Advertisement

Advertisement


Home > Politics - Political News

మెజార్టీ ఉంది.. దరిద్రం వదలనంటోంది

మెజార్టీ ఉంది.. దరిద్రం వదలనంటోంది

దేశంలో అత్యంత దారుణమైన ట్రాక్ రికార్డ్ ఉన్న సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా యడ్యూరప్పే అని చెప్పాలి.  ఓసారి రెండున్నర రోజులు, ఇంకోసారి వారం రోజులు సీఎంగా పనిచేసి దిగిపోయిన దరిద్రమైన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. అధికారం ఆయనకు అందినట్టే అంది చేజారిపోతుంటుంది. ఈసారి కాస్త గట్టిగానే దాన్ని ఒడిసి పట్టుకున్న యడ్డీ.. మళ్లీ పాత రోజులు వస్తాయేమోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. కరోనా కష్టాలకు తోడు పదవీ గండం కూడా పొంచి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతుండే సరికి వణికిపోతున్నారు.

తొలిసారి 2007లో కర్నాటకకు ముఖ్యమంత్రి అయ్యారు యడ్యూరప్ప. మిత్రుడు కుమారస్వామి హ్యాండివ్వడంతో 2007 నవంబర్ 12న సీఎం కుర్చీ ఎక్కిన ఆయన.. 19వతేదీ అంటే.. సరిగ్గా వారం రోజులకు దిగిపోవాల్సి వచ్చింది. జెంటిల్మెన్ సినిమాలో ఒక్కరోజు సీఎంలాగా.. యడ్యూరప్పకు వారం రోజుల సీఎం అనే పేరొచ్చింది. తర్వాత ఎన్నికల్లో మంచి మెజార్టీతో 2008లో సీఎం చైర్ దక్కించుకున్నారు. ఈసారి సొంత పార్టీ నుంచే షాక్ ఎదురైంది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అర్థాంతరంగా మూడేళ్లకే 2011లో కుర్చీ దిగాల్సి వచ్చింది.

తర్వాత సొంత పార్టీ పెట్టి నానా ఇబ్బందులు పడి ఎలాగోలా తిరిగి బీజేపీ పంచకే చేరారు యడ్యూరప్ప. 2018లో మళ్లీ సేమ్ సీన్. మెజార్టీ లేకపోయినా కేంద్రంలో బీజేపీ సర్కారు ఉందన్న మొండి ధైర్యంతో.. ఎమ్మెల్యేలను ఎలాగైనా కొనేయొచ్చన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో 2018 మే17న ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. సుప్రీంకోర్టు వెంటనే బలపరీక్ష జరపాలన్న ఆదేశాలతో ఆయన పాచిక పారలేదు. జస్ట్ రెండున్నర రోజులకే పదవి పోయింది. ఆ తర్వాత జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణం అధికారంలోకి వచ్చింది. వారి ముచ్చట కూడా ఏడాదిలోపే తీరిపోయింది.

ఈసారి పార్టీ ఫిరాయింపులపై నమ్మకం పెట్టుకుని ఎలాగోలా గద్దెనెక్కారు యడ్యూరప్ప. రాజీనామా చేసి తిరిగి పోటీ చేసిన 15మందిలో 12మంది గెలవడంతో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. అయితే మెజార్టీ ఉన్నా దరిద్రం ఆయన్ను వదిలేలా లేదు. సొంత పార్టీ నేత ఉమేశ్ కట్టి రూపంలో దరిద్రం వెంటాడుతోంది.

లింగాయత్ వర్గానికి చెందిన మాజీ మంత్రి ఉమేశ్ 8 సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఈసారి మాత్రం ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఏకంగా 20మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు బావుటా ఎగరేశారు ఉమేశ్. తనని మంత్రివర్గంలోకి తీసుకోవాలని, త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో తన సోదరుడు రమేశ్ కట్టికి అవకాశాలివ్వాలనే డిమాండ్లు పెట్టారు. మరో సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ కూడా యడ్యూరప్పపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది, ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు.

గతంలో తన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులిచ్చి ఇలాంటి చెడు సంప్రదాయానికి తానే శ్రీకారం చుట్టారు యడ్యూరప్ప. ఇప్పుడు ఉమేశ్ పెట్టిన కండిషన్లకి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణ చేపడితే అనవసరంగా తేనెతుట్టె కదిపినట్టు అవుతుందని, బైటకెళ్లే ప్రతి ఒక్కరూ ఇలాగే మంత్రిని చేయాలని కండిషన్ పెడితే తన పని అయిపోతుందని టెన్షన్ పడుతున్నారు. అయితే ప్రస్తుతానికి వారి కోర్కెలు తీరుస్తానంటూ రాజీ చేసుకున్నారని సమాచారం.

అటు వైరి వర్గం కూడా యడ్యూరప్ప తిప్పల్ని ఓ కంట కనిపెడుతూ ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బీజేపీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఈసారైనా యడ్యూరప్పకి కాలం కలిసొస్తుందా..? ఆయనకు పట్టిన దరిద్రం వదులుతుందా?

అసలు విషయం మర్చిపోయిన చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?