమొచ్చిన రామారావు 1985 దాన్ని రద్దు చేశారు. 

చాలా ఏళ్ళ తరువాత, ఎన్నో ప్రయత్నాలు చేసిన తరువాత 2004 లో  వైఎస్సార్ హయాంలో మండలి పునరుద్ధరణ జరిగింది.  జగన్ అనుకున్న మూడు పనులు ఆయన  అధికారంలో ఉండగా జరుగుతాయో లేదో చెప్పలేం. మిగతా రెండు పనులు ఎలా ఉన్నా ఇప్పటివరకు ఏపీకి రాజధాని లేకపోవడంతో రాష్ట్రం నవ్వులపాలైందని చెప్పక తప్పదు. 

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి