Advertisement


Home > Politics - Political News
ఆర్థిక మంత్రికి అలకా? ఆగ్రహమా?

రాజకీయ నాయకులకు అలక, ఆగ్రహం సాధారణమే. తాము కోరుకున్నది జరగకపోతే, తాము చెప్పింది అధినేత చేయకపోతే వీరికి కోపమొస్తుంది. తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఫీలవుతారు. అధినేతకు బాగా సన్నిహితులైనవారు కూడా ఇలాంటి భావోద్వేగాలకు అతీతులు కారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు మీద ఆగ్రహం కలిగిందో, అలక పూనారో సరిగ్గా తెలియదుగాని, ఆయన రెండు ముఖ్య కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఒకటి సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం. మరోటి చంద్రబాబు ఢిల్లీ పర్యటన.

ఆర్థిక మంత్రిగా కీలక పదవి నిర్వహిస్తున్న యనమల బాబుకు ఎంత సన్నిహితుడో తెలిసిందే. బాబు ఇంత ఎదుగుదలకు ఆయనా ఒక కారణమే. ఇక అసలు విషయానికొస్తే...బాబు ఢిల్లీ వెళ్లింది రాష్ట్రానికి ఆర్థిక సహాయం త్వరగా అందించమని వేడుకోవడానికి. బాబు వినతులు చాలావరకు ఆర్థిక సాయానికి సంబంధించినవే. కాని ఆర్థిక శాఖ మంత్రి ఆయన వెంట వెళ్లలేదు. ఇలా గతంలోనూ కొన్నిసార్లు జరిగింది. ఢిల్లీ పర్యటనకు బాబు వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం డిప్యూటీ వైస్‌ ఛైర్మన్‌ కుటుంబరావు, ఉన్నతాధికారులు ప్రేమ్‌చంద్రా రెడ్డి, రవిచంద్ర వెళ్లారు. ముమ్మిడివరంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో బాబు వెంట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి కమ్‌ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడైన కళా వెంకటరావు పాల్గొన్నారు.

ఉద్దేశపూర్వకంగానే ఈ రెండు కార్యక్రమాలకు యనమల వెళ్లలేదని సమాచారం. ఈయన అడిగిన ఓ కోరికను బాబు పెండింగులో పెట్టారు. అవునని, కాదని చెప్పడంలేదు. ఇంతకూ యనమల కోరిక ఏమిటి? ఆయనకు చాలాకాలంగా రాజ్యసభకు వెళ్లాలనే కోరిక ఉంది. ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా త్వరలోనే ముగుస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందో, రాదో చెప్పలేం. దీంతో రాజ్యసభకు వెళితే హాయిగా కాలం గడపొచ్చని ఆర్థిక మంత్రి భావిస్తున్నారు. ఇదే కాకుండా ఆయన మరో కోరికా కోరారు. తన వియ్యంకుడు, టీడీపీ నాయకుడైన పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు టీటీడీ బోర్డు ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని అడిగారు.

ఈ పదవిని భర్తీ చేసే విషయంలో సుదీర్ఘకాలంగా ఎటూ తేల్చుకోలేని బాబు చివరకు సుధాకర్‌ యాదవ్‌ను ఓకే చేశారు. ఇక్కడే సమస్య వచ్చింది. రాజ్యసభ సీటు కావాలంటున్న యనమల, సుధాకర్‌ యాదవ్‌ ఒకే సామాజికవర్గంవారు. రెండు కీలక పదవులు ఒకే సామాజికవర్గానికి, పైగా బంధువులైనవారికి ఇస్తే టీడీపీ నేతల నుంచే తీవ్ర విమర్శలు వస్తాయని భయపడుతున్న బాబు యనమలకు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఆయన కోపానికి ఇదే కారణమని తెలుస్తోంది. ఇదిలావుండగా, సుధాకర్‌ యాదవ్‌కు టీటీడీ ఛైర్మన్‌ ఇవ్వొద్దని ఆర్‌ఎస్‌ఎస్‌ మోకాలడ్డుతోందని తాజా సమాచారం. ఆయనకు క్రైస్తవ మత సంస్థలతో, సంఘాలతో సంబంధాలున్నాయని, అలాంటి వ్యక్తికి ఇంత కీలక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది.

ఈ విషయంలో బాబు పట్టుదలగా ఉంటే దేవాదాయ శాఖ నిర్వహిస్తున్న బీజేపీ మంత్రి మాణిక్యాలరావుతో రాజీనామా చేయిస్తామంటోంది. సుధాకర్‌ యాదవ్‌ పదవికి పీటముడి పడటంతో యనమల టెన్షన్‌ పడుతున్నారు. మంత్రివర్గంలో బీజేపీకి చెందిన మాణిక్యాలరావుకు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు. దేవాదాయ శాఖ మంత్రినైతే పట్టించుకోవడంలేదనే చెప్పాలి. ఒకవేళ ఆయన రాజీనామా చేసే పరిస్థితి వస్తే మాత్రం రెండు పార్టీల మధ్య చిచ్చు మరింత పెరుగుతుంది. యనమలను బాబు ఏం చేస్తారో చూడాలి.