cloudfront

Advertisement


Home > Politics - Political News

వైసీపీలో రగులుతున్న అసంతృప్తి

వైసీపీలో రగులుతున్న అసంతృప్తి

సామాజిక న్యాయం లేదా?
పట్టున్న కులాలను పక్కన పెడుతున్నారా

వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలోనూ అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ దానికి అనుగుణంగా అడుగులు వేస్తోందా అంటే లేదనే సమాధానం వస్తోంది. వైసీపీ ఇప్పటికీ సరైన ఎత్తుగడలను అవలంబించకపోవడం వల్ల జనాదరణ ఉండి కూడా గెలుపు అంచులను తాకలేకపోతోందని అంటున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే వైసీపీపై అతి పెద్ద విమర్శ పార్టీలోపలా బయటా కూడా గట్టిగా వినిపిస్తోంది. వైసీపీలో సామాజిక న్యాయం పాటించరా అంటూ ప్రత్యర్ధి టీడీపీ బాణాలను సంధిస్తూంటే కక్కలేక మింగలేక అన్నట్లుగా పార్టీలోని వారు ఉంటున్నారు.

విశాఖ అర్బన్‌ జిల్లానే తీసుకుంటే దక్షిణ నియోజకవర్హంలో పెద్ద సంఖ్యలో మత్స్యకార జనాభా ఉంది. టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ కూడా ఆ సామాజికవర్గానికి చెందినవారే. నిన్నటి వరకూ వైసీపీ ఇన్‌చార్జి కూడా ఆ వర్గం వారే. అయితే, అనూహ్యంగా వైసీపీ అధినేత జగన్‌ తన విశాఖ పాదయాత్రలో దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న కోలా గురువులును మార్చేశారు. ఆయన స్ధానంలో అసలు ఆ నియోజకవర్గానికే సంబంధం లేని డాక్టర్‌ రమణమూర్తిని ఇన్‌చార్జిని చేసేశారు.

ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాళింగ సామాజికవర్గం నాయకుడు. ఆయన వృత్తిరిత్యా విశాఖలో ఉంటూ ఓ వైద్యునిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనను ఏరి కోరి మరీ దక్షిణ నియోజకవర్గం నుంచి రేపటి ఎమ్మెల్యేగా జగన్‌ ప్రకటిస్తున్నారంటే ఆ నిర్ణయం ఎంతటి దుస్సాహసమోనని పార్టీలోని వారే అంటున్నారు  దక్షిణ నియోజకవర్హంలో మత్స్యకార సామాజిక వర్గంతో పాటు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి తరువాత బ్రాహ్మణులు ఉన్నారు ఒకవేళ మత్స్యకారులు కాదనుకుంటే మైనారిటీలకైనా ఇక్కడ అవకాశం ఇవ్వాల్సిందన్న మాట వినిపిస్తోంది.

నిజానికి ఇక్కడ వైసీపీకి మైనారిటీల నుంచి కూడా సరైన నాయకుడు లేడు. గతంలో డాక్టర్‌ జహీర్‌ అహ్మద్‌ వైసీపీలో చేరి ప్రాధాన్యత దక్కక పార్టీని వీడిపోయారు. మళ్లీ ఆ సామాజిక వర్గం నుంచి నాయకులను చేరదీసే కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టకపోవడం విశేషం. జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో దక్షిణ నియోజకవర్గంలోని మత్స్యకారులు, మైనారిటీలు కూడా రగిలిపోతున్నారు. తమ ప్రాంతానికి సంబంధంలేని నాయకున్ని ఎలా ఎమ్మెల్యే చేస్తామని కేడర్‌ కూడా మండిపడుతోంది.

ఇదిలా ఉండగా, విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. ఇక్కడ కాపులు  వెలమలు, పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత ఎన్నికలలో వెలమ సామాజిక వర్గానికి టిక్కెట్‌ ఇచ్చిన వైసీపీ ఇపుడు రాజులకు టికెట్‌ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. రియల్టర్‌గా ఉన్న కెకె రాజును తెచ్చి ఇక్కడ పార్టీ ఇన్‌చార్జిని చేశారు. ఆయన పార్టీకే కాదు, నియోజకవర్గ ప్రజలకు కూడా అపరిచితుడు. దాంతో, పార్టీ కేడర్‌ ఆయనకు సహకరించడంలేదు. ఆయనకు ముందుకున్న ఇన్‌చార్జిలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు.

తాజాగా మహిళా నాయకురాలు, మాజీ ఇన్‌చార్జి ఉషాకిరణ్‌ జనసేనలోకి వెళ్లిపోయారు. ఆమె కాపు సామాజికవర్గం నాయకురాలు కావడంతో ఆ ప్రభావం వైసీపీపై బాగానే పడుతోంది. ఇక, భీమిలీ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ కాపు సామాజికవర్గం రాజకీయ ఆధిపత్యం చలాయిస్తోంది. గత మూడు ఎన్నికలలో వరసగా వారే గెలుస్తూ వస్తున్నారు. పైగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉంటూ బలాన్ని బాగా పెంచుకున్నారు. అటువంటి చోట వైసీపీ ప్రయోగాలు చేస్తోంది.

అదే సామాజికవర్గం నుంచి బలమైన నేతను బరిలోకి దించకుండా మహిళా నాయకురాలు ఒకరిని ఇన్‌చార్జిగా నియమించి పార్టీని నడిపిస్తోంది. ఆ నాయకురాలు రేపటి ఎన్నికలలో గంటాకు ఏవిధంగానూ సరిజోడు కాదన్నది అందరూ చెప్పేమాట. మరి వైసీపీ అధినాయకత్వం ఏ దైర్యంతో అక్కడలా చేస్తోందన్నది అంతు పట్టడంలేదంటున్నారు. ఇక, అనకాపల్లి విషయానికి వస్తే, ఇక్కడ కాపులు, గవర కులాలకు పట్టుంది. ఇంకా చెప్పాలంటే గవర కులస్తులు తమ సొంత సీటుగా భావిస్తారు. అటువంటి చోట గాజువాకకు చెందిన గుడివాడ అమర్‌నాధ్‌కు టిక్కెట్‌ ఇస్తోంది వైసీపీ.

ఆయన వలస నాయకుడిగా అపుడే ఇతర పార్టీలు ప్రచారం మొదలుపెట్టేశాయి. పైగా, గవర సామాజికవర్గం కూడా ఇక్కడ వైసీపీ అంటే గుస్సా మీద ఉంది. ఆ సామాజికవర్గానికి చెందిన  నేతలు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారే కావడంతో అక్కడ పార్టీ  పునాదులు కదలిపోయాయి. ఇక, అనకాపల్లి ఎంపీ సీటు విషయానికి వస్తే, రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేని మహిళా నాయకురాలికి ఇవ్వాలనుకుంటున్నారు. ఆమె పార్టీ కోసం పెద్దగా చేసింది లేదని కూడా అంటున్నారు.

మరి, కీలకమైన అనకాపల్లి ఎంపీ సీటుకు బలమైన నాయకున్ని ఎంపిక చేయాల్సి ఉండగా వైసీపీ అధినాయకత్వం మాత్రం ప్రయోగాలు చేస్తోంది. విశాఖ ఎంపీ సీటు విషయంలోనూ అదే విధంగా పార్టీ వ్యవహారం ఉందంటున్నారు. ఇక్కడ జనాలకు పెద్దగా తెలియని ఓ బడా రియల్టర్‌ను తీసుకువచ్చి ఇన్‌చార్జిని చేశారు. ఆయన టీడీపీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. విశాఖ జిల్లాలో గతంలో గెలిచిన వారు ఆ సామాజికవర్గం వారేనన్న అంచనాతో వైసీపీ హైకమాండ్‌ ఆయన వైపు మొగ్గు చూపిందేమోనని అంటున్నారు.

అయితే, ముందు గెలిచిన వారికి వ్యక్తిగతంగా కొంత పలుకుబడి కూడా ఉండడం, పార్టీ బలం కలసివచ్చాయని, వైసీపీ వాటిని ఆలోచించకుండా ప్రయోగం చేయడం వల్ల నష్టమేనని అంటున్నారు. గత ఎన్నికలో వైఎస్‌ విజయమ్మను తీసుకువచ్చి పోటీ చేయించారని, వలస వాదులన్న అపప్రధతో వైసీపీ ఓడిపోవాల్సివచ్చిందని, ఇపుడు కూడా అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే పార్టీపెద్ద పీట వేస్తోందని అంటున్నారు.

దీనివల్ల సామాజిక న్యాయం పాటించకపోవడం ఓ ఎత్తుఅయితే, స్ధానికేతరులన్న ఇతర పార్టీల విమర్శలు కూడా మరో ఎత్తుగా జనంలోకి వెళ్తున్నాయి. ఈ నేపధ్యంలో విశాఖలో మూలవాసులుగా ఉన్న కాపులు, మత్స్యకారులు, బ్రాహ్మణులు, ముస్లిం మైనారిటీలు వైసీపీ అనుసరిస్తున్న వైఖరి పట్ల వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు.

టీడీపీ ఆయా వర్గాలకు పెద్దపీట వేస్తూంటే పోటీగా ఉండాల్సిన వైసీపీ మాత్రం ప్రయోగాలు చేయడం వల్ల చేదు ఫలితాలు వస్తాయోమోనన్న ఆందోళన పార్టీ కేడర్‌లో కనిపిస్తోంది.

జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే 

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే