Advertisement

Advertisement


Home > Politics - Political News

పవన్ రాజకీయ సన్యాసానికి మోదీ నాంది పలికినట్టేనా..?

పవన్ రాజకీయ సన్యాసానికి మోదీ నాంది పలికినట్టేనా..?

"జగన్ పాలన బాగుంటే.. నేను సినిమాల్లోకి వెళ్లిపోతా, ఇక్కడ నాకు పనేముంటుంది.." అన్న పవన్ కల్యాణ్ ఆమధ్య సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే అందరూ విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ పాలన బాగుంది కాబట్టే.. పవన్ రెండు చేతులూ జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ ఫిలిం నగర్ వెళ్లిపోయారని అన్నారు. అబ్బెబ్బే.. అదేంలేదు, డబ్బు కోసం సినిమాలు చేస్తున్నా, జనం కోసం రాజకీయం చేస్తానని దత్త పుత్రుడు నాలుక మడతపెట్టారు.

ఇప్పుడు సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ చర్యలు భేష్ అన్నారు, సచివాలయ వ్యవస్థ ఏకంగా దేశానికే ఆదర్శం, ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేయాలని ఆకాంక్షించారు. మరిప్పుడు పవన్ కల్యాణ్ సమాధానం ఏంటో..? జనసేనాని ఇప్పుడేమంటారో సగటు జనసైనికుడికే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసుకోవాలని ఉంది.

మోదీ ప్రతి మాటనూ రీట్వీట్ చేసి సంబరపడే పవన్ కల్యాణ్ జగన్ ని ప్రశంసిస్తూ ఆయన చెప్పిన మాటల్ని కూడా కోట్ చేస్తారా? ఇప్పటికైనా జగన్ ని పవన్ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటారా? ఇటీవల అంతర్వేది అంశంపై బాగా రెచ్చిపోయారు పవన్ కల్యాణ్. హిందూత్వం, హిందూవాదం అంటూ కాషాయదళం కంటే అతిగా ఆవేశపడ్డారు. దీపాలు వెలిగించండి అంటూ ఉద్యమం మొదలు పెట్టారు. అమరావతి వ్యవహారంలో కూడా కేవలం తన ఉనికిని కాపాడుకోడానికే పవన్ మూడు రాజధానుల్ని అడ్డగిస్తున్నారు.

ఆయన తీరు చూస్తుంటే కేవలం జగన్ పై ఉన్న అక్కసుతోనే రాజకీయాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు ఏది చేసినా కళ్లు మూసుకున్న పవన్, ఇప్పుడు జగన్ ఏది చేసినా తప్పేనంటున్నారు. ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకున్నవారే అయితే గత ఎన్నికల ఫలితాల తర్వాత డబ్బు ప్రభావంపై పవన్ మాట్లాడే వారే కాదు. 

రెండు నియోజకవర్గాల్లో ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయి తనని ఓడించారని శాపనార్థాలు పెట్టేవారే కాదు. డబ్బే గెలిపింటేట్లయితే.. ముఖ్యమంత్రి కొడుకుగా, స్వయానా మంత్రి హోదాలో పోటీ చేసిన నారా లోకేష్ ఎందుకు పరాభవం పాలయ్యారో పవన్ చెప్పగలరా?  

ప్రధాని మోదీ మాటలు విన్న తర్వాతైనా పవన్ వైఖరి మారాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ పాలనను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, అవసరం లేకపోయినా విమర్శిస్తూ ప్రజల్లో మరింత చులకన కాకుండా ఉంటే బాగుంటుంది. 

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?