Advertisement

Advertisement


Home > Politics - Political News

తిరుపతి, సాగర్ ఉప ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుందా?

తిరుపతి, సాగర్ ఉప ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుందా?

ఇటు ఏపీలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక, అటు తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక. సరిగ్గా ఈ ఎన్నికలకు నెలరోజుల ముందు జరిగిన పోటీలో.. రెండు చోట్లా అధికార పార్టయే విజయం సాధించింది. అయితే ఈ విజయాలతో అటు వైసీపీ, ఇటు టీఆర్ఎస్ ఉప ఎన్నికలని లైట్ తీసుకోవచ్చా..? నెలరోజుల్లో ఓటర్ల అభిప్రాయంలో మార్పు వస్తుందా? వచ్చినా ప్రతిపక్ష పార్టీలను గెలిపించేంత సీన్ క్రియేట్ చేస్తారా..?

తిరుపతి సంగతేంటి..? తిరుపతి ఉప ఎన్నికల కు నెలరోజుల ముందుగా జరిగిన మున్సిపోల్స్ లో వైసీపీ క్లీన్ విక్టరీ సాధించింది. అందులోనూ తిరుపతి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మన్సిపాల్టీల్లో ప్రతిపక్షాలకు నామమాత్రంగా కూడా సీట్లు రాలేదు. కొన్నిచోట్ల ప్రతిపక్షం జీరో. ఏడు నియోజకవర్గాల్లో అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ దశలో నెలరోజుల వ్యవధిలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ సునాయాస విజయానికే ఎక్కువ ఆస్కారం ఉంది.

అయినా సరే సీఎం జగన్ సహా.. ఎవరూ తిరుపతి ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవడంలేదు. ప్రతి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు, మరో ఎమ్మెల్యే, మంత్రిని ఇన్ చార్జి లుగా వేసి పక్కా ప్లాన్ తో వెళ్తోంది అధికార పార్టీ. మున్సిపల్ ఫలితాలతో డీలాపడ్డ ప్రతిపక్షాలు కూడా.. మెజార్టీ తగ్గించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నాయి. దీంతో తిరుపతిలో విజయం కంటే మెజార్టీయే కీలకంగా మారింది.

సాగర్ లో అంచనాలు మారిపోతాయా..? వాస్తవానికి దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో సాగర్ లో కూడా విజయం సాధించాలని బీజేపీ అంచనా వేసింది. అయితే తాజాగా జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం వెక్కిరించింది. ఓ చోట సిట్టింగ్ స్థానం పోగొట్టుకోవడం, మరోచోట నాలుగో స్థానానికి పడిపోవడంతో కమళదళంలో నిరాశ ఆవహించిందనేమాట వాస్తవం. 

అదే సమయంలో అటు అధికార టీఆర్ఎస్ లో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. వరుస ఓటములలో డీలా పడ్డ ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్సీ ఫలితాలు ఇచ్చిన దన్నుతో సాగర్ లో సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు. బీజేపీది గాలివాటు విజయం అని నిరూపించడానికి ఇదే చక్కని అవకాశం అంటున్నారు.

అయితే సాగర్ లో బలంగా ఉన్న కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థి జానారెడ్డిపై ఆశలు పెట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ దశలోనూ అధికార పార్టీతో కాదు కదా, కనీసం బీజేపీకి కూడా పోటీ ఇవ్వలేకపోవడం కాంగ్రెస్ కి ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్.

త్రిముఖ పోరు గ్యారెంటీ.. అటు తిరుపతిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి పోటీగా బీజేపీ సత్తా చూపించాలనుకుంటోంది.  ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయం తామేనంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్న నేతలు, ఉనికి చాటుకోడానికి ఇదే మంచి మార్గమని అంచనా వేస్తున్నారు. జనసేనను కూడా కాదని పట్టుబట్టి ఆ స్థానంలో పోటీ చేస్తున్న కమలదళం.. ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయినా తలదించుకోవాల్సిందే.

ఇటు సాగర్ లో కూడా త్రిముఖ పోరు ఖాయమైనట్టే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో ఈ పోరు జరుగుతుంది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజేత, కాంగ్రెస్ ది రెండోస్థానం, బీజేపీది మూడో స్థానం. విజేత నోముల నర్సింహయ్యకు 46.34శాతం ఓట్లు రాగా.. జానా రెడ్డి కేవలం 4 శాతం ఓట్ల తేడా(42.04)తో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం జస్ట్ 1.48 మాత్రమే.

అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దాదాపుగా బీజేపీ తొక్కేసింది. ఈ విషయం సాగర్ ఎన్నికలతో మరోసారి రుజువు కాబోతోంది. అయితే కాంగ్రెస్ తో పాటు, టీఆర్ఎస్ ని కూడా వెనక్కు నెట్టి బీజేపీ విజయం సాధిస్తుందా లేక రెండో స్థానంతో సంతృప్తి పడుతుందా, అదీ కాకపోతే జానారెడ్డి స్థానబలానికి తలొంచి, మూడో స్థానంలోనే ఉంటుందా అనేది వేచి చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?