cloudfront

Advertisement


Home > Politics - Political News

పాత గూటికి ప్రశాంత్‌...?

పాత గూటికి ప్రశాంత్‌...?

ప్రశాంత్‌ కిషోర్‌ ఎవరో ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ వ్యూహకర్త. వైకాపాను అధికారంలోకి తెచ్చేందుకు భారీ ప్యాకేజీ ఇచ్చి తెచ్చుకున్నారు. 2017 నుంచి వైకాపాలో పనిచేస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌ త్వరలోనే ఏపీలో కనబడకపోవచ్చని సమాచారం. వైకాపాను వదిలి వెళ్లిపోతాడని అనుకుంటున్నారు. ఎక్కడికీ పోతావు చిన్నవాడా? అని ఆయన్ని ఎవరైనా ప్రశ్నించారో లేదో తెలియదు. కాని ఆయన తన పాత గూటికి చేరుకోబోతున్నాడని మీడియా కోడి సమాచారం.

పాత గూడు అంటే బీజేపీ. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు ప్రశాంత్‌ గుర్తుకొచ్చాడట...! దేశంలో మోదీ ప్రాభవం తగ్గుతున్న పరిస్థితి కనబడుతుండటంతో గెలుపుపై అనుమానాలు కలుగుతున్నట్లున్నాయి. అందుకే ప్రశాంత్‌ను రప్పిస్తున్నారేమో. ప్రశాంత్‌ ప్యూహకర్తగా వచ్చాక జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో, కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా దారుణంగా ఓడిపోయింది. అప్పుడే ఆయనపై పార్టీ నేతలు పెదవి విరిచారు.

ప్రశాంత్‌కు మొదటి ఓటమి నంద్యాల రూపంలో వచ్చిందని కొందరంటే, ఆయన్ని తెచ్చుకుంది సాధారణ ఎన్నికల కోసమని, ఈ ఓటమి బాధ్యత ఆయనకు ఉండదని ఇంకొందరు అప్పట్లో అభిప్రాయపడ్డారు. నంద్యాల్లో ప్రశాంత్‌ వ్యూహం బెడిసికొట్టిందని, అంచనా తప్పిందని ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఆరువేల ఓట్ల మెజారిటీతో శిల్పా మోహన్‌ రెడ్డి గెలుస్తాడని వ్యూహకర్త వేసిన అంచనా తలకిందులైంది. ఉప ఎన్నిక ఫలితంతో తమకు సంబంధం లేదని ఆయన బృందం చెప్పింది. జగన్‌ బంధువులు కొందరి సొంత వ్యూహాల కారణంగా వైకాపా దెబ్బతిన్నదని వార్తలొచ్చాయి.  

అధికార పార్టీ డబ్బు బాగానే ఖర్చు చేసినప్పటికీ ఎన్నికల వ్యూహం కూడా పకడ్బందీగా రూపొందించిందని, ఈ విషయంలో చంద్రబాబుకు తాము సాటిరాలేకపోయామని వైకాపా నాయకులు కొందరు ఆఫ్‌ ది రికార్డుగా చెప్పారు. చంద్రబాబు ఓటర్లను బెదిరించడం, శిల్పా మోహన్‌రెడ్డి ఇంటిపై పోలీసు దాడులు చేయించడం, సోదాలు జరిపించడం మొదలైనవి ఓటమికి కారణమయ్యాయని టీడీపీ నేతలు అప్పట్లో చెప్పారు. మొత్తంమీద ఉప ఎన్నికలో ప్రశాంత్‌ కిషోర్‌ బృందం పాత్ర ఎంతవరకు ఉందో సరిగ్గా తెలియదుగాని ఆయనకైతే చేదు అనుభవం ఎదురైంది. కాకినాడలోనూ పార్టీ మట్టికరిచింది.

వైకాపా నేతలు చాలామంది ప్రశాంత్‌పై జగన్‌కు ఫిర్యాదులు చేశారు. నేతలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన సమాచారం సేకరిస్తున్న తీరుపై, సర్వేలు చేయిస్తున్న తీరుపై జగన్‌కు కంప్లయింట్‌ చేశారు. మొత్తంమీద చెప్పాలంటే పార్టీలోని ముదురు నాయకులకు ప్రశాంత్‌ నచ్చలేదు. జగన్‌ ఆయనతో ఎలా వ్యవహరించేవాడో తెలియదు. ప్యూహకర్త వ్యూహాల కంటే తన సొంత అభిప్రాయాలకే జగన్‌ ఎక్కువ  ప్రాధాన్యం ఇస్తారంటారు.

సరే...కారణాలు ఏవైనా ప్రశాంత్‌ వెళ్లిపోతే టీడీపీ నేతలు హ్యాపీగా ఫీలవుతారు. జగన్‌ ఆయన్ని వ్యూహకర్తగా నియమించుకున్నప్పటినుంచి టీడీపీ నాయకులు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.  జగన్‌ చేతకానివాడని, సొంతంగా గెలిచే సత్తా లేక వ్యూహకర్తను పెట్టుకున్నాడని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ బంపర్‌ మెజారిటీ సాధించి అధికారంలోకి రావడంలో ప్రశాంత్‌ పాత్ర ఏమిటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆ ఎన్నికల తరువాత బీజేపీతో బంధం తెగిపోయి, కార్యస్థానం బిహార్‌కు మారింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెసు మహా కూటమిని అధికారంలోకి తేవడంలో ప్రశాంత్‌ కీలక పాత్ర పోషించారు.

ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఈ రెండు విజయాల తరువాత ప్రశాంత్‌ పేరు దేశమంతా మారుమోగిపోవడంతో యూపీ ఎన్నికల్లో కాంగ్రెసు రప్పించుకుంది. కాని అక్కడి రాజకీయాల్లో ఈయన వ్యూహాలు ఫలించలేదు. ఇంకా చెప్పాలంటే ఈయన్ని పనిచేయనివ్వలేదు. వైకాపాలో కూడా ఇలాగే జరిగి వుండొచ్చు. ఈమధ్య కాలంలో మోదీ, అమిత్‌ షాలతో ప్రశాంత్‌ అనేకసార్లు సమావేశమయ్యాడు. ప్రాథమికంగా ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగిందట. ప్రశాంత్‌ చేరికపై త్వరలోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.