Advertisement


Home > Politics - Political News
వైఎస్ భార‌తి ముద్దాయి ఎప్పుడైంది రాధాకృష్ణ‌?

మాట‌ను బ‌ట్టి మ‌నిషి గుణాన్ని, రాత‌ను బ‌ట్టి ప‌త్రిక ల‌క్షణాన్ని ప‌సిగ‌ట్టవ‌చ్చు. ఏపీలో కొన్ని ప‌త్రిక‌ల రాత‌లు త‌మ స్థాయిని తామే దిగ‌జార్చుకునేలా ఉన్నాయి. అక్షర‌మే ఆయుధంగా చెప్పుకుంటున్న ఆంధ్రజ్యోతి... ఆ ఆయుధాన్ని ఎవ‌రి ప్రయోజ‌నాల కోసం వాడుతున్నదో ఏపీ ప్రజానీకానికి ప్రత్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. ఆంధ్రజ్యోతి అక్షరం ఆదాయం రుచిమ‌ర‌గ‌డంతో విచ‌క్షణ కోల్పోయి విక‌టాట్టహాసం చేస్తోంది. నిజాన్ని నిర్భయంగా చంపేస్తున్నాన‌నే గ‌ర్వం ఆ అక్షరంలో తొణిక‌స‌లాడుతోంది. ఎంత‌గా అంటే నిందితురాలికి, ముద్దాయికి తెలియ‌నంత‌గా క‌ళ్లు మూసుకుపోయి ప్రజాకోర్టులో దోషిగా నిలుస్తోంది.

రఘురాం (భార‌తి) సిమెంట్స్ ప‌రిశ్రమ‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వైఎస్ జ‌గ‌న్ అక్రమాస్తుల‌కు సంబంధించి ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తిని నిందితురాలిగా చేర్చింది. ఇదే వార్తను ఈనాడు మొద‌టి పేజీలో ఈడీ కేసులో నిందితురాలిగా వైఎస్ భార‌తి శీర్షిక‌తో ఇండికేష‌న్ ఇచ్చి క‌థ‌నాన్ని లోప‌లి పేజీలో ప్రచురించారు. ఆ క‌థ‌నం... భార‌తి సిమెంట్స్ ఫ్యాక్టరీ ప‌రిశ్రమ‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖ‌లు చేసిన ఫిర్యాదులో మొద‌టిసారి వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తిని ఐదో నిందితురాలిగా చేర్చారు.

ఇప్పటి వ‌ర‌కు సీబీఐ దాఖ‌లు చేసిన 11 అభియోగ‌ప‌త్రాల‌తో పాటు ఈడీ దాఖ‌లు చేసిన ఫిర్యాదుల్లో ఎక్కడా భార‌తి ప్రస్తావ‌న లేదు. అక్రమాస్తుల కేసుల్లో మొద‌టిసారి ఆమె పేరు తెర‌పైకి వ‌చ్చింది అని వార్తను మ‌రికొన్ని వివ‌రాల‌తో ఇచ్చారు. ఇదే వార్తను ఆంధ్రజ్యోతి మొద‌టి పేజీలో  ముద్దాయిగా వైఎస్ భార‌తి శీర్షిక‌తో ప్రచురించారు. ఆ వార్తను ఇలా మ‌లిచారు. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయి.

భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేసింది. భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే సీబీఐ మూడు చార్జిషీట్లు (సీసీ 14/2012, సీసీ 24/2013, సీసీ 25/2013) దాఖలు చేసింది. ఈ అభియోగ పత్రాలలో భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తారని గతంలో బాగా ప్రచారం జరిగింది.

కానీ సీబీఐ ఆ పనిచేయలేదు. సీబీఐ వదిలేసినా... ఈడీ దర్యాప్తు నుంచి భారతి తప్పించుకోలేకపోయారు అని మ‌రికొంత వివ‌రంగా వార్తను లోప‌లి పేజీలో కూడా ప్రచురించారు. రెండూ ఎల్లోమీడియాగానే పేరొందాయి. ఈనాడులో నిందితురాలైన భార‌తి, ఆంధ్రజ్యోతికి వ‌చ్చేస‌రికి ముద్దాయిగా తేలారు. ఎంత చిత్రం, విచిత్రం. ఆంధ్రజ్యోతిలో వార్తా క‌థ‌నంలో మాత్రం నిందితురాలిగానే రాశారు. శీర్షిక‌లో మాత్రం ముద్దాయి. ప్రతి ఆదివారం కొత్తప‌లుకు పేరుతో ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణ విలువ‌ల గురించి సుప్రభాతం చెబుతారు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ దెబ్బతో ప‌రువు పోయింద‌ని, రూ.10కోట్లు చెల్లించాల‌ని రాధాకృష్ణ కోర్టు మెట్లు ఎక్కిన విష‌యం తెల్సిందే. రాధాకృష్ణ పిచ్చికాక‌పోతే... ఏదైనా ఉంటే క‌దా సార్ పోవ‌డానికి!