Advertisement

Advertisement


Home > Politics - Political News

బీజేపీ కోసం పవన్ అంత ధైర్యం చేస్తారా?

బీజేపీ కోసం పవన్ అంత ధైర్యం చేస్తారా?

దుబ్బాక ఉప ఎన్నికలు నవంబరు 3న జరగబోతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఈ ఉపఎన్నికల్లో ఆయన భార్య సుజాత అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ తరపున రఘునందనరావు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సింపతీ ఓట్లపై టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ ఆలోచిస్తోంది.

ఇప్పటి వరకూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం జరిగింది. ఎన్నికలకు ఇంకా 13రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఈ టైమ్ లో బీజేపీ తరపున జనసేనాని ప్రచారానికి వస్తారనే ఓ ప్రచారం ఊపందుకుంది. చాతుర్మాస దీక్ష ముగించుకున్న పవన్ కల్యాణ్ దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారని, పవన్ ప్రచారం చేస్తే బీజేపీకి మరింత బలం చేకూరుతుందని కొన్ని టీడీపీ అనుకూల వెబ్ సైట్స్ లో వార్తలు రావడం విశేషం.

ఏపీలో రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ కి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేంత సీన్ ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. టీఆర్ఎస్ ని పల్లెత్తు మాట అనడానికి కానీ, కేసీఆర్ని విమర్శించడానికి కానీ ధైర్యం చేయలేని పవన్.. బీజేపీ తరపున ఎలా ప్రచారం చేస్తారనేదే తేలాల్సిన విషయం.

అయితే బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే మాత్రం పవన్ కచ్చితంగా ప్రచారం చేయాల్సిందే. మిత్రపక్షం కోసం ఆమాత్రం చేయకపోతే ఇక పవన్ తో వారికి ఉపయోగం ఏంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహకంగా దుబ్బాకలో పవన్ ని ప్రచారానికి దింపుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. టీఆర్ఎస్ పై రగిలిపోతున్న బీజేపీ ఎలాగోలా తమ ఆధిపత్యం నిరూపించుకోడానికి తహతహలాడుతోంది. మరోవైపు పవన్ మాత్రం కేసీఆర్ పట్ల భయంతో కూడిన గౌరవం వల్ల వచ్చిన వినయాన్ని ప్రదర్శిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ని దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి బీజేపీ ఉపయోగించుకుంటుందా లేదా అనే విషయంపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. 

మోదీకి చిక్కిన కేసీఆర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?